డిసెంబర్ 13న నూతన పార్లమెంటు భవనంలోని లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి సభలోకి దూకిన దుశ్చర్య యావన్మందినీ ఆందోళనకు గురిచేసింది. ఇది డిసెంబర్ 13న జరగటంలో ఏదన్న కుట్ర ఉన్నదా లేక యాదృచ్ఛికమా అన్నది పోలీసుల విచారణలో తేలవలసి ఉంటుంది. డిసెంబర్ 13ను కావాలనే ఎంచుకుంటే గనక ఇది చాలా సీరియస్ విషయంగా భావించాలి. ఎందుకంటే 22 ఏండ్ల కిందట సరిగ్గా ఇదేరోజున ఉగ్రవాదులు పార్లమెంటు మీద దాడిచేసిన విషయం దేశం ఎప్పటికీ మరిచిపోలేదు. నాడు దుండగులు భద్రతా దళాల వేషంలో వచ్చి భద్రతా దళాల కన్నుగప్పి పార్లమెంటు ప్రాంగణంలోకి సులువుగానే ప్రవేశించగలిగారు. ఆ సంఘటన తర్వాత పార్లమెంటు భద్రతను చాలా కట్టుదిట్టం చేశారు. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకటం 1994లో రెండుసార్లు జరిగింది. మొదటిసారి మే నెలలో, రెండోసారి ఆగస్టు నెలలో. ఆనాడు దాన్ని అంత సీరియస్‌గా పరిగణించలేదు. తొలిసారి దుండగుడిని గట్టిగా మందలించి వదిలేశారు. రెండోసారి రెండురోజుల కారాగార శిక్ష విధించి తీహార్ జైలుకు తరలించారు. అంతటితో సభలోకి దూకిన ఆ ఉదంతాలు చరిత్రలో కలిసిపోయాయి.
Lok Sabha | 2001 నాటి ఘటనలో తొమ్మిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పార్లమెంటు భద్రతా విభాగం సమయస్ఫూర్తితో భవనం తలుపులు మూసివేయటంతో దుండగులు భవనంలోకి ప్రవేశించలేకపోయారు. భవనంలోనికి ప్రవేశించగలిగితే ఏం జరిగి ఉండేదో ఊహించటం కూడా కష్టమే! అప్పటికే ఆ రోజు రెండు సభలూ వాయిదా పడ్డాయి. అయితే, అంతటి ఘోరమైన ఘాతుకం జరిగిన నేపథ్యంలో, ఏ మాత్రం తత్తరపాటుకు గురికాకుండా, యథావిథిగా రెండు సభలూ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సమావేశమై, కిందటి రోజు జరిగిన దాడిలో అశువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించటాన్ని యావత్ భారతదేశం, వాస్తవానికి యావత్ ప్రపంచం కూడా, ఒక రాజ్యాంగ వ్యవస్థగా మన పార్లమెంటును, పార్లమెంటు సభ్యులను ఎంతో గర్వంగా చూసింది. అంతటి ఘాతుకం జరిగిన మరునాడే సమావేశం కావడం ద్వారా ‘మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరు’ అన్న స్థిరమైన సందేశాన్ని మన పార్లమెంటు ప్రపంచానికి వినిపించింది.
ఆ తర్వాత పార్లమెంటు ప్రాంగణం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటుచేశారు. నాలుగు చోట్ల క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సభా కార్యకలాపాలను వీక్షించే సందర్శకులను గ్యాలరీల లోనికి అనుమతించేవారు. కానీ, సందర్శకులను ఆపకపోవడం గమనార్హం. ఢిల్లీ వెళ్లే సందర్శకులు రాజ్‌ఘాట్‌ను, ఆ పక్కనే ఉన్న నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి సమాధులను చూస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం చూడాలనుకుంటారు. రాష్ట్రపతి భవనాన్ని బయటి నుంచి మాత్రమే చూడగలరు. లోనికి ప్రవేశం లేదు సందర్శకులకు. అయితే, పార్లమెంటును చూసే వీలుంది. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని పాటిస్తే పార్లమెంటు భవనంలోని ముఖ్య విభాగాలైన లోక్‌సభ ఛాంబర్, రాజ్యసభ ఛాంబర్, చారిత్రిక సెంట్రల్ హాలును సమావేశాలు లేనప్పుడు సందర్శకులు చూసే వీలుండేది కొవిడ్ ముందువరకు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. కరోనా నిబంధనల ప్రకారం కొంతకాలం సందర్శకులకు, మీడియా ప్రతినిధులకు పార్లమెంటు భవనంలోనికి ప్రవేశాన్ని నిలిపివేశారు.
అయితే ఇటీవల నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో సభా కార్యక్రమాలు ప్రారంభమైన సమావేశాలను వీక్షించటానికి సందర్శకులను మళ్లీ అనుమతిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే నిన్న సమావేశాలు చూడటానికి వచ్చి న ఒక వ్యక్తి సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన దుశ్చర్య చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ దుండగులు ఏదైన తీవ్రవాద సంస్థకు చెందినవారా అన్నది ఇంకా నిర్ధార ణ కాలేదు. సంగతి పూర్తిగా తెలియకుండా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో మనం ఒక నిర్ణయానికి రాకూడదు! అయితే ఇది చాలా తీవ్రమైన ఘటన అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ ఈ దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
మన పార్లమెంటు కేవలం ఒక భవనం మాత్రమే కాదు, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. 2001లో పార్లమెంటు మీద జరిగిన దాడిని మన సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసినట్టుగా భావించారు ప్రజలు. ఈనాటి దుశ్చర్య ఆనాటి దుశ్చర్యంతటి తీవ్రమైనది కాకపోయినప్పటికీ ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
ఈ సంఘటన నేపథ్యంలో ప్రజలు పార్లమెంటు సమావేశాలు చూసే సదుపాయాన్ని నిలిపివేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సదుపాయాన్ని నిలిపివేయటం బహుశా తాత్కాలికమని భావించవచ్చు. ఈ సంఘటన నేపథ్యంలో పార్లమెంటు భద్రత వ్యవస్థను మరోసారి క్షుణ్ణంగా సమీక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. భద్రతా వ్యవస్థను సమీక్షించిన పిదప సందర్శకులను మళ్లీ అనుమతిస్తారని అనుకోవచ్చు. మన మీడియా పార్లమెంటును ప్రజలకు నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ, ప్రజలకు పార్లమెంటులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధి విధానాల రూపకల్పన, ఆ విధి విధానాల మీద వాడివేడి చర్చ జరిగే గర్భగుడి పార్లమెంటు ప్రాంగణం. అంతటి ప్రాశస్త్యం ఉన్న చోటును చూడాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. అది వీలు పడుతుందా లేదా అన్నది వేరు విషయం. కానీ, కోరిక మాత్రం ఉంటుంది. కాదనలేం.
ఢిల్లీ చూడటానికి వెళ్లిన వాళ్లలో పార్లమెంటును చూడాలన్న కోరిక చాలామందికి ఉన్నప్పటికీ, చూసే అవకాశం కొందరికే దక్కుతుంది. భద్రత పేరుతో ఈ అవకాశం ప్రజలకు దూరం చెయ్యకూడదు. పార్లమెంటుకూ ప్రజలకు మధ్య వారధి సందర్శకుల గ్యాలరీ. దానిలోకి ప్రవేశాన్ని కట్టుదిట్టం చెయ్యవచ్చు కాని, తలుపులు మూసివెయ్యకూడదు. పార్లమెంటు సమావేశాలు చూడాలని ప్రజలకు ఎంతో ఆసక్తి ఉంటుంది. అది అందరికీ వీలు పడకపోవచ్చు. భద్రతా ప్రమాణాలు పెంచవచ్చు. భద్రతా ప్రొటోకాల్‌ను కట్టుదిట్టం చెయ్యవచ్చు. కానీ, సందర్శకులను అనుమతించకపోవటం అనేది తప్పటడుగే అవుతుంది. మనలను మనమే అనుమానించుకున్నట్టు, అవమానించుకున్నట్టు. సందర్శకుల గ్యాలరీకి ప్రవేశం కేవలం సమావేశాలప్పుడు మాత్రమే ఉంటుంది. సమావేశాలు చూసేందుకు చాలామంది ఉత్సాహపడతారు. కానీ అవకాశం కొందరికే దక్కుతుంది. ఈ ప్రక్రియలో మార్పులు అవసరం. ఎవరైనా సామాన్యులు పార్లమెంటు సమావేశాలు చూడాలనుకుంటే చూసే వీలు కల్పించాలి. దానికి విధివిధానాలు రూపొందించి అందరికీ తెలియజేయాలి. ఆసక్తి ఉన్నవారు, వాళ్లున్న చోటునుంచే తగినంత ముందుగా అభ్యర్థన చేసుకుంటే, సరైన తనిఖీ నిర్వహించిన పిదప అనుమతించే విధానాన్ని అమలు చెయ్యాలి. సమావేశాలు లేనప్పుడు పార్లమెంటును చూసే అవకాశం కూడా సామాన్య ప్రజలకు కల్పించాలి. దానికి పార్లమెంటు సభ్యుల సిఫారసుతో పాటుగా ఎవరైనా ఎక్కడినుంచైనా ముందుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలి; తిరుమల దర్శనం తరహాలో. అవసరమైన తనిఖీలు నిర్వహించిన పిదప అనుమతించవచ్చు. పరిమిత సంఖ్యలో అయినా ఇటువంటి వెసులుబాటు ప్రజలను పార్లమెంటుకు దగ్గరచేస్తుంది.
దేశంలో వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది న్యాయ విద్యార్థులు ఢిల్లీ వస్తుంటారు సుప్రీంకోర్టును చూడటానికి. ఆ విద్యార్థులు పార్లమెంటును కూడా చూడాలనుకుంటారు. చట్టాలను నిర్మాణం చేసేది పార్లమెంటులోనే గనుక. అటువంటివారు, స్కూల్ విద్యార్థులు గానివ్వండి, కాలేజీ/ యూనివర్సిటీ విద్యార్థులు గానివ్వండి ముందుగా అనుమతి తీసుకొని పార్లమెంటును సందర్శిస్తుంటారు.
లోక్‌సభ సచివాలయంలో శిక్షణ విభాగం ఇటువంటి వెసులుబాటు కల్పిస్తుంటుంది వ్యవస్థాపూర్వకంగా వచ్చే విద్యార్థులకు. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. పార్లమెంటు ప్రాంగణంలో పార్లమెంటు లైబ్రరీ భవనం ఉంది. దీనికి ప్రవేశం వేరుగా ఉంటుంది. ఈ భవనంలో పార్లమెంటు మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం మన స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఘట్టాలను, రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన ఘట్టాలను లఘుచిత్రాల ద్వారా, ప్రతిమల ద్వారా ప్రదర్శిస్తు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇటువంటి సదుపాయం ఉందని చాలామందికి తెలియదు. ఇది పార్లమెంటును ప్రజలకు దగ్గర చేయటంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రజలకు వ్యవస్థ పనితీరు తెలియటం మంచిదే కదా!విమానాశ్రయాల తరహాలో పార్లమెంటులో కూడా బాడీ స్కానర్లను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు అది హక్కులను హరించేదిగా ఉన్నదని నానా హంగామా చేసింది మీడియా. ఏదన్నా జరగకూడనిది జరిగితే సరైన నియంత్రణ లేదని కూడా నానా యాగీ చేసేది కూడా మీడియానే! మన మీడియా ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– గుమ్మడిదల రంగారావు