అంత పెద్దవి కాని మరికొన్ని సాహిత్య ఉపకరణాలను చూద్దాం.
మానవీకరణ (Personification):
మనిషి కానిదానికి – అది ప్రాణం లేని
వస్తువు కావచ్చు, లేదా అమూర్తమైన
ఊహ కావచ్చు – మనిషితనాన్ని ఆపాదించి
చెప్పడం మానవీకరణ. కీట్స్ ఒక కవితలో,
(Then, land!- then, England!
Oh, the forsty cliffs/ looked
cold upon me (మంచు కప్పిన శిఖరాలు
నన్ను స్నేహరహిత దృక్కులతో చూశాయి)
అంటాడు. ఇక ప్రాణం లేని
టీకాకరణను ఉద్దేశిస్తూ ఎస్టీ
కోలరిడ్జ్ ఒక కవితలో, Inoculation!
Heavenly Maid, descend
(అప్సరా, టీకాకరణమా! దిగు కిందికి)
అంటాడు. కవితలో మానవీకరణ
పదే పదే వస్తే వాటిని kennings
అంటారు. వీటిలో కొన్ని మెటానమీలు,
కొన్ని సినిక్డికీలు అయ్యే అవకాశముంది.
తెలుగు కవిత్వంలో మానవీకరణ తరచుగా కనిపిస్తుంది. ఈ ఉదాహరణలు చూడండి. ‘అక్కడ నిశ్శబ్ద సంగీతమేదో ఆలపిస్తోంది’ – యెన్నం ఉపేందర్, ‘ఈ కవిత్వం వెళ్ళిపోయి / నాలో నన్ను మిగలకుండా చేసింది’ – కొప్పర్తి, ‘ఉన్న ఇల్లు ముసలిదై/ పొటుకులు పెట్టి పెట్టి సీకిపాయె’ – పులిపాటి గురుస్వామి, ‘ఇళ్ళన్నీ తలుపులూ కిటికీలు మూసుకుంటాయి’ – వరవరరావు, ‘కవిత్వం బోనం ఎత్తుకున్నది’ – స్కైబాబా, ‘వాన ఒట్టి భోళా పిల్ల/ ఆకాశం నుంచి మోసుకొచ్చిన కబుర్లన్నీ/ వస్తూనే గల గలా చెప్పేస్తుంది’ – విన్నకోట రవిశంకర్ చివరిదాంట్లో మొదటి పంక్తి మెటఫర్ కూడా అవుతుందని గమనించాలి.
సైనెస్తీసియా (synaesthesia) అంటే ఒక ఇంద్రియానుభవాన్ని మరొక ఇంద్రియానుభవంగా వర్ణించడం. రంగులను ధ్వనులకు, వాసనలను రంగులకు, ధ్వనులను వాసనలకు – ఇలా. నల్లని వాసనలు, బిగ్గరగా అరుస్తున్న రంగులు, ప్రకాశవంతమైన ధ్వనులు, తియ్యని సంగీతం మొదలైన వర్ణనలు సైనెస్తీషియాకు చెందుతాయి.
అనాక్రనిజమ్ (anachronism)లో ఒక వ్యక్తిని, వస్తువును లేదా సంఘటనను తప్పు అయిన చారిత్రక కాలంలో పొందుపరచడం ఉంటుంది. షేక్స్పియర్ తన ఒక రచనలో క్లియోపాత్రా, ఎలిజబెత్ కాలం నాటి ‘రవిక’ను ధరించినట్టు చెప్పా డు. అదేవిధంగా జూలియస్ సీజర్ అనే నాటకంలో ప్రాచీన రోమ్ నగరంలో గంటలు కొట్టే గడియారాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలానికి అది పొసగదు. అయితే ఇట్లాంటి వాటిని poetic licence కింద తీసుకుంటారు. కొందరు హాస్య రచయితలు anachronismను తమ రచనలలో ఉద్దేశపూర్వకంగా వాడుకుంటారు. మార్క్ ట్వేన్ A Connecticut Yankee in King Arthurs Court అనే తన చారిత్రక నవలలో దీన్ని విరివిగా ఉపయోగించాడు.
పోర్ట్ మాంటో పదాలలో (portmanteau words) ఒక పదాన్ని మరొక పదంలోకి దూర్చడం జరుగుతుంది. ఉదాహరణకు, motel (motor car + hotel), brunch (breakfast+lunch), muppet (marionette + puppet), slithy (slimy + lithe). పోర్ట్ మాంటో అంటే రెండు విభాగాలున్న పెద్ద సూట్కేస్ అని అర్థం. ఈ సాహిత్య సాధనాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినాడు Humpty Dumpty.
తెలుగు, ఇంగ్లిష్ అనే మాటలను మిశ్రమం చేస్తూ తెంగ్లిష్ అనే పదాన్ని ఇప్పుడు మనం వాడుతున్నాం. అదేవిధంగా బాలీవుడ్ (బొంబాయి + హాలీవుడ్), టాలీవుడ్ (తెలుగు + హాలీవుడ్)లు కూడా వ్యవహారంలో ఉన్నాయి. ఇవి పోర్ట్ మాంటో పదాలకు ఉదాహరణలు.
స్పూనరిజం (spoonerism) మరొక గమ్మత్తైన సాహిత్య సాధనం. ఇందులో సాధారణంగా రెండు పదాల మొదటి హల్లులు ఒకదాన్ని ఒకటి స్థానభ్రంశం చేస్తాయి. మచ్చుకు, crushing blowకు బదులు brushing crow, well-oiled bicyleకు బదులు well-boiled icicle, You have Missed all the history lectures and wasted two whole termsకు బదులు You have hissed all the mystery lectures and tasted two whole worms అని రాయడం. మాలప్రాపిజం లాగా ఇవి కూడా కొన్నిసార్లు నవ్వును తెప్పిస్తాయని చెప్పవచ్చు. ఆక్స్ఫర్డ్లోని New Collegeకు చెందిన Dr.W.A. Spooner ఇటువంటి వాక్యాలను ఎక్కువగా ప్రయోగించేవాడట. అందుకే అతని పేరు మీద స్పూనరిజం వాడుకలోకి వచ్చింది.
తెలుగులో ఉదాహరణలు:
అచ్చుతప్పులుకు బదులు అప్పు తచ్చులు, కోటి విద్యలు కూటి కొరకేకు బదులు కూటి విద్యలు కోటి కొరకే వీటిని స్పూనరిజంగా పేర్కొనవచ్చు.
ఒక విషయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తక్కువ చేసి రాసే అండర్ స్టేట్మెంట్ (understatement) మరొక సాహిత్య ఉపకరణం. మంచు తుపానులో చిక్కుకున్నప్పుడు కొంచెం చలిగా ఉంది అనడం, చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిని చిన్న ఆటంకం అని వ్యాఖ్యానించడం, క్రికెట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి ఇవాళ నేను కొంచెం బాగానే ఆడాను అని చెప్పడం, పెద్ద గాయమైనప్పుడు కొంచెం గీరుకుపోయింది అనడం- ఇలాంటివన్నీ ఉదాహరణలు. అండర్ స్టేట్మెంట్ను అతిశయోక్తికి వ్యతిరేకమైనదిగా అభివర్ణించవచ్చు.
లిటోట్ (Litote) అన్నది అండర్ స్టేట్మెంట్లోని ఒక ప్రత్యేకమైన రకం. He is Stupid అనే బదులు He is not the brightest student in the class అని వ్యాఖ్యానించడం లిటోట్ అవుతుంది. ‘రాజుగారి పెద్ద భార్య పతివ్రత అన్నట్టు’ అనే సామెత అన్యాపదేశంగా ఏం చెప్తున్నది? రాజుగారి చిన్న భార్య పతివ్రత కాదు అనే కదా. కనుక ఇది లిటోట్.
ఇలా ఆంగ్ల సాహిత్యంలో సాహిత్య సాధనాలు ( Literary devices) పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతాన్ని తెలుగు కవులు వాడుతున్నారు కూడా. కానీ, ఆ విషయం వారికి తెలియదు. కొన్నింటికి మనం తెలుగు పేర్లను పెట్టుకోలేదు. ఆంగ్లంలో ఉన్న సాహిత్య ఉపకరణాలన్నింటి గురించి రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది.
– ఎలనాగ