వేదాలలో ప్రవచించిన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించాలంటే వివాహ వ్యవస్థ, అందులో ముఖ్యంగా లింగ సమానత్వం ఉండాలన్నది ధర్మ సిద్ధాంతం. సమానత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది? స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ, ఆదరం, గౌరవం ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. వివాహంలో భార్యాభర్తల మధ్య, కుటుంబంలో స్త్రీలు, పురుషుల మధ్య, సమాజంలో కూడా ఈ రెండు వర్గాల మధ్య ఇటువంటి గౌరవం, వారి ఆవశ్యకత గురించి అవగాహన లోపిస్తే దేశం ఎలా ఉంటుంది?
PM Modi | ఇదిగో ఇప్పుడు మనం బతుకుతున్న భారతదేశంలా ఉంటుంది. స్త్రీల పట్ల క్రూరంగా ఉన్నవాడెవడూ బాగు పడలేదు, పడడు కూడా! ఒక దేశం సుభిక్షంగా ఉండి, ప్రగతి పథంలో పయనించాలంటే ఆ దేశ రాజ్యాంగం, దానిని పటిష్ఠంగా అమలుపర్చాల్సిన నాయకులు ధర్మబద్ధంగా ఉండాలి. నియమాలు చిన్నాభిన్నం చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసి తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తే ధర్మం మాట పక్కనపెట్టి, న్యాయం కూడా జరగదు. దీనికి సరైన ఉదాహరణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు, 5 నెలల జైలు జీవితం. చివరికి ఆధారాలు చూపని ఈడీ, సీబీఐలను ముక్కచీవాట్లు పెట్టి ఆవిడకి బెయిలు మంజూరు చేసిన సుప్రీం కోర్టు నిర్ణయం, నరేంద్ర మోదీ ప్రభుత్వ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో ప్రపంచానికి చాటిచెప్పింది. వీరత్వంతో పాండవులను గెలవలేమని గ్రహించిన దుష్ట చతుష్టయం (దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు) మోసంతో గెలిచి, వారిని వనవాసానికి పంపారు. కానీ, చివరి గెలుపు ఎవరిది? ధర్మం ఎవరివైపు ఉందో వారిదే!
నిర్భయ ఉదంతం (2012) అడ్డుపెట్టుకొని 2014లో ఎన్నికలు గెలిచిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉంది? నిజానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగు లేకపోతే ఎక్కువ వేదన, కష్టం అనుభవించేది స్త్రీలే. కార్పొరేట్ పక్షపాత మోదీ పాలనలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారి స్థితి ఎంత దిగజారిందో గణాంకాలే చెప్తున్నాయి. ధరలు నియంత్రించటంలో కాంగ్రెస్ విఫలమైందని డప్పుకొట్టి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ పాలనలో ధరలు 2014లో ఉన్న కంటే సుమారు 70 శాతం పెరిగాయి. పోనీ, సామాన్యుల సంపాదన ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు, దేశం బాగుపడిందీ లేదు. 45 శాతం ఉన్న యువతకు ఉద్యోగాలు సృష్టించలేదు, విద్యారంగం నాశనమైంది. మరి కేంద్ర ప్రభుత్వం విపక్షాల పాలనలో ఉన్న రాష్ర్టాల నిధులు కూడా మింగి వెలగబెడుతున్నదేమిటి? 148 కోట్ల జనాభా ఉన్న దేశంలో పది మంది అపర కుబేరులుంటే చాలదు. సామాన్యుల కనీస అవసరాలు తీరాలి. ఈ సామాన్య కుటుంబాలలో స్త్రీల పరిస్థితి మరింత దిగజారింది. బీజేపీ పాలిత రాష్ర్టాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలలో బాలికల శాతం ఘోరంగా తగ్గిపోయింది. ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’, కాస్తా ‘బేటీ ఛిడావ్’ అయిపోయి అత్యాచారాలు పెరిగాయి. అహంకారంతో నేరాలు చేస్తున్న తమ అనుయాయులకు బీజేపీ శిక్షలు వేయకపోగా, సన్మానాలు చేస్తున్నది.
బలమైన ప్రత్యర్థులైన కేజ్రీవాల్‌ను నియంత్రించటానికి సిసోడియాను, కేసీఆర్ మీద పగ తీర్చుకోవడానికి కవితను అన్యాయంగా జైలులో పెట్టిన మోదీ ప్రభుత్వానికి ప్రజలు ఏ శిక్ష వేయాలి? ఎన్నికల అధికారులను, ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారం చేజిక్కించుకోవచ్చు. కానీ, ప్రజల మన్నన పొందగలరా? అసలు దేశంలోని స్త్రీలందరూ ఒకసారి తమ పట్ల బీజేపీ ప్రభుత్వం ఎట్లా ప్రవర్తిస్తుందో గమనిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? 148 కోట్ల భారత జనాభాలో సుమా రు 66 కోట్ల మంది హిందూ స్త్రీలకు ఏమైనా మంచి చేసే విధానాలు ప్రవేశపెట్టలేదు కానీ, మత విద్వేషంతో 10 కోట్ల మంది ముస్లిం స్త్రీల ‘తలాక్’ చట్టం సవరించేశారు. ఈ ద్వేష భావనలు కాకుండా దేశంలోని స్త్రీలందరికి ఉపయోగకరమైన 30 శాతం ఉద్యోగ నియామకాల బిల్లు తేవచ్చు కదా! అంటే మోదీ ముస్లిం స్త్రీలకు సహాయం చేద్దామని కాదు ఆ చట్టం తెచ్చింది. వారి కుటుంబాలలో చిచ్చు పెట్టడానికి! ఒక విధానమే కాదు, దాని వెనుకనున్న ఆలోచన కూడా మంచిదై ఉండాలి.
స్త్రీల పట్ల మోదీకి ఉన్న చిన్నచూపు తరచూ బయటపడుతూనే ఉన్నది. స్త్రీ ద్వేషం, మత ద్వేషం ఉన్నవాడు భారత్ లాంటి వైవిధ్యభరిత సంస్కృతి ఉన్న దేశానికి అధినేతగా తగినవాడేనా? ఆలోచించండి. మానవ విలువలు నాశ నం చేసే ఇటువంటి నకారాత్మక ఆలోచనలు ఉన్నవాడు అసలు నాయకత్వానికి పనికివస్తాడా? అందుకే మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిని చేయడాన్ని వాజపేయి వ్యతిరేకించారు. ఇక గుజరాత్ ముఖ్యమంత్రిగా ముస్లిం ల పట్ల, వారి మహిళల పట్ల జరిగిన అన్యాయాలకు అంతే లేదు. ఎదిరించిన జర్నలిస్టుల నిర్బంధం, అమిత్ షా కేసు చేస్తున్న జడ్జి ఆకస్మిక, అనుమానాస్పద మరణం ఏం సూచిస్తున్నాయి? మహిళా రెజ్లర్ల నిరసన, వారి పట్ల మోదీ చూపిన నిరాదరణ ఆయన స్త్రీ ద్వేషాన్ని ప్రతిబింబించటం లేదా? మణిపూర్‌లో జరిగిన అత్యాచారం, అనాచారాల్ని ఇప్పటిదాకా మోదీ ఖండించలేదు. ఆ రాష్ర్టానికి మొహం చాటేశాడు. ఈయన దేశానికి ప్రధాని అనటానికే సిగ్గు పడాలి ప్రజలు!
తనకంటే గొప్పగా, ఇంకే నాయకుడూ దేశంలో చేయనంత బ్రహ్మాండమైన పరిపాలన అందించిన కేసీఆర్‌ను లొంగదీయాలంటే దుర్యోధన మంత్రం గా ఆయన కూతురిని బాధపెట్టడం ఎంతవరకు న్యా యం? కవితను నిర్బంధించిన ఒక్క కారణమైనా నిరూపితమైందా? అయిదు నెలలు ఆవిడను బాధపెట్టినందుకు, నిరాధారంగా నిర్బంధించినందుకు మోదీ మీద ఏ కేసు వేయాలి? న్యాయం, చట్టం, ధర్మం అందరి పట్ల ఒక్కటే అయితే, ఈ అన్యాయం ఎట్లా సరిదిద్దుతారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ అధర్మ పాలనను ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించాలి. న్యాయ పోరాటం చేయాలి. అధికార దుర్వినియోగం చేసేవారికి తగినరీతిలో బుద్ధి చెప్పాలి.