ఉన్నత విద్యాసంస్థలైన యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఔట్‌కం బేస్డ్ ఎడ్యుకేషన్ (ఓబీఈ) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఓబీఈ అనేది ఫలితాల ఆధారిత విద్య. యూనివర్సిటీలు ఎన్ఏఏసీ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) గుర్తింపు పొందాలంటే విధిగా ఓబీఈ విధానాన్ని అనుసరించాలి. అలాగే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు పొందాలన్నా దీన్ని విధిగా అనుసరించాలని గుర్తింపునిచ్చే సంస్థలు నిర్దేశించాయి.
‘ఓబీఈ’ ఆధారిత విద్యకు మూలాధారం ‘బ్లూమ్స్ టాక్సానమీ’. ఈ బ్లూమ్స్ టాక్సానమీ విద్యా ఫలితాలను రిమెంబరింగ్ (జ్ఞాపకం), అండర్స్టాండింగ్ (అవగాహన), ఐప్లె(అమలు చేయడం), ఎనలైజింగ్ (విశ్లేషించడం), ఎవాల్యూయేట్ (మూల్యాంకనం), క్రియేట్ (సృష్టించటం) అని ఆరు భాగాలుగా వర్గీకరించింది. ఈ ఆరింటిని ప్రతి విద్యార్థి వంట బట్టించుకొనే విధంగా నాణ్యమైన విద్య తీర్చిదిద్దుతుంది. ఓబీఈ మూలంగా విద్యార్థులు అన్నిరకాల ఉపాధి అవకాశాలను పొందే నైపుణ్యాలను విద్యార్థి దశలోనే అందిపుచ్చుకొంటారు. ఓబీఈ ఆధారిత విద్య అమలు సులభతరమైనది కాదు. ఈ తరహా విద్యలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలంటే విద్యాసంస్థలో పాత్రధారులైన యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నియామకం చేపట్టేవారు, పూర్వవిద్యార్థుల పాత్ర కీలకం. ఈ పాత్రధారుల భూమికను మూల్యాంకనం చేయటం కోసం ఓబీఈ – స్వీయ అంచనా నివేదిక (సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్) ‘సార్’ను అనుసరిస్తుంది. దీనిలో నిర్దిష్టమైన పది ప్రమాణాలను రూపొందించింది.
‘సార్’ అంటే.. స్వీయ అంచనా నివేదిక. ప్రతి విద్యాసంస్థ ఇందులో పొందుప రిచిన 10 ప్రమాణాలకు సంబంధించిన సమాచారం నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. అవి- 1. విజన్, మిషన్, ప్రోగ్రామ్ విద్యా లక్ష్యాలు. 2. పాలన, నాయకత్వం, ఆర్థిక వనరులు. 3. ప్రోగ్రామ్, కోర్సు ఫలితాలు. 4. పాఠ్యప్రణాళిక, అభ్యాస ప్రక్రియ. 5. విద్యార్థి నాణ్యత, పనితీరు. 6. ఫ్యాకల్టీ, సహకారాలు. 7. పరిశ్రమ, అంతర్జాతీయ అనుసంధానం. 8. మౌలిక సదుపాయాలు. 9. పూర్వ విద్యార్థుల పనితీరు, సంబంధాలు. 10. నిరంతర ఎదుగుదల అనేవి ఉంటాయి. కావున ఓబీఈ అమలు కోసం పాత్రధారుల మధ్య సఖ్యత, సదవగాహన, అనుసంధానం ఆవశ్యకం.
‘బ్లూమ్స్ టాక్సానమీ’ని ఆధారంగా చేసుకొని ‘ప్రోగ్రాం ఫలితాల’కు (పీఓ), ‘కోర్సు ఫలితాల’కు (సీఓ) అనుసంధానం చేయాలి. ఈ తరహా సీఓ-పీఓ పట్టికలను ప్రతి అధ్యాపకుడు బోధనను ప్రారంభించే ముందు తయారుచేయాలి. దీన్నే ‘లక్షిత సీఓ-పీఓ పట్టిక’ అంటారు. అధ్యాపకుడు బోధనా కాలంలో విద్యార్థికి అనేక రకాలైన మూల్యాంకన ఉపకరణాలు, క్విజ్లు, రోల్ ప్లే, ప్రజెంటేషన్స్, పరీక్షలు నిర్వహించి వాటిని మూల్యాంకనం చేసి సీఓ-పీఓ పట్టిక తయారుచేస్తాడు. లక్షిత సీఓ-పీఓ పట్టికకు, యధార్థ సీఓ-పీఓ పట్టికకు, మధ్యగల వ్యత్యాసాలను పోలుస్తూ విద్యార్థి అభ్యాస ఫలితాలను కొలమానం చేస్తారు. ఎంతమంది విద్యార్థులు లక్షిత నిర్దేశాలను దాటారో, ఎంతమంది దాటలేదో బేరీజు వేసుకొని వీటి ఆధారంగా విద్య మెరుగుదల/అభివృద్ధి ప్రణాళికను తయారుచేసుకుంటారు.
అధ్యాపకులు, బోర్డు ఆఫ్ స్టడీస్, అకడమిక్ అడ్వైజరీ కమిటీ, పారిశ్రామిక నిపుణులు, పూర్వ విద్యార్థులతో కలిసి పాఠ్యప్రణాళికలో మార్పుచేర్పులు చేసి సిలబస్‌ను నవీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభకు తగిన బోధన సాధనలకు రూపకల్పన చేస్తారు. ఇలాంటి నవీకరణలు విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరుస్తాయి. అలాగే ఇంటర్న్షిప్స్, ప్లేస్‌మెంట్స్, ర్యాంకింగ్‌లు, అక్రెడిటేషన్ల రూపంలో పాత్రధారులకు ఓబీఈ లబ్ధి చేకూరుస్తుంది.
– డాక్టర్ ఎం.చంద్రశేఖర్‌గౌడ్, 81870 56918
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్)