భారత్‌లో చీకటి రాజ్యానికి దారులుపరిచిన ఎమర్జెన్సీ ప్రకటనకు ఈ జూన్ 25తో 50 ఏండ్లు నిండనున్నాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన తొమ్మిదేండ్ల పాలన (1966-75) తర్వాత దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 19 నెలల అత్యయిక స్థితిలో ప్రజాస్వామ్యానికి జరిగిన కీడు, జనంపై జులుం ఫలితంగా దేశ ప్రజలు పదకొండేండ్ల ఇందిరమ్మ పాలనకు 1977 మార్చి ఎన్నికల్లో ముగింపు పలికారు. ప్రస్తుత బీజేపీ ప్రధాని మోదీ పాలనకు కిందటి నెలలో 11 ఏండ్లు నిండాయి. ఐదు దశాబ్దాల క్రితం ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనపై ఉన్నంత తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు దేశంలో కనిపించకపోయినా మోదీ అన్ని రంగాల్లో తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఎమర్జెన్సీ విధించకుండానే అనేక ఆంక్షలు, ‘చట్టబద్ధ చర్యల’ ద్వారా మోదీ కూడా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రక్రియలను కొనసాగిస్తున్నారు. ‘అప్రకటిత ఎమర్జెన్సీ’తో ప్రతిపక్షాలను, రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
తొలి ప్రధాని నెహ్రూ కాలం నుంచి ఆయన కూతురు హయాం వరకు దేశభక్తిని సొంత ఆస్తిగా, బలమైన ఆయుధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మార్చుకున్నాయి. ఇప్పుడు దేశభక్తికి, ‘హిందూ జాతీయవాదాని’కి ఏకైక హక్కుదారుగా వ్యవహరించే కాషాయపక్షం బీజేపీ కూడా ‘దేశ సమగ్రతను, జాతీయ ప్రయోజనాలను కాపాడే ఏకైక రాజకీయపక్షంగా మాట్లాడుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1947 ఆగస్టు 15న నెహ్రూ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఆయన కుమార్తె ఇందిర హయాం తొలి తొమ్మిదేండ్ల కాలం వరకూ చూస్తే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన 1975 దాకా దాదాపు 28 ఏండ్లపాటు సాగింది.
ఈ మూడు దశాబ్దాల్లో ప్రధానంగా ఇందిర మొదటి తొమ్మిదేండ్ల పాలనలోని వైఫల్యాలు, మరీ ముఖ్యంగా 1971 నుంచి సాగిన ఏకపక్ష నియంతృత్వ పాలన భారత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి దారితీసింది. జనంలో అప్పటిదాకా గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలయ్యే స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో 1971లో యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఇందిరమ్మ ఎన్నిక చెల్లదని 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమెను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ తీర్పుపై ప్రధాని వేసిన అప్పీలును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వెకేషన్ జడ్జీ వీఆర్ కృష్ణయ్యర్ దాని అమలుపై స్టే విధించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థశంకర్ రే వంటి న్యాయ నిపుణులు, సన్నిహితుల సలహాతో దేశంలో ఆమె ఎమర్జెన్సీ విధించారు.
కాంగ్రెస్ కేంద్ర క్యాబినెట్ పంపిన ఎమర్జెన్సీ విధింపు తీర్మానంపై 1975 జూన్ 25 అర్ధరాత్రి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకం పెట్టే సమయానికే దేశంలో లక్ష మందికి పైగా విపక్ష నేతలను కాంగ్రెస్ ప్రభుత్వాలు జైళ్లలోకి పంపించేశాయి. పత్రికల గొంతు నులిమే ప్రెస్ సెన్సార్షిప్ నిబంధనలు కఠినంగా అమలు చేశాయి.
‘ఇందిరమ్మ రాజ్యం’ అంటూ ప్రచారం చేసుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను ఉసిగొల్పడం, రైతుల చేతులకు బేడీలు వేయడం, కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకు పేద రైతుల భూములు లాక్కోవడం, ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం వంటి పోకడలకు పోతూ ఎమర్జెన్సీని తలపిస్తున్నది.
1967 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. 1969లో కాంగ్రెస్ చీలిక తర్వాత జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి పేదల అనుకూల ప్రగతిశీల చర్యలతో మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ 1971 ముందస్తు సాధారణ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఆ ఏడాది చివర్లో వచ్చిన బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత సేనల ఘనవిజయం ఇందిరమ్మ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తిచేసింది. ఈ గెలుపుతో 1972 ఆరంభంలో ఏపీ సహా పలు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాలు సాధించింది. ఆ తర్వాత ఇందిర పతనానికి నాంది పలికింది.
రాయ్‌బరేలీ నుంచి పార్లమెంటుకు ఇందిర ఎన్నికపై అలహాబాద్ హైకోర్టు తీర్పు నాటి ప్రధానిని ఎమర్జెన్సీ వైపునకు నడిపించింది. అయితే, మార్చి 24న పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని అప్పటి ప్రధాని ప్రకటించి దేశ ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు. ఎమర్జెన్సీ కారణంగా సర్వశక్తులూ కోల్పోయిన ఐబీ వంటి ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చిన తప్పుడు సమాచారం కూడా ఎన్నికల ప్రకటనకు కారణమని చెబుతారు. అయితే, ఎమర్జెన్సీ ప్రకటించాక పాశ్చాత్య దేశాల్లో నెహ్రూ కూతురిగా తన ఇమేజ్‌కు అంటిన మరకలతో ఆమె భయపడటం కూడా ఎన్నికల ప్రకటనకు ప్రధాన కారణమని ఆమె సన్నిహితులు కొందరు అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ దాష్టీకాల అనంతరం జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారి పరాజయం పాలైంది. ఇందిర సైతం రాయ్‌బరేలీలో ఓడిపోవడం విశేషం. తొలిసారి అమేఠీ నుంచి పోటీచేసిన ఆమె చిన్న కొడుకు సంజయ్‌గాంధీ కూడా పరాజయం పాలయ్యారు.
‘దేశంలోని ప్రతి సంస్థను కుదేలుచేసి, భయోత్పాతం సృష్టించే వాతావరణం రాజ్యమేలిన చీకటి రోజుల కాలంగా అత్యవసర పరిస్థితిని భారత ప్రజలు గుర్తుంచుకుంటారు’ అని ప్రధాని అయ్యాక ఎమర్జెన్సీ 43వ వార్షికోత్సవం సందర్భంగా 2018 జూన్ 26న మోదీ ట్విటర్లో స్పందించారు. అయితే, మోదీ సైతం ఆమె నియంతృత్వ పోకడలనే అనుసరిస్తూ చెడ్డపేరు మూటగట్టుకుంటున్నారు.
ఆపరేషన్ సిందూర్‌పై ప్రజాస్వామిక పద్ధతిలో వ్యాఖ్యానించిన అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మూదాబాద్ వంటి పలువురు మేధావులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుపాల్జేసే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వాలు చేశాయి. అసలు అత్యయిక స్థితి పెట్టకుండానే ఎమర్జెన్సీ నాటి దమననీతిని బీజేపీ పాలకులు అమలు చేస్తున్నారు. ఏటా ఎమర్జెన్సీ అకృత్యాలు, దారుణాలు గుర్తుచేస్తూ జూన్ చివరి వారంలో దేశ ప్రజలకు సందేశాలు పంపించే మోదీ జాతీయ, ప్రాంతీయపక్షాలని చూడకుండా అన్ని పార్టీల రాష్ట్ర సర్కార్లను వేధించే విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలపై శాంతియుత పోరాటం చేసే ప్రతిపక్షాల హక్కులను మోదీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు హరిస్తున్నారు. ఎలాంటి సెన్సార్షిప్ నిబంధనలు లేకుండానే టీవీ, పత్రికలు, డిజిటల్ మీడియా బీజేపీ సర్కారుకు అనుకులంగా వార్తలను వండి వార్చుతున్నాయనే భావన ప్రజల్లో బలపడుతున్నది.
1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చాక నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనపై పూర్తి ఆధిపత్యం సంపాదించాయి. దేశభక్తి ఉన్న ఎవరైనా కాంగ్రెస్ సర్కార్లకు మద్దతు పలకాల్సిందేననే తీరులో కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు. 1957 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ప్రధాని నెహ్రూ, కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన కూతురు ఇందిరాగాంధీ కలిసి మత, కులతత్వ శక్తుల సాయంతో కూలదోసే వరకూ నిద్రపోలేదు. దేశవ్యాప్తంగా అన్ని పాలనా వ్యవస్థలనూ కాంగ్రెస్ అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్‌ను సైతం తమ చెప్పుచేతుల్లో నడుచుకునేలా వ్యవహరించారు. ఇందిర, ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ హస్తినలో అధికారంలో ఉండగా తమను వ్యతిరేకించిన ప్రతిపక్షాలను దేశద్రోహులుగా, జాతి ప్రయోజనాలు కోరుకోని స్వార్థపరులుగా చిత్రీకరించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల అవలక్షణాలు, పోకడలు ఇప్పుడు మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారులో కనిపిస్తున్నాయి. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యమేలుతున్నది. దేశం చీకటి రాజ్యం దిశగా పయనిస్తున్నది.
భారత రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇందిర ఉక్కు పిడికిలిలో బందీ కావడానికి దోహదం చేసిన నాటి ఎమర్జెన్సీ, తదనంతర ఎన్నికల ఓటమి నుంచి కాంగ్రెస్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదనే చెప్పాలి.
నేడు దేశంలో మూడు రాష్ర్టాల్లో మాత్రమే అధికారంలో ఉన్న హస్తం పార్టీ వాటిని కాపాడుకునే పరిస్థితిలో లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని విస్మరిస్తూ, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాసే నాటి ఇందిర పాలనను ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుచేస్తూనే ఉన్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే.
ఇచ్చిన హామీలను, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి అక్రమ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఆఖరికి రైతన్ననూ సంకెళ్లతో బంధిస్తూ, నాటి ఇందిర పాలనకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నది. ఎమర్జెన్సీకి 50 ఏండ్లు నిండుతున్న ఈ సందర్భంలోనైనా తన తీరును మార్చుకోకపోతే, ఇందిర ప్రభుత్వానికి పట్టిన గతే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు పట్టడం ఖాయం.
– నాంచారయ్య మెరుగుమాల