అంబరాన్ని తాకిన
సంబురాలు ముగిశాయి
ఎగురుతున్న జెండాలు
అలిసి సొలసి పోయాయి
అక్కున చేర్చుకొని దాచుకుందాం!
ఎండనకా వాననకా ఎగిరి
నిస్తేజంగా వాలిపోయి
అలనాటి బానిసత్వాన్ని
గుర్తు చెయ్యక ముందే దాచుకుందాం!
గాలనకా ధూళనకా ఎగిరి
మసక మసకగా మారిపోయి
ఆనాటి చీకటి రోజులను
గుర్తు చెయ్యకముందే దాచుకుందాం!
అటు కదిలి ఇటు కదిలి
తలకిందులై రాలిపోయి
గుండెల్లో దిగిన తూటాలను
గుర్తు చెయ్యకముందే దాచుకుందాం!
ఎక్కడ బడితే అక్కడ
ఎటు బడితే అటు పడిపోయి
చెత్త కుప్పల్లో చేరిపోయి
సిగ్గుతో తలదించుకోకముందే
తలెత్తుకునేలా గౌరవంగా దాచుకుందాం!
ఎన్ని జెండాలు ఎగరేసినా
సమానత్వం సాధించకపోతే
అసమానతలను జెండా మడతల్లో
ఇంకెన్నాళ్లని దాచుకుందాం!
ఎంత దేశభక్తిని చాటి చెప్పినా
కులమతాల రక్కసిని కూలదొయ్యకపోతే
రాలిన కన్నీళ్లను దేశం గుండెలో
ఇంకెన్నాళ్లని దాచుకుందాం!
జెండాలు ఎగరెయ్యడమే కాదు
ప్రశ్నలై ఎగసి ప్రగతి దారిన పయనిద్దాం
దేశాన్ని ఒక్కటిగా చూడటమే కాదు
మనుషులనూ ఒక్కటిగా నిలుపుదాం!
– పుట్టి గిరిధర్
94914 93170