ఐఎంఎఫ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయినప్పటికీ, మన దేశంలోని అనేక నగరాల్లో ఖరీదైన విల్లాల పక్కనే మురికివాడలు దర్శనమిస్తాయి. ముంబైలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి అందుకు నిదర్శనం.
Bharat | మన దేశ వృద్ధి అంతంతమాత్రంగానే ఉండి, ఆదాయ అసమానతలకు దారితీయడానికి ఒక కారణం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నాణ్యమైన విద్య, ఆరోగ్యంపై తక్కువ పెట్టుబడులు పెట్టడమే ఆదాయ అసమానతలకు ప్రధాన కారణమని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ గతంలో పేర్కొన్నారు. తద్వారా అధిక ఆదాయ వర్గాల్లోని విద్యావంతులు, ఆరోగ్యవంతులు వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి డబ్బు సంపాదించేందుకు ఎక్కువ అవకాశాలను పొందారు. అదే సమయంలో అత్యల్ప ఆదాయ వర్గాల్లోని నిరక్షరాస్యులైన కార్మికులు ఇప్పటికీ రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకే కష్టపడుతున్నారు.
ప్రపంచ అసమానతల నివేదిక- 2022 ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక ఆదాయ అసమానతలు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశ వృద్ధిని గొప్పగా ప్రచారం చేస్తున్న మీడియాలోని ఒక వర్గం అంతర్గత సమస్యలను కప్పిపుచ్చుతున్నది. విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు ఇటీవల ఒక వార్త హల్చల్ చేసింది. ప్రజల ఆదాయం పెరిగినట్టు దీని ద్వారా పైకి తెలుస్తున్నప్పటికీ.. అసలు వాస్తవం వేరే ఉన్నది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో లక్షల మంది విమాన ప్రయాణం చేసినంత మాత్రాన ఆదాయం పెరిగినట్టు కాదు. అమెరికాలో ఆదాయ అసమానతలు భారీగా ఉన్నప్పటికీ, ఆ దేశ ప్రజలు కూడా విమానయానం ఎక్కువగానే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగినంత మాత్రాన దేశంలో అసమానతలు తగ్గి, ఆదాయ పంపిణీ మెరుగైనట్టు కాదు.
గృహ సర్వేల ఆధారంగా అసమానతలను పలు సర్వే సంస్థలు అంచనా వేస్తాయి. అయితే, ఇవన్నీ స్వీయ ప్రకటిత ఆదాయాలపై ఆధారపడి చేసిన సర్వేలే. విదేశాల నుంచి లభించే ఆదాయాలు లేదా నల్లధనం ఈ నివేదికలకు చిక్కవు. అందుకే, నివేదికల్లో పేర్కొన్న దానికంటే మరింత ఎక్కువగా వాస్తవ అసమానత ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ, ఈడీల చేతికి చిక్కకుండా ఉండేందుకు ధనవంతులు నల్లధనాన్ని ఎక్కువగా విదేశాల్లో దాచిపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. షెల్ కంపెనీలు, అనామక ట్రస్టుల ద్వారా నిధులు మళ్లిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకుంటున్నారు. విదేశాల్లో నల్లధనం దాచిన చాలామంది భారతీయుల వివరాలను 2013లో పనామా పేపర్స్ బహిర్గతం చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) నివేదిక ప్రకారం.. 1948-2008 మధ్యకాలంలో 213.2 బిలియన్ డాలర్ల నల్లధనం మన దేశం నుంచి తరలిపోయింది. అయితే, సరైన ఆధారాలు లేకపోవడం, అంతర్జాతీయంగా ఉండే సంక్లిష్టతల కారణంగా వారిపై చర్యలు తీసుకోవడానికి వీల్లేకుండాపోయింది.
సాధారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందితే.. అది పన్నులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి. ఉదాహరణకు వ్యాపారాలు వృద్ధి చెంది కంపెనీలకు ఎక్కువ లాభాలు వస్తే.. కార్పొరేట్ పన్ను పెరుగుతుంది. ఉపాధి పెరగడం ద్వారా ఆదాయ పన్ను పెరుగుతుంది. ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయడం మూలంగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి. కానీ, వేగవంతమైన ఈ వృద్ధి సంఘటిత రంగంలో ఉద్యోగాలను సృష్టించడం లేదు. అందువల్ల ఎక్కువమంది అసంఘటిత రంగంలో పని చేస్తూ పొట్ట పోసుకోవాల్సి వస్తున్నది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పటికీ ప్రజల ఆదాయం మాత్రం మందగిస్తున్నది. అంతేకాదు, తత్ఫలితంగా జీడీపీ కూడా తగ్గుముఖం పడుతున్నది. అందరి భారం తామే ఎందుకు మోయాలనే ఉద్దేశంతో చాలామంది పన్నులను ఎగవేసేందుకు దారులు వెతుకుతున్నారు.
సంపద, ఆదాయ పంపిణీలో తీవ్రమైన అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం వెనుకబాటుతనానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. 2014లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పెరుగుతున్న ఆదాయ అసమానతలు, ప్రజాస్వామ్య వెనుకబాటుతనానికి మధ్య స్పష్టమైన సంబంధం ఉంది. ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, సబ్సిడీలు ప్రజల మధ్య ఉన్న ఆదాయ అసమానతలను తగ్గించడంలో విఫలమయ్యాయనే చెప్పాలి. అంతేకాదు, ఇవి ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి మద్దతును కూడగట్టడంలోనూ విఫలమయ్యాయి. అందుకే బీజేపీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయ అసమానతలు లేని, సంపద పంపిణీ అందరికీ సమానంగా జరిగే ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరమున్నది.
– (‘ది వైర్’ సౌజన్యంతో)
( దేవ్ కర్ )