మేం యాదవులం. మా ఇలవేల్పు మల్లన్న దేవుడు. అందుకే మా అత్తామామ నా పెనిమిటికి ‘వేల్పుల మల్లయ్య’ అని పేరు వెట్టిర్రేమో! ఇగ మూడేండ్లకోసారి మల్లన్న పట్నాలేసుకునుడు మా ఇంట్ల ఎన్కటికెళ్లి అస్తున్న పద్ధతి. ఎప్పట్లెక్కనే ఈసారి గూడ ఇంట్ల ఒగ్గు డప్పును తిప్పే కాలమొచ్చింది. అందుకే, మూణ్నాలుగు రోజుల సంది మా మల్లయ్య నన్ను నిల్సున్నకాడ నిల్సోనిస్తలేడు, కూసున్నకాడ కూసోనిస్తలేడు.
‘ఔనే లచ్చవ్వా… ఊరంతా ఒక్కసారే పట్నాలేసుకుంటమంటే ఆ ఒగ్గోళ్ల సీనన్న ఏడికని ఉర్కుతడు, ఎంతమందికని వోతడు? ఎవరి ఎల్లువాను తీరు వాళ్లు వారానికొగలు పట్నాలేసుకుంటే ఒగ్గోళ్ల సీనన్నకు గూడ సాయం జేసినోళ్లమైతం గదా?’ అని నడీ మంచంల నడుమాల్శి మొత్తుకుంటనే ఉన్నడు.‘అయ్యో ఆగరాదుల్లా, పట్నాలు మా ఏస్కుందాం గని. పట్నాలేసుకోకుంటే ఆ మల్లన్న దేవుడూకుంటడా?’ అని జవాబిస్తనే ఉన్న. నడిమిట్లనే.. ‘అగ్గొ… ఇగ గంగ తానానికి పోవద్దా? కొన్నొద్దులైతే మళ్లా తీరువాటం ఉండది, ఇగ నీ ఇట్టం. పొలం కోతకచ్చినన్క పోదాం పా అంటే మాత్రం నేనైతే రాను’ అని బెదిరియ్యవట్టిండు మా మల్లయ్య. ఇంతల మా శిన్నోడు రాజు రానె అచ్చిండు. ‘అవ్వా.. కారు మాట్లాడిన. రేపు ఎగిలివారంగనే ఇంటికస్తది. జెప్పన పండుకోర్రి, పొద్దున్నే లేసి అందరికందరం కాళేశ్వరం పొయ్యొద్దాం’ అని నిర్ద వోయిండు.
మా శిన్నోని మాట ఇనంగనే ‘ఎహ్హె నీ అవ్వ.. ఇంట్ల అవ్వా కొడుకులదే మొత్తం నడుస్తున్నది పోర్రి..’ అని మా మల్లయ్య కారడ్డమాడవట్టిండు. ‘నీకు ఇయ్యాళ్ల నిర్దొస్తలేదా? ఎమో కారడ్డాలు బాగాడుతున్నవ్’ అని ఇట్లకెళ్లి అంటనే ఉన్నా.. అట్లకెళ్లి గుర్ర్ర్.. గుర్రుమని గుర్క రానే అస్తున్నది. మా మల్లయ్య గొర్లు కాసుడు బంజేసి, ఎవుసం జేయవట్టి పదిహేనేండ్లాయె. మాకున్నది కొద్దిగంత భూమి, ముగ్గురు కొడుకులు. ఆళ్లు నపరో సార్గం జేస్తనే ఉంటరు గనీ, ఎవుసం మాత్రం మా ఆయ్ననే జేస్తడు. పొద్దున గంగ తానానికి పోవుడుంది గదాని ఎక్కడోళ్లక్కడ నిర్దవోయిర్రు. ఆ పని, ఈ పని జేసేసరికి నాకే ఆల్షమైంది. ఆడోళ్లకు తప్పుతదా ఇంటి పని? నేను గూడ వొయ్యి ఇగ నడుమాల్షిన.
ఎగిలివారంగ మూడు గొడ్తున్నది. ‘రాజూ.. ఓర్రాజుగా…’ అని మా శిన్నో న్ని లేపుతనే ఉన్నడు నా పెనిమిటి. నిర్దలేసిన శిన్నోడు డ్రైవర్‌కు ఫోన్జేసరికి రానే అచ్చింది కారు. ఇంటోళ్లందరం అన్ల గూసున్నం. మా తొవ్వ కాళేశ్వరం గుడికాడికి సాగుతున్నది. అక్కడ మూడు నదుల నీళ్లు వారుతయి. మల్లన్న పట్నాలేసుకునే ముందు అక్కడ గంగ తానం జేస్తే సుట్టో.. ముట్టో.. ఏమున్నా వోతదని మా నమ్మిక. ఎనిమిది గొట్టేసరికి కాళేశ్వరం గుడికాడికి శేరుకున్నం. ఒక్కొక్కలు వొయి గంగల మునిగి, తానం జేసి గడ్డకు ఎక్కుతనే ఉన్నరు. మా మల్లయ్య గూడ గంగల మునిగి తానం జేసిండు. అప్పటిదాకా మంచిగనే ఉన్నడు గని, ఒక్కసారిగ ఏమైందో ఏమో గడ్డమీదికొచ్చి నిల్సున్నకాన్నే కూలవడ్డడు. ‘మల్లన్నా, ఓ మల్లన్నా..’ అని మాతోని అచ్చిన కులపోళ్లు అమాంతం లేవట్టుకొచ్చి కార్ల పండవెట్టిర్రు. కొద్దిసేపటికి క్యాలికచ్చిన మల్లయ్య ‘రాజు, అరేయ్ రాజు.. నాకంత ఎటో అయితందిరా.. పెయ్యంత తిమ్మిర్లొస్తున్నయి, కండ్లు మూతలు వడ్తున్నయి’ అని మా శిన్నోనికి శెప్పవట్టిండు. ఇగ లాభం లేదని మల్లయ్యను వట్టుకొని అదే కార్ల కన్నారం దావఖానకు ఏస్కచ్చినం.
మార్చి 28, శుక్లారం నాడు, మజ్జాన్నం ఒంటిగంటకు మా మల్లయ్యను జూసిన కన్నారం డాక్టర్లు… ‘తీపిరోగం’ ఉన్నది గదా? మెల్లగా మా తక్కువైత ది, మీరేం పరేషాన్ గాకుర్రి’ అని ధైర్నం జెప్పిర్రు. డాక్టర్ల నోట ఆ మాటిన్న మాకు పొయిన పానం లేసచ్చినట్టయింది. మజ్జాన్నం నుంచి మందో, మాకో మా ఇస్తర్రు గదా, ఇగ మంచిగనే ఐతడు మా మల్లయ్య అని నేన్గూడ ధైర్నంగనే ఉన్న. ఇంతల ఒక డాక్టర్ మా దగ్గరికచ్చి ‘మల్లయ్య కొంచెం సీరియస్ ఉ న్నడు. శనారం, ఐతారం రెండ్రోజులు కన్నారం డాక్టర్లు అందుబాటులుండ రు. రేపు మల్ల ఏమన్న జర్గరానిది జర్గితే మొత్తానికే మోసమైతది. ఎందుకైన మంచిదే ఇప్పుడు మల్లయ్యను వట్టుకొని మీరు పట్నం బోతనే మంచిది’ అని సావు కబురు సల్లగ జెప్పిండు. ‘నాత్రి పది గొడ్తున్నది, గీ నాత్రి ఎక్కడికి వోతం సార్?’ అనడిగితే.. ‘ఇగ మీ ఇట్టం’ అని లచ్చ రూపాల బిల్లు శేతిల వెట్టిండు. అప్పటిదప్పుడు మా కొడుకులు లచ్చరూపాలు సగవెట్టి బిల్లు గట్టిర్రు. అంబులెన్స్ మాట్లాడుకొని అదే నాత్రి మా మల్లయ్యను పట్నం దవాఖానకేస్కచ్చినం.
శనారం నాడు మబ్బుల మూడు గొట్టేసరికి గాంధీ దావఖానకు శేరుకున్నం. అదేదో.. ఎమర్జెన్సీ వాడనట! అంబులెన్స్ సీద వొయ్యి అక్కన్నే ఆపింది. గంటాయె డ్రైవర్ బండి ఆఫ్జేసి, డాక్టర్లచ్చి ‘ఏమైందని’ మందలిచ్చుడు లేదు, మేం బోతే వాళ్లచ్చుడు లేదు. తెల్లారి తొమ్మిది కావట్టింది. మొగోళ్లను ఎటూ పట్టించుకుంటలేరు, ఆడిదాన్ని నన్ను జూసన్న జర జాలివడుతరేమోనని ‘సారూ.. జర నా పెనిమిటిని జాయిన్ జేస్కోరి’ అనడిగితే అక్కడున్నాయ్నె కొట్టుడే మా తక్కువ, నా మీదికి కయ్యిమని లేసిండు. దెబ్బకు జడ్సుకున్న. ‘మీరు ఇక్కడ నాలుగ్గంటలున్నా వాళ్లు మిమ్మల్ని షరీఖ్ జేస్కోరు. మీరే వొయ్యి వీల్‌చైర్ ఎక్కడుందో దొర్కవట్టుకొని మీ నాయినను లోపల్కి పట్కవోర్రి’ అని అక్కడెవ్వలో చెప్తే మా శిన్నోడు వీల్చేర్ కోసం పోయిండు. పోయి అద్దగంటైనా వాడొస్తలేడు. ఫోన్దీసి వానికి గల్పిన. ‘ఏమైందిరా రాజు, ఇంకా అస్తలెవ్వు?’ అనడిగితే.. ‘రాజు ఎవ్వలమ్మా.. రాజు లేడు గాజు లేడు’ అని జవాబియ్యవట్టిండు. ‘అగ్గొ ఇది మావోని ఫోను గదా, నీ దగ్గరికి ఎట్లచ్చింది సార్’ అని మళ్లడిగితే అప్పుడు శెప్పవట్టిండు.. ‘మీవోడు నా దగ్గర ఫోన్ కుదవెట్టి వీల్చేర్ తీస్కవోయిండమ్మ నువ్వు ఫోన్ పెట్టెయ్యి’ అని కట్జేసిండు. అట్ల ఫోన్ కటైందో లేదో… మా శిన్నోడు కుర్సీ వట్టుకొని రానే అచ్చిండు.
‘లెవ్వకుండున్న మనిషిని నలుగురం అమాంతం బట్టుకొని ఆ కుర్సీల బల్మీట్టికి కూసోవెట్టినం. లోపల్కి పట్కవొయినంక నరాల వాడ ఎక్కడుంటదని అడుగుతే పట్టించుకున్నోడే లేడు. ఇంతల అట్నుంచి వోతున్న ఓ మనిషి.. ‘అమ్మా… ఇక్కడెవ్వలేం జెప్పరు, సీద పట్కవొయి అక్కడ బెడ్లుంటయి, దాన్ల పండుకోవెట్టుర్రి. మీ ఆయనకు నూకలు బాకీ ఉంటే డాక్టరొస్తడు, లేకుంటే లేద్’ అని శెప్పవట్టిండు. ఆయన అన్నట్టే అక్కడున్న బెడ్డు మీద మా మల్లయ్యను పండవెట్టి మూడు గంటలైంది గని, డాక్టరచ్చింది లేదు, చెయ్యి వట్టింది లేదు. నాకే ఇగ తిక్కలేసింది. ‘సీఎం సారూ.. నీకు, నీ దవాఖానకో దండం’ అని మన్సులనుకొని ‘అరేయ్ రాజుగా.. ఉన్నదమ్ముడువోయినా మంచిదేరా? ఇక్కడుంటే మీ బాపు బతుకడురా..’ అని గాంధీ దావఖాన్లకెళ్లి బయటికొచ్చినం. అట్ల తీస్కచ్చినం కావట్టే.. మా మల్లయ్య ఇగొ గిట్ల మూడు బుక్కల అన్నం దినుకుంట, మా కండ్లకు కనవడ్తున్నడు.
– గడ్డం సతీష్ 99590 59041