2022 నాటికి భారతదేశ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016, ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగిన రైతు యాత్రలో ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా 2022లో అమృతోత్సవాలు జరుపుకొన్నాం. ఈ సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. కానీ, దేశంలో అన్నదాతల ఆదాయం రెట్టింపు కావటం అటుంచితే రోజురోజుకు వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోతున్నది.
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మోదీ ‘నాకు మీరు ప్రధానిగా అవకాశం ఇస్తే రైతాంగ సమస్యల పైన వేసిన డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేస్తా’నని హామీ ఇచ్చారు. ఇప్పుడు 2023వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దశాబ్దాలు మారుతున్నా రైతుల కన్నీరు మాత్రం ఆగింది లేదు. భారత రైతాంగానికి స్థిరమైన ఆదాయం లేకపోవటం, అప్పుల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం, పం డిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవ టం, అప్పులు తీర్చే మార్గంలేక వ్యవసాయమే ఒక శాపంగా మారి దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రోజురోజుకు దేశంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా రైతాంగ పరిస్థితి ఉన్నది. దేశంలో నూటికి 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయినా ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న రైతాంగంపైన అందరికీ చిన్నచూపే! ఎన్నికల సమయంలో మాత్రమే రైతాంగ సమస్యలపై హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత మరిచిపోయే ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులున్నంతకాలం రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుంది.
All india debit and investment survey 77వ రౌండ్లో భాగంగా 2019 జనవరి-డిసెంబర్ మధ్యకాలంలో సర్వే నిర్వహించించింది. 2018, జూన్ 30ను కటాఫ్ తేదీగా తీసుకొని 5,940 గ్రామాల్లో 69,455 కుటుంబాలను, పట్టణాల్లో 47,006 కుటుంబాలను సర్వే చేసి వివరాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో 51.9 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకపోయి ఉన్నాయని వెల్లడించింది. 2018 నాటికి దేశం లో ఒక్కొక్క రైతు కుటుంబంపై సగటు అప్పు రూ.74,121 ఉంది. 2013లో సగటు రైతు కుటుంబం అప్పు రూ.47 వేలు మాత్రమే!
దేశంలో 2.5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 72.6 ఉన్నారు. హెక్టారు భూమి ఉన్న రైతు కుటుంబానికి సగటున రోజుకు రూ.224 ఆదాయం మాత్రమే వస్తున్నది. ఇది దినసరి కూలీ కంటే తక్కువ.
రైతుల ఆదాయం నానాటికి దిగజారిపోతున్నది. దేశంలో 2.5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 72.6 ఉన్నారు. హెక్టారు భూమి ఉన్న రైతు కుటుంబానికి సగటున రోజుకు రూ.224 ఆదాయం మాత్రమే వస్తున్నది. అంటే నెలకు ఆ కుటుంబానికి సగటు ఆదాయం రూ.6,944 మాత్రమే (రైతు కుటుంబసభ్యులు, పశువులు పనిచేస్తే వచ్చే మొత్తం ఆదాయం). నిజానికి రైతు కుటుంబ ఆదాయం దినసరి కూలీ కంటే తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలీ రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంలో భారీ కోత విధించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి కేవలం కొన్ని నెల ల వ్యవధిలోనే దాదాపు రెండు కోట్ల మంది రైతులను తొలగించారు. 2022-23లో 11వ విడత (ఏప్రిల్, జూలై)లో 10,45,59,905 మంది రైతులకు పీఎం కిసాన్ పథకం వర్తిస్తే, 12వ విడత (ఆగస్టు, నవంబర్) 8,42,14, 408 మంది రైతులకు మాత్రమే వర్తించింది. అంటే 2,03,45,497 మంది రైతులు పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించబడ్డారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.5,108 కోట్లను మిగుల్చుకుంటున్నది.
ప్రధాని ప్రకటన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 13న రైతుల ఆదాయం రెట్టింపు అంశం పైన అధ్యయనం చేయడానికి అశోక్ దాళ్వాయీ నేతృత్వంలో 16 మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 14 సంపుటులలో నివేదికను సమర్పించింది. 2017 ఆగస్టులో మొదటి సంపుటి నివేదిక, 2018 సెప్టెంబర్‌లో మరో నివేదిక ఇస్తూ 16 సిఫారసులు చేసింది.
అందులో ముఖ్యంగా రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర ఉత్పత్తి ఖర్చు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండాలని సిఫారసు చేసింది. వ్యవసాయ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్ ఫండ్ 2 వేల కోట్లతో 22 వేల గ్రామాల్లో గ్రామస్థాయి మార్కెట్లు ఏర్పాటుచేయాలని, 585 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC)లను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. ధర, డిమాండ్ అంచనాలు, భవిష్యత్తు ఎంపికలు, వ్యవసాయాభివృద్ధికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని కొన్ని సిఫారసులు చేసింది.
కేంద్రంలోని ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ రంగంపై వేసిన కమిటీల సిఫారసులను పార్లమెంట్లో చర్చించి తు.చ. తప్పకుండా అమలు చేయాలి. రెట్టింపు ఆదాయం మాట అటుంచితే కనీసం వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. రైతులు బతుకాలంటే పండించిన ప్రతి పంటకు చట్టబద్ధమైన లాభసాటి ధరను ప్రకటించాలి. రైతుల కు ఆదాయ భద్రత కల్పించాలి. రైతులందరికీ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను అందించాలి. దేశవ్యాప్తంగా పంటల బీమాను రైతు యూనిట్‌గా తీసుకొని అమలుచేయాలి. దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాన్ని యూని ట్‌గా తీసుకొని రైతు బీమాను అమలు చేయా లి. అన్నిరకాల వ్యవసాయ పరికరాలను, యంత్రాలను దేశవ్యాప్తంగా 90 శాతం సబ్సిడీ తో రైతులకు అందించాలి.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
పులి రాజు: 99083 83567