మొన్న శ్రీలంక, నిన్న బంగ్లా, నేడు నేపాల్.. దక్షిణాసియా దేశాలు వరుస వెంబడి సంక్షోభాల పాలుకావడం మనం చూస్తున్నాం. ఇవన్నీ భారత్కు కీలకమైన ఇరుగుపొరుగు దేశాలు. ఈ మూడింటిలోకి తాజాగా పెల్లుబుకిన నేపాల్ తిరుగుబాటే అత్యంత ఉగ్రరూపంలో వ్యక్తమైంది. సాధారణంగా ప్రజా తిరుగుబాట్లు సంభవించినప్పుడు సామాన్యులే హింసకు బలవుతుంటారు. కానీ, నేపాల్లో జరిగింది అందుకు భిన్నం. మంత్రులను వీధుల్లో ఉరికించి కొట్టారు. పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. ఓ మాజీ ప్రధాని భార్య అల్లర్లకు ఆహుతి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. అధికార సౌధాలు కాలిబూడిదయ్యాయి. శాంతిభద్రతల యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. రాష్ట్రపతి, ప్రధాని రాజీనామా చేశారు. సైన్యం రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేయాల్సి వచ్చింది. ఇంతకూ ప్రజాగ్రహం ఇంతలా కట్టలు తెంచుకోవడానికి కార ణం ఏమిటి? ప్రభుత్వాన్ని భస్మీపటలం చేసిన ‘జెన్-జెడ్’ ఏం కోరుకుంటున్నది?
గత కొన్నాళ్లుగా కుతకుతలాడుతున్న అగ్నిపర్వతంలా నేపాల్ ఉన్న సంగతి తెలిసిందే. రాజరికాన్ని రద్దు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న ప్రజల్లో ప్రస్తుత పాలకుల మీద పేరుకుపోయిన అసంతృప్తి ఈ తిరుగుబాటు రూపంలో బయటపడింది. ఇదివరకటి దక్షిణాసియా తిరుగుబాట్ల తరహాలోనే నేపాల్లోనూ నేతల అవినీతి, బంధుప్రీతి, బాగుపడని బతుకురీతి.. ఈ మూడు ప్రధా న కారణాలుగా కనిపిస్తున్నాయి. నేపాల్లో 15-24 ఏండ్ల నవ యువతలో నిరుద్యోగం 20.8 శాతం ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఇది దక్షిణాసియాలో అత్యధికం. దాంతో యువతకు వలసలే దిక్కయ్యాయి. నేపాల్ జీడీపీలో మూడో వంతు విదేశాల నుంచి నేపాలీయులు పంపే వేతనాలే. స్వదేశంలో ఉపాధి అవకాశాలుంటే విదేశాలకు పోవాల్సిన ఖర్మ ఏమిటనేది యువత ప్రశ్న. కటిక పేద దేశంలో సంపన్న వర్గాల విలాస జీవితాలు ఆకలితో నకనకలాడే యువతరానికి కంపరం పుట్టిస్తున్నాయి. ఉపాధి కరువు, ధరల బరువు కుంగదీస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత రాజుకున్నది. 2008 లో రద్దు చేసిన రాజరిక పునరుద్ధరణ డిమాండ్లు ముందుకు రావడానికి ఈ నేపథ్యమూ కొంతవరకు కారణం.
ఓ చిన్నారిని అధికారిక వాహనం ఢీకొంటే అల్లంత దూరంగా ఎగిరిపడిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ ఘటనే పేలేందుకు సిద్ధంగా ఉన్న మందుగుండుకు నిప్పు కణిక అయిందంటున్నారు. ప్రజలు వీధుల్లోకి రావడంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం వారి కష్టాలను తెలుసుకుని అనునయించేందుకు బదులుగా బలప్రయోగా న్ని ఎంచుకున్నది. సోషల్ మీడియా నిషేధాలతో ఆందోళనను నియంత్రించాలని చూడటంతో ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. దాని ఫలిత మే ఈ తిరుగుబాటు. తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీ పేరు ముందుకువచ్చింది. ఈ కల్లోలాన్ని అదుపు చేసి వీలైనంత త్వరలో ప్రజాస్వామిక వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సన్నిహిత సంబంధాలు కలిగిన పొరుగు దేశంగా భారత్ కోరుకునేది ఇదే.