‘ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి’ అన్నట్టుగా దేశం యావత్తు ఒకే మహదావేశమై పేనుకొని, మన సైన్యం శత్రు నిర్మూలనానికి సమస్త శస్ర్తాస్ర్తాలతో సమరోత్సాహంతో పూనుకొని అప్రతిహతంగా సాగిపోతుంటే హఠాత్తుగా విరమణ ఏమిటి? అమెరికా మధ్యవర్తిత్వమా? కాల్పుల విరమ ణా? తెల్లవార్లూ జరిపిన మధ్యవర్తిత్వంలో ఉభయపక్షాలు ఒప్పుకున్నాయట. ఇదీ అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన మాట. ఈ మాట జాతి యావత్తునూ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకూ కాల్పుల విరమణకు భారత్ ఎందుకు అంగీరించింది? దేశ ప్రజల్లో తీవ్ర తర్జన భర్జన. పహల్గాం ఉగ్ర ఘాతుకంతో సహనాన్ని కోల్పోయి న దేశం ‘సమరమే’ అని గర్జించింది. నేలరాలిన సిందూరం సాక్షిగా సైన్యం తుపానులా చెలరేగి శత్రు శిబిరాలను నిర్జించింది. ఇదొక చరిత్రాత్మకమైన సం దర్భం. భారత్ చర్యకు ఇంతకన్నా సానుకూల స్పం దన మరెన్నడూ రాదు. ఏ దేశమైనా తనకు పైచేయి గా ఉన్న తరుణంలో రణ విరమణకు సిద్ధమవుతుందా? అనేది దేశ ప్రజలను వేధిస్తున్న ఒక మహా ప్రశ్న. దేశమంతా ఒక్కతాటి మీదికి వచ్చి ఉన్మాదులను దునుమాడాలని, మరోసారి ఉగ్రవాదం తలెత్తకుండా కూకటివేళ్లతో సహా పెకిలించి వెయ్యమని ఆదేశించింది, ఆకాంక్షించింది. అదే సమయంలో శత్రుదేశమైన పాకిస్థాన్ కవ్వింపు కారణంగా సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందులో ఒకదానిని మరొక దానినుంచి వేరుచేసి చూడటం సాధ్యం కాదనే ప్రజలు భావిస్తున్నారు. కకావికలమైపోయి శత్రువు అటూ ఇటూ పరుగులు తీస్తున్న సమయం ఇది.
ఇంతకూ శత్రువులో పరివర్తన వచ్చిందా? మళ్లీ తన గడ్డ మీద ఉగ్రమూకలను పెంచిపోషించబోనని ఒప్పుకొన్నదా? తను చేసిన తప్పులకు అడ్డంగా దొరికిపోయినా శత్రువులో మార్పు రాలేదు. పైగా ఆ ధోరణి వీడను అని చాటి చెప్తున్న సందర్భం. అందుకు భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైనికాధికారులు హాజరుకావడమే ఒక పెద్ద నిదర్శనం. శత్రువు మారలేదు. కథ కంచికి చేరలేదు. కానీ, ఇంతలో కాల్పుల విరమణా? అసలు ఈ అమెరికా మధ్యవర్తిత్వం అనేది ఎక్కడినుంచి వచ్చింది? సైన్యానికి చర్యలు తీసుకోవడంలో స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కేంద్రం పదే పదే ప్రకటించిం ది. ఇప్పుడు సైనిక చర్య లక్ష్యసాధన దిశగా దూసుకుపోతుంటే హఠాత్తుగా కాల్పుల విరమణ అంటూ దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఏమొచ్చిం ది? ఇలాంటి సందర్భాల్లో ఇజ్రాయెల్ లాంటి మరే ఇతర దేశమైనా ఇందుకు ఒప్పుకొంటుందా? అనేది ఆలోచించాల్సిన విషయం. పైచేయి సాధించడానికి అవకాశం వచ్చిన ప్రతీసారి ఏదోరకంగా బయటి శక్తులు అడ్డుపడి కాల్పుల విరమణో, మరోటో తెరమీదికి తెచ్చి మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి రాకుండా మురగబెడుతున్నాయనే విసుగు దేశంలో ఎప్పటినుంచో ఉన్నది. ఈసారి మరీ దారుణం ఏమిటంటే ట్రంప్ మనకు ‘కామన్ సెన్స్’ ఉందని కితాబిచ్చి మరీ భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టడం!
ప్రస్తుతం సైనికాధికారుల (డీజీఎంవో) స్థాయిలో కాల్పుల విరమణకు సంబంధించిన విధివిధానాల గురించిన చర్చలు జరుగుతున్నట్టుగా వార్తలు వెలుగుతున్నాయి. ఇవి సైనిక కార్యాచరణకే పరిమితం. కానీ, రాజకీయ లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే, ఈ సైనిక చర్య ప్రారంభించడానికి వెనుక గల భారతదేశపు ఆకాంక్ష మాటేమిటనేది ఎవరూ మరిచిపోరాదు. నిజమే, కశ్మీర్ అనేది దీర్ఘకాలికమైన వ్యవహారమే. కానీ, ఆపరేషన్ సిందూర్‌కు తక్షణ కారణం పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలు పన్నిన పహల్గాం కుట్రే కదా! అవి మొత్తంగా ధ్వంసమైనట్టుగా, అదే సమయంలో పాకిస్థాన్ ఇంకెప్పుడూ ఉగ్రవాదులను పెంచి పోషించబోనని హామీ ఇచ్చినట్టుగా ఎక్కడైనా సూచనలు కనిపించాయా అంటే అవేమీ లేవు. ఇవాళ భారత ప్రజల మనసులను వేధిస్తున్న సంగతి ఇదే. కేంద్ర ప్రభుత్వం అమెరికా మధ్యవర్తిగా వచ్చినంత మాత్రాన ఎందుకు ఒప్పుకోవాలి? తనకున్న పైచేయి పరిస్థితిని ఎందుకు వదులుకోవాలి? అనేది ఇక్కడ కీలక విషయంగా నిలిచింది. భారత్‌లో సైన్యాన్ని నడిపించేది ఎప్పటికైనా పౌర నాయకత్వమే. కాకపోతే ఆ పౌర నాయకత్వం సైన్యాన్ని ప్రయోగించినందుకు ఆశించిన ఫలితాన్ని పొందిందా? చరిత్రలో ఇలాంటి అవకాశాలు కొన్నిసార్లే లభిస్తాయి. వాటిని ఎలా అందిపుచ్చుకున్నామనేది నాయకత్వ ప్రతిభకు గీటురాయి గా ఉంటుంది. ఈ నేపథ్యంలో కనీసం పాక్ నుంచి విస్పష్టమైన హామీలైనా పొందామా అనేది ప్రస్తుత నేపథ్యంలో ప్రశ్నార్థకమైపోయింది.