కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కాలంలో కార్పొరేట్ దవాఖానల తీరుతెన్నులతో పాటు వైద్యంలో వివిధ పద్ధతులు కూడా తెరమీదకు వచ్చాయి. దీంట్లో భాగంగానే అక్కడక్కడ సత్ఫలితాలిస్తున్న హెర్బల్ మందుల వైపు ప్రజల దృష్టి మళ్లింది. దీంతో స్థానిక వైద్యం, సంప్రదాయ చికిత్స గురించి చర్చ మొదలైంది. ఎబోలా, సార్స్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు స్థానిక వైద్యం నిర్వహించిన పాత్రను పరిగణనలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌వో కరోనాపై హెర్బల్ మందుల ప్రయోగాలకు పచ్చజెండా ఊపింది.
ఇప్పుడు ప్రపంచ దేశాలు తిరిగి సహజసిద్ధ ఔషధాలపై దృష్టిసారిస్తున్నాయి. సంప్రదాయ చైనీస్ మెడిసిన్, భారతీయ వైద్యం, కొరియన్ వైద్యం, యునాని, సిద్ధ లాంటి వైద్యాలపై క్రమబద్ధమైన అధ్యయనం జరుగుతున్నది. మొక్కల్లో ఉన్న బయో ఆక్టివిటీపై ఇప్పటివరకు శాస్త్రీయంగా పరిశోధన జరిగినప్పటికీ మానవాళిపై వీటి ప్రయోగ ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది.
మనదేశంతో పాటు అమెరికా, చైనా, ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్, జపాన్, కొరియా, యారోపియన్ ప్రాంతాలు, తూర్పు మధ్యధరా ప్రాంతాలతో పాటు, ఆస్ట్రేలియన్ ప్రాంతాల్లో సంప్రదాయ వైద్యాల వాడకం ఎక్కువ ఉండేది. వ్యాపారాత్మక ధోరణితో ఇంగ్లీషు మందులు ముందుకురావడంతో మానవజాతి సేకరించిన విజ్ఞానం మూలనపడ్డది. సంప్రదాయ వైద్యాలు చాలా ప్రభావాన్ని కలిగి ఉం టాయి. అభివృద్ధి చెందుతున్న ఆధునిక విజ్ఞానంతో వీటిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉన్నది. తద్వారా మానవజాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సమాధానం దొరికే అవకాశం ఉన్నది. ఈ చికిత్సలో ఉన్న లోపాలను గుర్తించాలి. కానీ సైన్స్ పేర వీటి సంప్రదాయ వైద్యంపై పరిశోధనను అంతగా పట్టించుకోలేదు. అల్లోపతి వైద్యం (మోడ్రన్ మెడిసిన్) తీసుకువచ్చిన ఫార్మారంగం వ్యాపారసరళి ఈ వైద్య విధానాలను వెనక్కు నెట్టింది.
16వ శతాబ్దంలో చైనా లాంటి దేశాల్లో మోడ్రన్ మెడిసిన్‌కు అవకాశం కల్పించినా, చైనా ప్రజలు నేటికీ సంప్రదాయ వైద్యాన్ని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. చైనా అనేక మూలికల ఔషధ గుణాలను ప్రయోజనాత్మకంగా చాటడంలో, వాటి సైద్ధాంతిక పద్ధతులు, చికిత్స సూత్రాలు, జీవశాస్త్ర అధ్యయనాలు, అనుబంధ సాంకేతికతలు మొదలైన సమ్మిళిత విజ్ఞానం ద్వారా తన సంప్రదాయ వైద్యానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నది. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా చైనా హెర్బల్ ఉత్పత్తులను తమ ప్రజలకు అందిస్తున్నాయి. ఏటా రూ.20 వేల కోట్ల విలువైన హెర్బల్ ఉత్పత్తులను చైనా ఎగుమతి చేస్తున్నది. భారత హెర్బల్ ఉత్పత్తులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు ఆదరణ పెరుగుతుండటంతో ఏటా 12 వేల కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతున్నదని నిపుణుల అంచనా. దీని ప్రకారం 2050 కల్లా ఇది ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నది. అమెరికా, జపాన్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలు తమ వాటాను వీలైనంత మేర పెంచుకునే దిశలో ఆలోచిస్తున్నాయి. అమోఘమైన మూలిక సంపద కలిగిన భారత్ కూడా ఆయా దేశాలతో పోటీపడాలి.
భారత్‌లో అంతరిస్తున్న మూలికా సంపద సవాలుగా మారింది. అభివృద్ధి పేరుతో అడవులను మాయం చేస్తుండటంతో ఎన్నో జాతులు అంతరించిపోయే స్థితికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా బాగా వినియోగంలో ఉన్న వంద మొక్కల్లో 50 మొక్కలు భారతదేశానివే. చైనాలో వాడే 20 ప్రధాన మూలికలు భారత దేశీయ వైద్యంలో కూడా వాడతారు. అమెరికా, యూరప్‌లతో పోలిస్తే అదే జాతికి చెందిన భారతీయ ఔషధ మొక్కలు చాలా శక్తివంతమైనవి.
సంప్రదాయ వైద్యంలో రోగి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టాలనే సిద్ధాంతం ఉన్నది. అందుకే ఇవి ఆధునిక పరిశోధన పద్ధతుల్లో ఇమడ లేకపోతున్నాయి. తద్వారా సంప్రదాయ వైద్య పరిశోధనలు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తున్నది. సంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగించే వివిధ మందుల్లో హెర్బోమినరల్ సమ్మేళనాలను తెలుసుకోవడానికి, వాటిలో విషపూరితమైనవి ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోవడానికి అధ్యయనాల అవసరం ఎంతైనా ఉన్నది. అదే సమయంలో సైన్స్‌కు అంతుబట్టని అద్భుతాలు కొన్ని ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో జరుగుతున్నాయి. ఆధునిక సైన్స్‌కు అందనంత మాత్రాన అది వట్టి భ్రమగా కొట్టిపారేయడానికి వీల్లేదు. హోమియోపతి, ఆయుర్వేదంతో పాటుగా మిగతా వైద్య విధానాలు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. కానీ ఈ వైద్య విధానాల ద్వారా ఇచ్చే మందులు చాలారకాల రోగాలను తగ్గిస్తున్నాయని నిరూపితమైంది.
ఆధునిక విజ్ఞానశాస్త్రం ముందుకెళ్తున్న ఈ కాలంలో హెర్బల్ పరిశోధనలను మరింతగా ప్రామాణికం చేయగల మార్గదర్శకాలను అన్వేషించాలి. తద్వారా మానవ ఆరోగ్య సంరక్షణ ప్రధాన స్రవంతిలో సంప్రదాయ వైద్యాలను భాగం చేసే అవకాశం ఉన్నది. ఈ వైద్యంలో పేరుకుపోయిన జడత్వాన్ని దూరం చేయడానికి ఇది దోహదపడుతుంది. సంప్రదాయ వైద్య విధానాల్లో ఉన్న ఆధ్యాత్మిక భావనలు ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయి. ముఖ్యంగా ఆపాదించబడిన కొన్ని సంప్రదాయ, ఆధ్యాత్మిక, ఊహాత్మక భావనలను ఈ వైద్య శాస్ర్తాలు ప్రక్షాళన చేసుకోవలసిన అవసరం ఉన్నది.
డాక్టర్ చెమన్