గులాబీని ఏ పేరుతో పిలిచినా దాని గుబాళింపు ఒకటే అనే అర్థం వచ్చే ఆంగ్ల సామెత ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అయితే గులాబీ పేరును ఎరువుల కంపెనీకో, పురుగు మందుల కంపెనీకో పెట్టవద్దు అన్నట్టుగా ఉన్నది కేంద్ర సెన్సార్ బోర్డు తీరు. ఓ అత్యాచార బాధితురాలు జరిపే న్యాయపోరాటం కథాంశంతో తీసిన మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ కేరళ హైకోర్టు’పై బోర్డు అభ్యంతరం చెప్తున్నది. టైటిల్ మాత్రమే కాకుండా సినిమాలో ప్రధాన పాత్రధారి పేరు కూడా మార్చాలని భీష్మించుకు కూర్చున్నది. సాధారణంగా కొన్ని దృశ్యాలు తొలగించాలని, ఫలానా డైలాగు బాగా లేదని బోర్డు అడ్డు చెప్పడం తెలిసిందే. కొన్నిసార్లు సినిమా టైటిల్ విషయంలోనూ వివాదం తలెత్తడమూ జరిగింది. అయితే ఈసారి విధివంచిత అయిన హీరోయిన్‌కు సీత పేరు (జానకి) పెట్టడంపై వివాదం రాజుకున్నది. సీత ఓ పౌరాణిక పాత్ర, దేవత పేరు కావడమే అందుకు కారణమని బోర్డు అంటున్నది. దీంతో టైటిల్ తరహాలోనే వ్యవహారం కేరళ హైకోర్టుకు ఎక్కింది. ఈ కేసు విచారణ సందర్భంగా ‘జానకి పేరు పెడితే తప్పేమిటి?’ అనే ప్రశ్నను జస్టిస్ ఎన్.నగరేశ్ ధర్మాసనం సంధించడం గమనార్హం.
న్యాయస్థానం ముందు సెన్సార్ బోర్డుకు మద్దతుగా ‘దేవత’ అనే వాదననే కేంద్రం తెరపైకి తేవడం విడ్డూరం. సినిమాలో మతపరమైన ప్రస్తావన ఏదీ లేదని నిర్మాతలు చెప్తున్న సంగతి సెన్సార్ బాధ్యులెవరికీ తలకెక్కుతున్నట్టు లేదు. తటస్థమైన పేరు పెట్టాలని, లేకుంటే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని న్యాయస్థానంలోనూ బోర్డు వాదిస్తున్నది. ఈ మనోభావాల విషయం ఓ బ్రహ్మపదార్థంలా తయారైంది. తెలుగు సినిమా విషయమే తీసుకుంటే మనకు ఓ సీత కథ, సీత గీత దాటితే, రాముడే రావణుడైతే వంటి టైటిల్స్ కోకొల్లలుగా కనిపిస్తాయి. ఆ పేర్ల గురించి ఎవరూ అభ్యంతరపెట్టిన దాఖలాలు లేవు. నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో పురాణ పాత్రలను ప్రస్తావించడమూ జరుగుతుంది. ‘రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది’ అన్న సామెతలూ ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో వాటిమీదా సెన్సారింగ్ పెడతారేమో!
ఢిల్లీలో లేదా ముంబైలో చక్రం తిప్పుతున్న పెద్దలు మనోభావాల ముసుగులో గత జూన్ 20న విడుదల కావాల్సిన సినిమాను ఆపుతూ వస్తున్నారు. సినిమా కళాత్మకమైనదే కాదు, వ్యాపారం కూడా. నిర్మాత పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయం. మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపీ ఈ సినిమాలో నటించడం విశేషం. ఆయన కూడా ఈ వివాదంపై మౌనం వహించడం విమర్శలకు గురవుతున్నది. యావత్తు మలయాళ సినీ పరిశ్రమ సెన్సార్ బోర్డు తీరుపై మండిపడుతున్నది. దేశవ్యాప్తంగా బోర్డు తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మనోభావాల పేరిట కళాత్మకతకు సంకెళ్లు వేసే ధోరణి అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది.