తెలంగాణ వస్తదని, తెలంగాణలో స్వయం పాలనను కూడా చూస్తామని ఊహకందని విషయాన్ని ఆచరణ మార్గం పట్టించి, దేశాన్నే ఏకం చేసి, అందరిచేత తెలంగాణకు జై కొట్టించిన అస్తిత్వ, ఉద్యమ పతాక కేసీఆర్. స్వరాష్ట్ర సాధన కోసం ఎందరెందరో తపించారు. కానీ, ఎవరికీ సాధ్యం కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కేసీఆర్.
సత్యం చెప్పాలె, నిజం మాట్లాడాలె.. ఉమ్మడి పాలనలో వెన్నెల చూడలేని పల్లెలుగా తెలంగాణ మారింది. నిర్బంధాలతో నిప్పుల కుంపటైంది. ఆగ్రహించిన యువత ఆర్ట్స్ కాలేజీ మెట్లమీంచి, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి, రాచకొండల గుట్టల నుంచి నాడు గొంతెత్తి అరిచింది. ఎక్కడ, ఏ బిడ్డ తెల్లారేకల్లా నెత్తురు ముద్దయి దినపత్రికలకు నెత్తుటి సింధూరం అవుతాడో, ఏ తల్లి ఉలిక్కిపడి కలత నిద్రలో కన్నీటి నది అవుతుందో తెలియని పరిస్థితి. ‘గాంధీ పుట్టిన దేశమా ఇది? నెహ్రూ కోరిన సంఘమా, రామరాజ్యం, సామ్యవాదం సంభవించే కాలమా ఇది?’ అని కవులు రాసిన పాటలకు తెలంగాణ ఉద్రిక్తతకు గురైంది. ‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ..’ అన్న పాట నాటి నిరుద్యోగ భారతానికి నిదర్శనంగా నిలిచింది.
తెలంగాణలో కన్నీరు పెట్టని పల్లె లేదు. భూమి, భుక్తి, విముక్తి పోరాటాలు ఎగిసాయి. ఊరు మారాలే, ఊర్లో పెత్తందారీతనాలు మారాలే.. భూములు ఇంకో రూపంలో చెరబడ్డాయి. భూమి లేదు, భుక్తి లేదు, విముక్తి లేదు.. నాలుగు వేల నల్లదేహాలు మాత్రం నేలకొరిగాయి. ఎక్కడ, ఏ వసంత మేఘగర్జన విన్నా తెలంగాణ పిడికిలెత్తింది, నెత్తురిచ్చింది. తెలంగాణలో స్థూపాలు లేని ఊళ్లు లేవు. దూపతీరిన గ్రామం లేదు. పాలమూరు బొంబాయి బస్సెక్కింది. కరీంనగర్ చౌటుప్పల్, నిజామాబాద్లు రెక్కలు కట్టుకొని వలస పక్షులై దుబాయికి పాయే!! గోదావరి పరీవాహక ప్రాంతమంతా గొంతెండిపోయింది. నాగేటిసాళ్లు నల్లరేగడిలు రైతు బిడ్డ బోర్ల రాంరెడ్డి ఆవేదనలుగా మారింది నిజం కాదా!! ఫ్లోరోసిస్ భూతంతో పళ్లు పాచిపోయి, ఒళ్లంతా కుంగిపోయి తెలంగాణ మంచం పట్టింది వాస్తవం కాదా? తెలంగాణది ఒక గోస కాదు, ఒక తీరు కాదు. నెర్రెలు బారిన నేలలకు, గొంతెండిపోతున్నా ఇక్కడ నీళ్లియ్యలేకపోయిన దుర్మార్గపు దుస్థితికి కారణమెవ్వరో? గుండెలు పగిలి రోధిస్తుంటే జనం వెన్నుమీద వేసిన కనకపు సింహాసనాలపై కూర్చున్నవాళ్లు ఏమీ చేయకపోవడంతో.. జనం నిస్సత్తువతో కూలబడ్డ దృశ్యాలన్నీ కాలం కెమెరాలో నిక్షిప్తంగానే ఉన్నాయి.
లోకానికి చెప్పేవాళ్లు కాదు, చేసి చూపించి వ్యవస్థను మార్చేవాళ్లు కావాలి. సరిగ్గా ఈ సందిగ్ధ కాలంలోనే బక్క చిక్కిన తెలంగాణ కోసం ఒక బక్క మనిషి వచ్చి పిడికిలి బిగించిండు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం గొంతు విప్పిండు. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయిలకు పోయే తెలంగాణ జీవన చిత్రపటం మారాలన్నడు. స్వరాష్ట్ర సాధనొక్కటే మార్గమని రాజకీయ ఉద్యమ ప్రక్రియను చేపట్టిండు. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’నని పంతం పట్టి నిలిచిండు. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించే ఉద్యమ రూపం రచించి, వాటిని ఆచరణాత్మకంగా చేసి చూపించి, పోరాడిన స్వరాష్ట్ర సాధకుడిని ఈ నేల ఎప్పటికీ మరవదు. ఆయన చీకటి తెలంగాణకు వెండి వెన్నెల. బీళ్లకు నీళ్లు మళ్లించిన కాళేశ్వర మహాసాగరం.
‘తెలంగాణ తెస్తామని చెప్పి వెన్నుచూపి పోయినోళ్లనెందరినో చూసినా.. ఇతగాడు తెలంగాణ తెచ్చి తీరుతాడన్న నమ్మక ముంది’ అని కాళోజీ నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్ ఆచరణాత్మకంగా తెలంగాణ తెచ్చిండు. ‘ఎవరు, ఎన్ని విశ్లేషణలు చేసినా తెలంగాణ కోసం పంతం పట్టి, పట్టిన పట్టును విడవకుండా నిలిచి, కార్యసాధకుడై గెలిచి తెలంగాణను నిలుపుతాడు’ అన్న తెలంగాణ సిద్ధాంతకర్త, కాలజ్ఞాని కొత్తపల్లి జయశంకర్ చెప్పిన మాటను నిజం చేసిన కార్యసాధకుడు కేసీఆర్.
స్వరాష్ర్టాన్ని సాధించి తిరిగి ఆయనే పునర్నిర్మాణధారిగా మారి నదులకు నడక నేర్పి బీడు భూములకు, నీళ్లెక్కవన్న ఎగువ భూములకు మళ్లించిండు. నీళ్లు, నిధులు, నియామకాలకు ఆచరణ రూపమిచ్చిండు. వలసలను ఆపిండు. చెప్పిన దానికంటే ఎక్కువ చేసి చూపిండు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగుల గురుకులాలను పెంచిండు. రైతుల ఆత్మబంధువు అయ్యిండు. కన్నీరు పెట్టిన తెలంగాణను సుభిక్షంవైపు నడిపిండు. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ పథకం ద్వారా బీసీ బిడ్డలు దేశ విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. దళితబంధు విప్లవాత్మక చర్య. గురుకులాలు రేపటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల బిడ్డల చదువులకు మెట్లు. గురుకులాల నుంచి రాబోయే ఆ బడుగుల బిడ్డలే రేపటి తెలంగాణలోని అన్నిరంగాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతారు. బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంతో జోడించి తెలంగాణలోని గంగాజమున తెహజీబ్ సంస్కృతిని నిలబెట్టిన దార్శనికుడు కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణానికి పునాది.. భవిష్యత్తు తెలంగాణకు ఊపిరి పోసిండు. ప్రజల కోసం పనిచేయడం కంటే మించినది మరొకటి లేదు. నారు పోసినోడే నీరు పోస్తాడని చిన్నప్పుడు చదువుకున్నా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నారు పోసి స్వరాష్ర్టాన్ని సాధించి, నీళ్లు పోసిన కేసీఆర్ను తెలంగాణ సమాజం చూసింది. మనందరం ఉద్యమంలో పాల్గొని స్వరాష్ర్టాన్ని సాధించుకుని విజేతలమయ్యాం. ఓడి గెలిచిన తెలంగాణకు మనమే నిషాని. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17 కాదు, 2014 జూన్ 2 అని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. వందేండ్ల ముందుచూపున్న దార్శనిక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.