‘కుల విమోచన పోరాట సమితి’ (కెవీపీఎస్) నేపథ్యం నుంచి ఎదిగివచ్చిన దళితుడు, సీపీఎం కార్యకర్త జాన్ వెస్లీ, ఆ పార్టీపై మొదటి నుంచి గల అగ్రకుల నాయకత్వ ఆధిపత్యాన్ని భంగపరుస్తూ, తెలంగాణ సీపీఎం కొత్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎంతో విశేషతతో కూడుకున్న ఈ పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది. పోరాటశీలత, శ్రమించి పనిచేసే తత్తం గలవాడనే పేరున్న ఆయన, రాగలకాలంలో ఆ పార్టీపై, పార్టీ కార్యకర్తలపై, ఆలోచనా సరళిపై, విధానాలపై, కార్యాచరణపై ఎటువంటి ముద్ర వేయవచ్చునన్నది ఆసక్తికరమైన విషయమవుతున్నది.
శ్రామికవర్గ రాజ్యాధికారమని సిద్ధాంతీకరించి, ఆ వర్గాల మద్దతుతోనే మనుగడ సాగించే కమ్యూనిస్టు పార్టీలు పార్టీ యంత్రాంగ ఉన్నత స్థానాలలో మాత్రం సదరు తరగతులకు, మహిళలకు తగిన అవకాశం ఇవ్వకపోవటంపై విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. అలాంటి స్థితిలో అనూహ్యమైన విధంగా జాన్ వెస్లీకి చోటు లభించింది. అందుకు కారణాలు ఏవైనప్పటికీ, పార్టీలోని శ్రామిక వర్గాలతో పాటు, బయటి ప్రజలు కూడా దీన్ని ఆహ్వానించవలసి ఉంటుంది. నియామకం జరిగినప్పటి నుంచి తన మునుపటి ధోరణిలోనే ఒక గట్టి కమ్యూనిస్టు వలె మాట్లాడుతూ, కార్యాచరణల గురించి చెప్తున్న ఆయన, రాగల కాలంలో ఏమేమి చేసి తన ముద్ర వేయగలరో చూడవలసి ఉన్నది. పార్టీని శక్తివంతం చేసేవిధంగా పనిచేస్తూ అటువంటి ముద్రను గత కార్యదర్శులు వేయలేకపోయారు.
రాష్ట్రంలో సీపీఎంతో పాటు కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలిసిందే. వెస్లీకి పార్టీ బాధ్యతలు లభించింది మహా క్లిష్ట స్థితిలో. అటువంటప్పుడు, ఎంతటి పోరాటశీలత, శ్రమించి పనిచేసే తత్వం గల నాయకునికైనా పార్టీని ఒక లోతైన కూపంలోంచి బయటకు తీసి ముందుకు తీసుకుపోగలగటం తేలికైన పనికాదు. అది కూడా ఒకవేళ ఆ పార్టీలో ఊడలు దించుకొని పాతుకుపోయిన వర్గాలు తనకు అవసరమైన స్వేచ్ఛ ఇవ్వని పక్షంలో. ఈ సందర్భంగా కాంగ్రెస్లో దళిత నాయకుడైన దామోదరం సంజీవయ్య ఉదంతం అనివార్యంగా గుర్తుకువస్తుంది. వెస్లీకి అటువంటి దుస్థితి ఎదురుకాకపోయినా, కమ్యూనిస్టులు అనుసరిస్తామని కనీసం పైకి చెప్తుండే ప్రజాస్వామిక కేంద్రీకృత (డెమోక్రటిక్ సెంట్రలిజం) పద్ధతులకు లోబడి అయినా ఎంతవరకు వెసులుబాటును ఇవ్వగలరో రాగల రోజులలో కనిపించనున్నది.
సీపీఎం కొత్త కార్యదర్శి ఎదుట గల సవాళ్లు అనేకం. పైన చెప్పుకున్నట్టు, అన్ని సవాళ్లూ, కార్యాల అంతిమలక్ష్యం, తమ పార్టీని తమవారంతా కలిసి ఒక లోతైన కూపంలోకి నెట్టి మరీ తోయగా, దానిని గజ కళేబరం వలె సర్వశక్తియుక్తులు ఒడ్డి బయటకు లాగి ముందుకు నడిపించగలగటం. ఇక సవాళ్లు ఏమిటన్నది ఒక్కొక్కటిగా చూద్దాము. తమది తెలంగాణ శాఖ ఐనందున అన్నింటికన్న ముందు చేయవలసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సీపీఎం ద్వారా అధికారికంగా ఎండార్స్ చేయించటం. రాష్ట్ర ఉద్యమాన్ని తక్కిన అన్ని వామపక్షాలు ఏదో ఒక దశలో బలపరచటమో, తర్వాత ఒక రాష్ట్రంగా ఎం డార్స్ చేయటమో జరుగగా, అందుకు ఈ 11ఏండ్ల తర్వాత సైతం నిరాకరిస్తున్న ఏకైక పార్టీ సీపీఎం. వారు ఆచరణలో ఏమైనా చేస్తుండవచ్చుగాక. కానీ, దాన్ని అడ్డుపెట్టుకొని సిద్ధాంతరీత్యా మాత్రం కాగితంపై ఎండార్స్ చేయకపోవటంలో చాతుర్యత తప్ప నిజాయితీ కనిపించదు. తాము అందరికీ మించిన సిద్ధాంత కర్తలమన్నది వారి ప్రగాఢ నమ్మకం.
సీపీఎం వైఖరికి సంబంధించి భాషా ప్రయుక్త రాష్ర్టాలు, ఆ పేరిట కోస్తా ధనిక వర్గాల దోపిడీలు, అణచివేతలు, సీపీఎం నేతల ప్రాంతీయలు, కుల ధోరణులు, అసలు లింగ్విస్టిక్స్ గురించీ, నేషనాలిటీస్ గురించి స్టాలిన్ రాసిందేమిటి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఒప్పందాల ఉల్లంఘనలు, ఆచరణలో ఏర్పడిన వైరుధ్యాలు, వాటిపై సీపీఎం చెప్పిందేమిటి, చేసిందేమిటి అన్న చర్చలు ఉద్యమ కాలంలో చాలానే జరిగాయి. వాటిపై స్వయంగా తమ పార్టీలో ముందుకొచ్చిన ప్రశ్నలను అణచివేసిన సీపీఎం రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు, ఆయా ప్రశ్నలకు నేటికీ సూటి సమాధానాలు చెప్పడం లేదు. చతురమైన విధంగా నిజాయితీ లేని దాటవేత ధోరణిని చూపుతున్నాయి. వారికి తెలంగాణలో ఉనికి కావాలి, ఇక్కడి కార్యకర్తలు కావాలి, ఇక్కడ ప్రజల మద్దతు, ఓట్లు, సీట్లు కావాలి. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అక్షరాలా 11 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత కూడా దానిని ఎండార్స్ చేయరు. మార్క్సిజంలో ఇంత కపటపు నీతి ఉంటుందా? వారిని తెలంగాణ ప్రజలు మాత్రం ఎందుకు ఎండార్స్ చేయాలి?
జాన్ వెస్లీకి ఇదొక సవాల్ అవుతున్నది. ఆయన మహబూబ్నగర్ వంటి అత్యంత వెనుకబడిన జిల్లాకు చెందిన పేద కుటుంబపు మనిషి. ఇంతకుముందటి కార్యదర్శుల వలె సంపన్న జిల్లాలకు చెందిన సంపన్నుడు కారు. కనుక ఈ ప్రాంతపు బాధలు, ఆక్రోశాల గురించి తనకెవరూ చెప్పనక్కరలేదు. అటువంటి మట్టి మనిషి అయినందువల్ల తనపై ఈ విషయంలో ఆశాభావాలున్నాయి. అందువల్ల ఆయన తమ రాష్ట్ర, కేంద్ర నాయకులతో వాదించి ఒప్పించి, తెలంగాణ రాష్ర్టాన్ని ఎండార్స్ చేయించాలి. ఇక్కడి ప్రజలకు ఈ విషయంలో మొహాన్ని చూపించగలగాలి. గతంలో ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి తెలంగాణకు బద్ధ విరోధిగా ఉండి ఏమేమి తంత్రాలు సాగించారో తెలియనిది కాదు. ఇప్పుడాయన లేరు. కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరయ్యేదీ తెలియదు గాని (బీవీ రాఘవులు కాకుందురు గాక), ప్రకాశ్ కరత్ అటువంటి విరోధి కారు. పైగా ఇప్పుడు కొత్త విధాన నిర్ణయం ఏమీ ఉండదు, ఒక వాస్తవాన్ని ఎండార్స్ చేయటం తప్ప. అందువల్ల వెస్లీ దీనిపై దృష్టిపెట్టడం వారికే మేలు చేస్తుంది. అంతే తప్ప సమస్యలపై ఆర్థిక పోరాటాలంటూ ఏవో మొక్కుబడిగా చేస్తే ప్రజలు ఈ మాట మరిచిపోతారనే గత కార్యదర్శుల ఎత్తుగడలు ఫలించవని గ్రహించాలి ఆయన.
రెండవది, తెలంగాణ వంటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు గల చోట పార్టీ బలోపేతం. తెలంగాణ ఏర్పడిన కొత్తలో వారు సుందరయ్య కేంద్రంలో పార్టీ బయటివారితో రెండు విస్తృతమైన సమావేశాలు జరిపి నోట్సులు చాలానే తీసుకున్నారు. తర్వాత డజను వామపక్షాలతో చర్చలు జరిపి డజనున్నర పాయింట్లతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. అప్పటి అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగనున్నది తామేనని ప్రతినలు చేశారు. ఏడాది తిరగకముందే ఆచరణలు ఏమీ లేకపోగా ఐక్యత అయినా లేక అంతా విచ్ఛిన్నమయ్యా రు. టిక్కెట్లు, పోటీలు, పొత్తులపై ఎప్పటి వలెనే ఎవరి దారి వారిదైంది. అసెంబ్లీలో మిగిలింది సున్నాలు లేదా ఒకట్లు. టికె ట్లు ఇవ్వని పెద్ద పార్టీలపై అలగటాలు, శాపనార్థాలు. నూరేండ్ల స్థాపనోత్సవాలను ఇటీవలె జరుపుకున్న కమ్యూనిస్టు పార్టీలకు, తెలంగాణ వంటి పోరుగడ్డపై, 75 ఏండ్ల కిందటి రైతాంగ పోరాటం గురించి అరిగిపోయిన స్వరాలతో చాటుకొని బతకటం మినహా, మరేమీ లేక ఈ దయనీయ స్థితిలో మిగలటం కన్న ఆత్మహత్యాసదృశం మరేమైనా ఉంటుందా?
వెస్లీ ఎదుట పెద్ద బాధ్యతే ఉన్నది. పార్టీ కళేబరాన్ని బావి నుంచి పైకి తోడటంలో తనకు కార్యకర్తల బలం తప్ప, నాయకుల మద్దతు ఎంత లభించేదీ అనుమానమే. పైగా వా రు ఆరితేరిన ఘటనాఘటన సమర్థులు. ఆటంకాలు సృష్టిం చి వెస్లీని సంజీవయ్యగా మార్చగలవారు. సీపీఐ తదితర వామపక్షాలతో విలీనం కాదు గదా, తాము మధ్య మధ్య గంభీరంగా ప్రకటించే ఐక్య కారాచరణను సైతం భంగపరుస్తూ వస్తున్న వాద సంవాద దురంధరులు. ప్రతి అంశం లో తమ మాటే వేద (మార్క్స్) వాక్కు కావాలనే పరమ అహంభావులు. పశ్చిమబెంగాల్ ఐక్య సంఘటనల నుంచి మొదలుకొని ఇక్కడివరకుఇతర సహచర పక్షాల నుంచి ‘బిగ్ బ్రదర్’ బిరుదులు పొందిన మార్క్సియన్ కామ్రేడ్స్. అందువల్ల వెస్లీపై గల పెద్ద బాధ్యత కొండంత అవుతున్నది.
కొత్త కార్యదర్శికి ఈ బాధ్యతల నిర్వహణలో తోడు రాగలిగినది తమ పార్టీలోనే కొంతకాలంగా చర్చ జరుగుతున్న లాల్-నీల్ ఐక్యత. దళితుడై, కేవీపీఎస్ నాయకుడు కూడా అయిన తనకు ఈ విషయమై ఎవరూ చెప్పవలసింది ఏమీ లేదు. దాని ప్రాముఖ్యం గురించి, అవసరం గురించి, ప్రయోజనం గురించి. ఇతర పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శలు ఒక్క రొటీన్ కార్యకలాపం. సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా అంతే. అవి నిష్ప్రయోజనకరంగా సాగుతూనే ఉంటాయి. అంతిమంగా, మౌలికంగా కావలసింది తమ పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించుకోవటం, కార్యకర్తలను, ప్రజా సంఘాలను ర్యాలీల కోసం, కాలక్షేపపు ఆందోళనల కోసం, ఇతర పార్టీలకు తమ ఓటు బ్యాంకులుగా చూపి టికెట్లు, పదవులు సంపాదించటం కోసం గాక, వారు ఏమంటున్నారో చెవిపెట్టి ఓపికగా విని, తమ ధోరణులను, ఆచరణను మార్చుకోవటం.
జాన్ వెస్లీ ఇందులో సాధించగలది, లేనిది ఏమిటో ఎవ రూ చెప్పలేరు. కానీ, తను చివరికి పద్మవ్యూహపు పోరులో అభిమన్యునిగా మిగిలినా, కురుక్షేత్రంలో ఇంతకుముందటి పార్టీ కార్యదర్శులు ఎవరూ వేయలేకపోయిన (వారికి అసలు ఆ ఉద్దేశం అంటూ ఉందనుకుంటే) ముద్రను తాను మిగల్చగలరు. అది జరిగితే, ఆ ప్రభావాలు తమ కార్యకర్తలను నేలకు కొట్టిన బంతి వలె పైకి ఎగసిపడేట్లు చేయగలవు.
– టంకశాల అశోక్