దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో రోజూ ఏదో ఒక సమస్యపై వివిధ పార్టీలు, సంఘాలు ధర్నా చేస్తుంటాయి. కానీ వాటిని పాలకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు జెన్ జీ చేసిన ఉద్యమం యావత్తు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. అందరిలా తనది బయోలాజికల్ జన్మకాదని, నాన్ బయోలాజికల్ జన్మ అని, దైవాంశ సంభూతుడినని తనకు తానే కితాబు ఇచ్చుకున్న ప్రధాని మోదీ, జెన్ జీ ఉద్యమానికి దిగి వచ్చి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించక తప్పలేదు. ప్రాంతీయ పార్టీల తరహాలో అంతా తానై ప్రభుత్వాన్ని మోదీ నడుపుతున్నారు. పేరుకే మంత్రులు, కనీసం తమ కార్యాలయ సిబ్బందిని కూడా సొంతంగా నియమించుకొనే హక్కు వారికి లేదు. అలాంటి మోదీ దిగివచ్చేలా చేయగలిగింది.. జెన్ జీ ఉద్యమం.
ప్రధాని నరేంద్రమోదీ అహంకారంపై జెన్ జీ తరం దెబ్బ కొట్టింది. యువతరం ఉద్యమానికి దిగి వచ్చి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే అది ప్రధాని నిర్ణయం. నెలరోజుల నుంచి దేశంలో యువత రగిలిపోతున్నా రాజీనామా చేయకుండా ఉన్నారంటే అది కూడా మోదీ నిర్ణయమే. జంతర్ మంతర్ వద్ద జరిగిన యువత ఉద్యమం ఒక్క నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి పరిమితం కాదు. యువతలో నెలకొన్న అసంతృప్తికి, జెన్ జీ పోరాట పటిమకు, బీజేపీ కోటలకు బీటలు వారుతున్నందుకు అదొక నిదర్శనం. 13 ఏండ్ల పాలన తర్వాత జెన్ జీ తరం మోదీకి ఓ విషయం స్పష్టంచేసింది… ఇది ప్రజాస్వామ్యం, మీరు ప్రజాస్వామ్య పాలకులు, రాజు కాదు అని.
ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమాన్ని చూసిన తర్వాత సీనియర్ సిటిజన్స్ సైతం ధైర్యంగా నిలదీయడం జెన్ జీ నుంచి నేర్చుకోవాలి అనిపించింది. దేశం మొత్తంలోని యువత సంఖ్యతో పోలిస్తే ఈ ఉద్యమంలో పాల్గొన్న వారి సంఖ్య స్వల్పం కావచ్చు. కానీ ఉద్యమంలో నేరుగా పాల్గొనకపోయినా తమ ప్రాంతాల నుంచి ఉద్యమానికి అండగా నిలిచారు. దేశంలోని అన్ని మూలల నుంచి ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్స్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో అండగా నిలిచారు.
బీజేపీ ఐటీ సెల్ కన్సల్టెంట్లను పెట్టుకొని మరీ దుష్ప్రచారానికి పాల్పడింది. బీజేపీ నుంచి పెద్దఎత్తున డబ్బుల ఆఫర్‌ను తిరస్కరించిన కొందరు యూట్యూబర్సే.. ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. జెన్‌జీ శక్తిముందు బీజేపీ ఐటీ సెల్ నిలువలేకపోయింది. డబ్బులకు రీల్స్ తయారు చేసేవారికి, హృదయం నుంచి వచ్చిన స్పందనను రీల్స్‌గా చేసేవారికి తేడా ఉంటుంది. ఈ ఉద్యమంలో అదే జరిగింది. పోలీసులు లాఠీలతో కొడుతుంటే యువతులు ముందుకు వెళ్లి ధైర్యంగా నిలబడ్డారు.
ఒక గుంపుపైకి పోలీసులు లాఠీ ఎత్తితే ఒక అమ్మాయి వారికి అడ్డంగా చేతులు పెట్టింది. పిల్లలు తమ తోటి ఉద్యమకారుల కోసం దెబ్బలు తినడానికి సిద్ధమయ్యారు. ముంబైలో ఒక వాహనంలో పోలీసులు ఉద్యమకారులను తీసుకువెళుతుంటే ఒక యువతి ఆ వాహనం ముందు ధైర్యంగా నిలిచి అడ్డుకుంది. జెన్ జీలో ధైర్యం, పోరాట పటిమను చాటిచెప్పే ఇలాంటి దృశ్యాలు వందలు వేలు. జెన్ జీ ఉద్యమాన్ని చూశాక కచ్చితంగా దేశ ప్రజలు వీరి పట్ల గౌరవాన్ని పెంచుకోవాల్సిందే.
బీజేపీ ఐటీ సెల్ వాళ్లు, సానుభూతిపరులు సామాజిక మాధ్యమాల్లో ఎంత ట్రోల్ చేసినా జెన్ జీ భయపడలేదు. తెలుగు, హిందీలో జెన్ జీ ధైర్యంగా బీజేపీ వాళ్ల ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం చూసి ముచ్చటేసింది. 20 ఏండ్ల అమ్మాయిల్లోని ధైర్యాన్ని చూసి నేర్చుకోవాలి అనిపించింది. జెన్‌జీ ఉద్యమం ద్వారా జాతీయ టీవీ చానెళ్ల నిజరూపం కూడా ప్రజలకు అర్థమైంది. విద్యార్థుల ఉద్యమం వెనుక పాకిస్థాన్ ఉన్నదని, ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత కాసేపటికి చైనా, బంగ్లాదేశ్ ఉన్నాయంటూ రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామి కట్టుకథలు వండివార్చారు.
ఇంకా బీజేపీ అనుకూల జర్నలిస్ట్‌ల ఫొటోలతో ఉద్యమ కారులు ఒక పోస్టర్ తయారు చేశారు. ఉగ్రవాదులు , దేశ ద్రోహులు, దేశానికి నష్టం కలిగిస్తున్న వాళ్లే వీళ్లని నినాదాలను పోస్టర్ మీద రాయడం విద్యార్థుల ఉద్యమాన్ని కండ్లకు కట్టినట్టు చూపించింది.. బీజేపీ అనుకూల జాతీయ చానెళ్ల దివాలాకోరుతనాన్ని బయటపెట్టింది యూట్యూబ్ చానళ్లే. అనేక దేశాల మీడియా ఉద్యమాన్ని కవర్ చేస్తే జాతీయ మీడియా మాత్రం ఉద్యమాన్ని ఎలా నీరు కార్చాలా అని చూసింది. దానికోసం తీవ్రంగా ప్రయత్నించి పరువు పోగొట్టుకున్నది.
పెద్ద మీడియాలను క్షణాల్లో కొనిపించి, మోదీ గోదీ మీడియాగా మార్చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ మీడియా చానెళ్లు చాలా వరకు తమ విశ్వసనీయతను కోల్పోయాయి. విద్యార్థుల ఉద్యమం వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నదంటూ తప్పుడు ప్రచారం చేసిన మీడియా, ఇప్పుడేం సమాధానం చెప్తుంది? పాకిస్థాన్‌కు మోదీ తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారా? పాకిస్థాన్ వాళ్లు చొరబడి, భారత రాజధానిలోని జంతర్ మంతర్‌లో ఉద్యమిస్తుంటే, మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని బీజేపీ అనుకూల మీడియాను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తుంది?
ఉద్యమంలో ఎన్నో అద్భుత దృశ్యాలు కనిపించాయి. ఇద్దరు హిందీ సినిమా యువ దర్శకులు జంతర్ మంతర్ వద్ద చెత్తను ఏరి బ్యాగుల్లో నింపుతూ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ‘ఉద్యమానికి ఇది మా వంతు సహాయం’ అన్నారు. హిందీలో టాప్ గాయకుడు అరిజిత్. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా, ఇక సినిమాలకు పాడకుండా భక్తి గీతాలు పాడుకుంటూ ఉన్నారు. అరిజిత్ జంతర్ మంతర్ ఉద్యమానికి మద్దతు ఇస్తే, ఆయన అభిమాని వ్యతిరేకించాడు. అందుకు హరిజీత్ స్పందిస్తూ నీ అభిమాన జాబితా నుంచి నా పాటలన్ని తొలగించు, నా పాటలన్ని మరిచిపో నా మద్దతు విద్యార్థులకే అని సమాధానం ఇచ్చారు.
జెన్ జీ ఉద్యమం ఒక్క నీట్ పేపర్ లీకేజీపై మాత్రమే కాదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, విద్యా సంస్కరణల కోసం కూడా. విద్యా రంగంలో సంస్కరణలు కోరుతూ స్వతంత్ర భారతదేశంలో యువత ఇంత పెద్దఎత్తున ఉద్యమించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. జెన్ జీ ఉద్యమ వార్తలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకువచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇలానే విద్యార్థులను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. రాజకీయాల గురించి అవగాహన లేని, రాజకీయ పార్టీలకు సంబంధం లేని తల్లులు కూడా ఆహారం తీసుకువెళ్లి విద్యార్థులకు అందించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ స్పందించినట్టే, జంతర్ మంతర్ ఉద్యమంపై మనసున్న ప్రతి ఒక్కరూ స్పందించారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు తెలంగాణ వచ్చినా రాకపోయినా ఈ దేశంలో తెలంగాణ ఉద్యమమే చివరి ఉద్యమం అనే వాదన ఒకటి ఉండేది. ఇకపై కెరీర్ ఉద్యమాలే తప్ప సమాజం కోసం ఉద్యమాలు రావని కొందరు గట్టిగా చెప్పేవారు. అది తప్పు అని జెన్ జీ నిరూపించింది. ఉద్యమం దేశ వ్యాప్తంగా యువతను మేల్కొల్పింది.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, నియంతృత్వంలోనో, రాజరికంలోనో లేమని పాలకులకు యువత గుర్తు చేసింది. మొత్తంగా పేపర్ లీకేజీ ఉదంతం యువతలోని అసంతృప్తి, ఆగ్రహ జ్వాలగా బయటకు తీసుకువచ్చింది. మతతత్వం రెచ్చగొట్టి, మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇప్పుడు ఆ జిమ్మిక్కులు పనిచేయవని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు బీజేపీని వణికించింది జెన్ జీ ఉద్యమం. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలపై ఢిల్లీ పాలకులు దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. మతం పేరుతో గెలిచే పాలకులకు ఉద్యమాలు అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అనేది సరికాదు. దున్నపోతును ఎలా కదిలించాలో జంతర్ మంతర్‌లో యువత చూపించింది.
– బుద్దా మురళి