అందాల పోటీలు అభాసుపాలయ్యాయి. బండారం బద్దలై బజారుకెక్కింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలతో అంతర్జాతీయ మీడియాలో పోటీలకు వ్యతిరేకంగా కథనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ ప్రతిష్ట పెరగడం సంగతి దేవుడెరుగు, మొత్తంగా పోటీల అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతున్నది. తెలంగాణకు నిధుల వరద వచ్చిపడటం ఏమో కానీ, తెరలేవక ముందే హైదరాబాద్ పరువు మూసీలో కలిసిపోయింది. సంపన్న ప్రాయోజకులకు ‘వినోదం’ కలిగించాలని ఒత్తిడి తెచ్చిన నిర్వాహకుల నిర్వాకం వల్ల వెగటు పుట్టి తనకు ‘వేశ్యరిక భావన’ కలిగిందని ఆమె చెప్పడం గమనార్హం.
‘అందం చూడవయా ఆనందించవయా’ అంటూ దాతలకు వినోదం కలిగించడం పోటీల్లో ఓ ఐటెమ్ ఎలా అవుతుంది? అతిథులతో ‘మింగిల్’ కావాలని ఓ ఐఏఎస్ అధికారి చెప్పడం, అదీ ఓ మహిళా మంత్రి సమక్షంలో చెప్పడం ఈ రసాభాసకు పరాకాష్ఠ, వారిని ‘ప్లీజ్’ చేయాలని చెప్పడం ఏ సంస్కృతి? ‘ఓ ఆశయంతో అందం’ అంటూ ఉదాత్తమైన నినాదం ముందు పెట్టుకొని ఈ చౌకబారు ప్రదర్శనలు ఏమిటి? పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంగతులన్నీ తెలుసా? తెలిసే అనుమతించారా? షెడ్యూల్లో లేని ఇలాంటి కార్యక్రమాలు పోటీల స్థాయిని దిగజార్చాయి.
తెలంగాణ ‘తెహజీబ్’ గాయపడింది. ఆడబిడ్డలను అపురూపంగా గౌరవించుకునే ఈ గడ్డ మీద జరగరాని పనులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణుల కాళ్లు మన ఆడపడుచులతో కడిగించిన ఉదంతాన్ని మరువక ముందే ఈ వివాదం తలెత్తింది. అసలు అందాల పోటీల భావనే మనకు సరిపడదని మహిళా సంఘాలు ముక్తకంఠంతో ఘోషించాయి. దేశం పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిస్థితులతో, రాష్ట్రం అకాలవర్షాలతో అతలాకుతలమై ఉన్న తరుణంలో అందాల పోటీలు నప్పవేమోనని విజ్ఞులూ చెప్పిచూశారు.
కానీ, ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ ప్రతిష్ఠ పెరుగుతుందని, పెట్టుబడులు వరదలా వస్తాయని చెప్పుకొచ్చింది. పోటీల నిర్వహణ అంశం మిస్ వరల్డ్ కమిటీ చేతుల్లోనే ఉండి ఉండవచ్చు. కానీ, అంతిమ జవాబుదారీ ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పక తప్పదు. మిస్ ఇంగ్లండ్ చేసిన సంచలన ఆరోపణలకు సంబంధించి కఠిన చర్యలు చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏమీ జరుగలేదన్నట్టుగా బుకాయించ జూస్తున్నది. తూతూమంత్రం దర్యాప్తులతో కాలక్షేపం చేస్తున్నది. గోప్యత పాటిస్తూ తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నది.
విరాళాల మీది ఆశతో స్పాన్సర్లకు గేట్లు ఎత్తడం అసలు సమస్య. అందాల పోటీల కంటెస్టెంట్లను వారి మధ్య ఆటబొమ్మల్లా తిప్పడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. పోటీల నుంచి తప్పుకొని స్వదేశం వెళ్లిపోయిన మిస్ ఇంగ్లండ్ ఆరోపణలతో ప్రపంచ దేశాల్లో తెలంగాణ ఇజ్జత్ మసకబారింది. ఇదీ మిస్ వరల్డ్ పోటీల పేరిట హైదరాబాద్కు పట్టించిన దుర్గతి. మిస్ వరల్డ్ తెలంగాణకు తెచ్చి ఏదో ఒరగబెట్టామని చంకలు గుద్దుకుంటున్నవారు సాధించి పెట్టిన ఘనత. ముందూవెనుకా చూసుకోకుండా అందాల పోటీల కోసం అర్రులు చాచిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రతిష్టకు తెచ్చిన మాయని మచ్చ. అసమర్థ పాలకులు ‘చార్ సౌ సాల్ షహర్’కు తెచ్చిన చారిత్రక తలవంపు.