హిండెన్‌బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని కుదేలు చేసింది. 1955 డిసెంబర్ ఆరవ తేదీన పార్లమెంటులో ఫిరోజ్ గాంధీ ఇచ్చిన అనర్గళ ప్రసంగం దాల్మియా – జైన్ (డీజే) గ్రూప్ ఆర్థిక మాయాజాలాన్ని బయట పెట్టింది. ఆయన ప్రసంగం జీవిత బీమా పరిశ్రమను జాతీయం చేయడానికి దారితీసింది. సాధారణ ప్రజలలో పెద్ద పరిశ్రమల పట్ల నెలకొన్న అప నమ్మకం కూడా ఇందుకు కారణం.
అదానీ గ్రూప్ లాగానే, డీజే కూడా క్షేత్రస్థాయిలో స్థిరమైన ఆస్తులు నిర్మించుకుంటూ సాగింది. బిహార్‌లోని దాల్మియా నగర్లో 3,800 ఎకరాల సముదాయంలో సిమెంట్, చక్కెర, కాగితం, రసాయనాలు, వనస్పతి, సబ్బులు, ఆస్బెస్టాస్ రేకులు – మొదలైన పరిశ్రమలతోపాటు వీటికి అవసరమైన విద్యుత్ కేంద్రం, లైట్ రైల్వే ఆ కంపెనీకి ఉండేవి. పాటియాలాలో బిస్కెట్ ఫ్యాక్టరీ, బిహార్‌లోని ఝరియాలో, బెంగాల్‌లోని రాణిగంజ్‌లో బొగ్గు క్షేత్రాలతోపాటు తిరుచ్చి, చర్ఖి దాద్రి, లాహోర్, కరాచీలలో సిమెంట్ కర్మాగారాలు ఉండేవి. 1933లో చక్కెర మిల్లుతో ప్రారంభమైన రామకృష్ణ దాల్మియా వ్యాపార సామ్రాజ్యం అదానీ మాదిరిగానే విస్తరించింది. ఫిరోజ్ గాంధీ వెల్లడించిన విషయాలతో అదానీ పరిస్థితే డీజే గ్రూపునకు ఎదురైంది. రామకృష్ణ దాల్మియా కొన్ని అంచనాలపై ఆధారపడుతూ, సంబంధం లేని వ్యాపారాలకు వెళ్ళడం ఇందుకు కారణం. అకౌంట్లలో గోల్మాల్ చేసి, బోగస్ కంపెనీలను సృష్టిస్తూ కంపెనీలను చేజిక్కించుకోవడం, కొన్నింటిని మాయం చేయడం సాగిందని ఫిరోజ్ గాంధీ వెల్లడించారు.
1946లో బాంబేలోని రెండు టెక్స్టైల్ మిల్లులను రూ.3.7కోట్లకు స్వాధీనం చేసుకున్న డీజే గ్రూపు రెండు కోట్ల రూపాయలకు బెనెట్ కోల్మన్ అండ్ కంపనీ లిమిటెడ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురణ సంస్థ) ను చేజిక్కించుకుంది. బీసీసీఎల్‌లో షేర్లలో పెట్టడానికి ఈ మిల్లుల మిగులును ఉపయోగించుకోవాలనేది ఎత్తుగడ అనీ, ఇది చట్టబద్ధమో కాదో నాకు తెలువదు అని ఫిరోజ్ వివరించారు. బీసీసీఎల్‌లో ఒక్క మగ్గం కూడా నెలకొల్పలేదని అన్నారు. ఈ సందర్భంగా రూ.84 లక్షలు గ్వాలియర్ బ్యాంక్ నుంచి ఉపసంహరించుకున్నారనీ, ఈ క్రమంలో ఆ బ్యాంక్ మూతపడ్డదనీ తెలిపారు. ఈ వ్యవహారాలతో ఏకీభవించని ఎస్.బి. బిల్లిమోరియా, ఎ.ఎఫ్. ఫెర్గూసన్ అనే ఇద్దరు ఆడిటర్లు వైదొలగారని ఫిరోజ్ వెల్లడించారు. డీజే గ్రూప్ ఎయిర్‌లైన్స్ పేర చేసిన మాయాజాలాన్ని కూడా ఫిరోజ్ బయట పెట్టారు. డీజే కంపెనీ రూ.3.5 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌తో దాల్మియా- జైన్ ఏయిర్‌వేస్ పేర ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని నెలకొల్పింది. విమానయాన వ్యాపారాన్ని నడపడం ఈ సంస్థ లక్ష్యం. కానీ జరిగింది వేరే వ్యాపారం. ఈ ఏయిర్‌లైన్స్ డీజే ప్రైవేటు కంపెనీ అయిన అలెన్ బెరీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థలు కలిసి రూ.5.8 కోట్లు వెచ్చించి, భారత్‌లోని అమెరికా ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలు, విడి భాగాల నిలువను అంతా కొనుగోలు చేసాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత వాటిని అమ్మివేయాలనేది ఎత్తుగడ. పబ్లిక్ ఆఫర్ ద్వారా వచ్చిన సొమ్ముతో ఒక్క విమానం కూడా ఎగురలేదు. కానీ పాత వాహనాలకు మరమ్మతులు చేసి, పెయింటింగ్ వేసి తీర్చిదిద్దడం మాత్రం సాగింది. ఈ లావాదేవీల వల్ల వచ్చిన లాభాలన్నీ డీజే సొంత కంపెనీ అయిన అలెన్ బెరీకి వెళ్ళాయి. 25 వేల మంది వాటాదారులకు చెందిన రూ.3.1 కోట్లను అలెన్బెరీకి రుణంగా బదిలీ చేశారు. ఈ రుణాలు చెల్లించక పోగా, భాగస్వామ్యాన్ని రద్దు చేశారు. ఆ తరువాత ఎయిర్‌లైన్స్ కంపెనీని మూత పెట్టారు.
ఫిరోజ్ గాంధీ బయట పెట్టిన ఆధారాల ప్రకారం- డీజే గ్రూప్ అధీనంలోని భారత్ ఇన్స్యూరెన్స్ కంపెనీ తమ ఇతర సంస్థలైన బీసీసీఎల్, అలెన్ బెరీ, లాహోర్ ఎలక్ట్రిక్ సైప్లె కంపెనీ తదితరమైన వాటిలో పెట్టుబడులు పెట్టింది. భారత్ బీమా సంస్థలోని పాలసీదారుల సొమ్మును ఉపయోగించి కుటుంబ ట్రస్టుల ద్వారా వివిధ కంపెనీలపై పట్టు సాధించినట్టు ఫిరోజ్ వెల్లడించారు. తమ గ్రూప్ విస్తరణకు, స్పెక్యులేటివ్ పెట్టుబడులకు బీమా సంస్థ, భారత్ బ్యాంక్ నిధులను వాడారని ఆరోపించారు.
ఫిరోజ్ గాంధీ ఈ బండారాన్ని బయట పెట్టడంతో 1956 జనవరి 19న కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా దేశంలోని 245 బీమా సంస్థలను, ప్రావిడెంట్ సొసైటీలను జాతీయం చేసింది. 1956 సెప్టెంబర్ ఒకటవ తేదీన పార్లమెంటు చట్టం ద్వారా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ను ఏర్పాటు చేసింది. సామ్యవాద సమాజ స్థాపన దిశలో బీమా సంస్థల జాతీయీకరణ ఒక ముందడుగు అని ఆనాడు నెహ్రూ అన్నారు. ఇందిరాగాంధీ 1969 నుంచి 1980 వరకు 29 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. దాల్మియా- జైన్ , అదానీ గ్రూప్ వ్యవహారాలకు మధ్య ఒక తేడా ఉన్నది. ఇప్పటి మాదిరిగా డీజే సంస్థకు నాటి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేవు. నెహ్రూకు, రామకృష్ణ దాల్మియాకు పడేది కాదు. నెహ్రూ కనుసైగల మేరకే ఫిరోజ్ గాంధీ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ఉంటారు. డీజే గ్రూప్ రెండు ముక్కలైంది. ఈ సంస్థ స్థాపకుడి సోదరుడు జయ్ దయాల్ దాల్మియా, అల్లుడు ఎస్. పి. జైన్ ఎవరి దారి వారు చూసుకున్నారు. వారు అనేక వ్యాపారాలకు విస్తరించకుండా, కొన్నింటిపైనే కేంద్రీకరించి నడపడం విశేషం. ఇప్పుడు అదానీ కూడా అదే బాటలో ఉండి ఉంటారు. (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో)
హరీశ్ దామోదరన్