అన్ని పార్టీలు కలియ తిరుగుతూ వస్తోన్న సినీనటి జీవిత ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. అక్కడ ఎంతకాలం ఉంటారన్నది.. వేరే సంగతి కానీ, ఎక్కే గడప..దిగే గడప ఎంతకాలం. ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చెబితే, జహీరాబాద్ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉండమని చెప్పారట. ఈ మాటే ఇప్పుడు కమలం పార్టీలో నిప్పు రాజేస్తున్నది. గతంలో తాను గజ్వేల్ నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు ఈటల రాజేందర్ ప్రకటిస్తే, ఎవరంతకు వారే ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుంటే ఇక తాము ఉన్నది ఎందుకని బండి సంజయ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఎవరైనా తమంతట తామే ఫలానా చోట నుంచి పోటి చేస్తామని ప్రకటించుకుంటే వారికి టికెట్ రాదు రాసిపెట్టుకోండని బండి సంజయ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇన్ని సుద్దులు చెప్పిన బండి సంజయ్ ఎవరితో సంప్రదించకుండా జీవితకు జహీరాబాద్ నుంచి పోటికి సిద్ధంగా ఉండమని ఎలా చెప్పారని బండి వ్యతిరేక వర్గం పార్టీలో రచ్చ రచ్చ చేస్తున్నట్టు సమాచారం.
తనను ఉద్దేశించి ఒక మంత్రి అమర్యాదకరంగా మాట్లాడారంటూ ఆరు నెలల కిందట వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తప్పు పట్టారు. దీనికి సదరు మంత్రి స్పందించి వివరణ ఇవ్వడంతో వివాదం సమసిపోయింది కూడా. వాస్తవానికి సదరు మంత్రి ఎమన్నారన్నది ఎవరికీ తెలియదు. అయితే ఫలానా మంత్రి గతంలో తనను ఇలా అన్నారంటూ, తెలియని వారికి కూడా తెలిసేలా ఇటీవల షర్మిలనే ఊరూరా చాటింపు వేస్తున్నారు. ఒక మహిళ పట్ల ఇలాగేనా సంస్కారహీనంగా మాట్లాడేదని ఒకవైపు ప్రశ్నిస్తూనే, మరోవైపు మగాడివైతే సమాధానం చెప్పు, ఎవడ్రా నువ్వు, వీధి కుక్క, వెధవ, చెప్పుతో సమాధానం చెబుతా, ఏం పీక్కుంటారని మరింత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఒకవైపు సంస్కారం గురించి మాట్లాడుతూ, మరోవైపు సంస్కారహీనంగా మాట్లాడటం ఏమిటని షర్మిల వ్యాఖ్యలపై జనం విస్తుపోతున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తనది ప్రధాని మోదీ స్థాయి అనుకుంటున్నట్టు ఉన్నారు. అందుకే ఆయన ఈ మధ్య ఏకంగా మోదీతోనే పోటీ పడుతున్నారు. బీజేపీ జాతీయ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులను రప్పించి ప్రధాని మోదీ హైదరాబాద్‌లో సమావేశం పెడితే, వచ్చే నెలలో తాను ఏకంగా 18 మంది దేశాధినేతలను హైదరాబాద్‌కు రప్పించబోతున్నట్టు పాల్ సంచలన ప్రకటన చేసా రు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ హామీ ఇస్తే, తాను ఒక్క మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోనే 58 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇవేకాకుండా మరో 59 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారికి పాసుపోర్టు, వీసాలు ఇచ్చి విదేశాలకు పంపించనునట్టు కూడా తాజాగా పాల్ ప్రకటించారు. ఈ 58.. 59 సంఖ్యలు ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా జుట్టు పీక్కుంటుంటే, సోషల్ మీడియాలో మాత్రం బహుశా మునుగోడులో ఆయనకు వచ్చే ఓట్లు అయి ఉంటాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా, మునుగోడు అభ్యర్థులారా.. పాల్ పార్టీ బరిలోకి దిగుతుంది…బహుపరాక్. -వెల్జాల