Congress | కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఇటీవల తీవ్రంగా స్పందించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. ‘రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా?’ అని ఆయన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తోటి కాంగ్రెస్ నాయకులు ఓదార్చడానికి రాగా మీడియా సమక్షంలోనే.. ‘మీరూ, మీ పార్టీ చాలు. ఇప్పటి వరకు చాలా ఓర్చుకున్నాను. ఇక చాలు, కాంగ్రెస్ పాలనలోనే కాంగ్రెస్ వారికి భద్రత లేకుండాపోయింది’ అని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరిన ప్రజాప్రతినిధుల శాసన సభ్యత్వం రద్దు చేయాలని ఆ మరుసటి రోజే ఆయన డిమాండ్ చేశారు. ఇదంతా గంగారెడ్డి హత్యపై అప్పటికప్పుడు జీవన్‌రెడ్డి నుంచి వచ్చిన స్పందనగా చూడలేం.
జీవన్రెడ్డిలోనే కాదు, చాలామంది కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉంది. అయితే, రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానానికి నమ్మకం ఉన్నంతవరకు వారు వీర కాంగ్రెస్ వాదులుగానే ఉంటారు. ఒక్కసారి అధిష్ఠానం వద్ద రేవంత్‌రెడ్డి పలుకుబడి తగ్గితే వారు తమ విశ్వరూపం చూపిస్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అసంతృప్తి ఉన్నా విస్తరణలో అవకాశం దక్కుతుందేమోననే ఆశలుండటంతోనే కొంతమంది మిన్నకుండిపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది. పదేండ్లు విపక్షంలో ఉండి నానా తంటాలు పడి పార్టీని బతికించుకుంటే చివరి నిమిషంలో వచ్చి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని కొట్టేశారనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తున్నది.
దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యయం విషయంలో కాంగ్రెస్‌ను ఆదుకునే బలమైన రాష్ర్టాలు రెండే రెండు. ఒకటి కర్ణాటక, రెండవది తెలంగాణ. కర్ణాటక సర్కార్ ఇప్పటికే కుంభకోణాల్లో ఇరుక్కుంది. దాంతో తెలంగాణను మరింత జాగ్రత్తగా కాపా డుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్ఠానంపై ఉంది. ఇది రేవంత్‌రెడ్డికి కలిసొచ్చే అంశం. దీంతో సీనియర్లు తమలో తామే కుమిలిపోతూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జమానాలో రాజకీయాల్లోకి వచ్చి అలుపెరగని పోరాటం చేస్తున్న జీవన్‌రెడ్డికి కాలం కలిసిరావడం లేదు. పదేండ్ల పోరాటం తర్వాత రేవంత్‌రెడ్డి రూపంలో జీవన్‌రెడ్డిని దురదృష్టం వెంటాడుతోంది. రేవంత్‌రెడ్డి హయాంలో జీవన్‌రెడ్డికి ఎలాంటి గుర్తింపు దక్కడం లేదు.
పైగా ఇంట్లోనే పొగ పెట్టినట్టు జగిత్యాల నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అతన్ని పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి మొదటినుంచీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని కాంగ్రెస్ హై కమాండ్ ఢిల్లీకి పిలిపించి ఏదో సర్దిచెప్పి పంపించేసింది. కొద్ది రోజులు మౌనంగా ఉన్న జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో తన అసంతృప్తిని మరోసారి బయటపెట్టారు. మిగిలిన సీనియర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ‘నన్నోడి తానోడేనా? తానోడి నన్నోడెనా?’ అని జూదంలో తనను పందెం కాసి ధర్మరాజు ఓడిపోయినప్పుడు ద్రౌపది ప్రశ్నించినట్టు.. ఫిరాయింపుదారుల గురించి జీవన్‌రెడ్డి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.
బీజేపీని దేశవ్యాప్తంగా ఏ అంశం గురించైనా కాంగ్రెస్ విమర్శిస్తే.. తెలంగాణలో హస్తం పార్టీ పాలనను ఉదహరిస్తూ మోదీ ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వ వైఫల్యాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురిం చి మోదీ ప్రస్తావిస్తున్నారు. దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు.
‘అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కేసీఆర్ చేర్చుకున్నారు కాబట్టి, మనం చేర్చుకున్నాం’ అని చెప్తున్నవారిని ఆయన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను అనుసరించాలా? లేక సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని అనుసరించాలా? కేసీఆర్ మన నాయకుడా? లేక సోనియాగాంధీ, రాహుల్గాంధీనా? అంటూ కాంగ్రెస్‌ను కడిగిపారేశారు. పార్టీ ఫిరాయించిన నేతల సభ్యత్వం రద్దు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం పార్టీ మారిన వారిని ఎలా సమర్థిస్తారని నిలదీశారు.
రేవంత్ రెడ్డికి హై కమాండ్ అండ తప్ప రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మద్దతు లేదనే చెప్పాలి. మూసీ వ్యవహారంలో ఇన్ని విమర్శలు వస్తుంటే కనీసం నల్లగొండ జిల్లా నాయకులైనా స్పందించరా? అని రేవంత్ ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత ఇంకా కాంగ్రెస్‌లో చేరని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందించారు.
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికి వెళ్లినా, ఎవరేం చేసినా ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది. మాజీ మంత్రి కేటీఆర్‌ను, సినీ నటుడు నాగార్జున కుటుంబాన్ని మంత్రి కొండా సురేఖ అసభ్యకరంగా దూషించి పార్టీ పరువు తీసినా మందలించలేని పరిస్థితి. అవేం మాటలని మంత్రిని న్యాయస్థానం తప్పుపట్టినా తనకు సంబంధం లేని విషయం అన్నట్టుగానే సీఎం మౌనంగా ఉండిపోయారు. తన అనుచరులను అరెస్ట్ చేశారని ఓ మంత్రి వెళ్లి సీఐ కుర్చీలో కూర్చున్నా మందలించలేని దుస్థితి. ఒకవేళ ఏదైనా ఉంటే హై కమాండ్ అడగాల్సిందే తప్ప రేవంత్ రెడ్డి అడిగే పరిస్థితి లేదు. పార్టీలో అందరూ రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లే కావడం అందుకు ప్రధాన కారణం.
అవకాశం ఉన్న చోట గతంలో టీడీపీలో తనతో పాటు పనిచేసిన వారికి రేవంత్‌రెడ్డి అవకాశం కల్పిస్తున్నారు. మొదటినుంచి కాంగ్రెస్‌లో ఉన్న వారికంటే టీడీపీ నుంచి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు జీవన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఒక్క తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ తెగ మురిసిపోతోంది. కానీ, రాత్రికి రాత్రి రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీని అధికార పీఠం పై నుంచి దించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సిద్ధహస్తుడైన మోదీ దేశాన్ని పాలిస్తున్నారనే విషయాన్ని కాంగ్రెస్ గ్రహించడం లేదు.
ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పట్ల బీజేపీ అంత సీరియస్‌గా ఏమీ లేదు. బీజేపీ, కాంగ్రెస్‌ల ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ అన్నట్టుగానే ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ చూసీచూడనట్టుగా ఉంటున్నది. అయితే పార్టీ పరంగా తుది నిర్ణయాలు తీసుకునేది మోదీ అన్న సంగతిని మరువకూడదు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మోదీ మదిలో ఏముందో వేచి చూడాలి. అప్పటి వరకు కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి పెద్ద వ్యతిరేకత ఏమీ ఉండదు.
– బుద్దా మురళి