లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌గాంధీ ‘ప్రజాస్వామ్యంలో జయాపజయాలు ఓ భాగం’ అని ఇంగ్లండ్ మాజీ కన్జర్వేటివ్ ప్రధాని రిషి సునాక్‌కు రాసిన లేఖలో వ్యాఖ్యానించడం ఎంతోమందికి ఆశ్చర్యం కలిగించింది. పార్లమెంటేరియన్‌గా 20 ఏండ్ల అనుభవం, సొంత కాంగ్రెస్ పార్టీ రెండు అంతంతమాత్ర విజయాలు, మూడు వరుస పరాజయాల తర్వాత రాహుల్‌కు ప్రజాస్వామ్యంపై ఇంతటి గొప్ప నమ్మకం కుదరడం మంచిదే. కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకగా భావించే బ్రిటన్‌లో 42 ఏండ్ల వయస్సులో ప్రధాని గద్దెనెక్కి 20 మాసాలు పదవిలో కొనసాగిన రిషి సునాక్‌ను ఓదార్చుతూ 54 ఏండ్ల రాహుల్ లేఖ రాయడం కాస్త వింతగా ఉన్నది. రెండు దేశాలకు సంబంధించిన ఒక ఎన్నికల వాస్తవాన్ని ఇక్కడ పరిశీలిద్దాం.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి నెలవైన్ బ్రిటన్, భారత్‌లో నెల రోజుల తేడాతో వెలువడిన 2024 ఎన్నికల ఫలితాలు ఈ ప్రత్యేక ఎన్నికల ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ రాజకీయపక్షాల ఓట్ల శాతానికి, సీట్ల శాతానికి అసలు పొంతన ఉండని సందర్భాలు అనేకం ఉంటాయి. 2004 నుంచి ఇండియాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, ఇటీవలి బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ హౌసాఫ్ కామన్స్ ఎన్నికల్లోనూ 40 శాతం లోపు ఓట్లు సాధించిన ప్రధాన పార్టీలే అధికారంలోకి రావడం లేదా, పాలక కూటమికి నాయకత్వం వహించే స్థితికి ఎదగడం జరిగింది. పూర్వపు యూపీఏ కూటమికి నాయకత్వం వహించిన రెండు సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో (2000, 2004) కాంగ్రెస్ పార్టీ మొత్తం 543 సీట్లకు గాను వరుసగా 145, 206 సీట్లను సాధించింది. మెజారిటీ మార్కుకు ఆమడదూరంలో ఆగిపోయినా కేంద్రంలో కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ద్వారా అధికారం హస్తగతమైంది.
ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతం వరుసగా 26.5 శాతం, 28.6 శాతం మాత్రమే. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో హస్తం పార్టీ అదనంగా 2009లో 61 సీట్లు గెలుచుకుందంటే దీనికి కారణం అనేకమంది విమర్శించే ‘ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్’ (ఎఫ్‌పీటీపీ) పద్ధతే కారణం. దీన్నే తెలుగులో ‘గెలుపు గీతను మొదట తాకే గుర్రానికే విజయం’ అందించే విధానం అని చెప్తుంటారు. ఈ విధానం గుర్రపు పందేలలో అనుసరించే పద్ధతిని పోలి ఉండటం వల్ల ఎఫ్‌పీటీపీ అని పిలుస్తున్నారు.
ప్రపంచంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిగా పరిగణించే ఇంగ్లండ్ హౌసాఫ్ కామన్స్‌కు జూలై 4న జరిగిన ఎన్నికల్లో 14 ఏండ్లుగా ప్రతిపక్షంగా ఉన్న లేబర్ పార్టీకి కేవలం 34 శాతం ఓట్లతో 63 శాతం సీట్లు (మొత్తం 650కి 412) వచ్చాయి. రెండు శతాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పాలక కన్జర్వేటివ్ పార్టీ ఈసారి అత్యంత కనిష్ఠంగా 121 సీట్లకు దిగజారింది. ఈ పార్టీ ఓట్ల శాతం 24 ఉన్నా బహుముఖ పోటీల కారణంగా సీట్లను భారీ సంఖ్యలో కోల్పోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి 43.6 శాతం ఓట్లు వచ్చినా 56 శాతం స్థానాలు (365) మాత్రమే దక్కాయి. పోటీలో అనేక పార్టీల అభ్యర్థులు రంగంలో ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయని చరిత్ర చెప్తున్నది. అలాగే, కొన్ని చిన్న పార్టీలు ఒక ప్రాంతానికే పరిమితమైనా కానీ అక్కడ ఓటర్ల మద్దతు మెండుగా లభిస్తే మొత్తం అవి ఓట్ల శాతానికి సంబంధం లేకుండా ఎక్కువ సీట్లు సంపాదించవచ్చని కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు నిరూపించాయి.
దేశవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు తక్కువగా ఉన్న రిఫార్మ్ యూకే పార్టీ 14 శాతం ఓట్లను దక్కించుకొని 5 సీట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగింది. అలాగే ఈ పార్టీ కన్నా 2 శాతం తక్కువ ఓట్లు (12 శాతం) పొందిన లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ) 72 సీట్లు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ తరహా బహుముఖ పోటీలు జరిగే ఎన్నికల్లో ఎఫ్‌పీటీపీ పద్ధతి పర్యవసానంగా ఓట్లలో ప్రథమ స్థానంలో నిలిచిన పార్టీకే ఓట్ల నిష్పత్తి కన్నా చాలా ఎక్కువగా సీట్లు దక్కుతాయని బ్రిటిష్ కామన్స్ సభ తాజా ఎన్నికల్లో మరోసారి రుజువైంది. విజేతకే అత్యధిక స్థానాలు (విన్నర్-టేక్-ఆల్ పద్ధతి) అనే విధంగా ‘గెలుపు గీతను మొదట తాకే గుర్రానికే విజయం’ చేకూర్చే విధానమే ఇలాంటి ఫలితాలకు దారితీస్తున్నది.
– నాంచారయ్య మెరుగుమాల