వర్షం కురుస్తున్న సాయంత్రం, వెన్నెల కాస్తున్న రాత్రి, డిసెంబర్ చలిలో ఉదయిస్తున్న సూర్యుడు ఎంత అందంగా ఉంటాయో చెప్పనలవి కాదు. ఈ మూడు ఆనందాలూ కలిపి ఇచ్చే ఆనందం కన్నా పెద్దది… ‘అబ్బా! ఎంత చక్కటి పోయెమ్ రాసేవు, కవీ!’ అన్న మాట. అలాంటి ఆనందాలు కవులు అప్పుడప్పుడు పొందుతుంటారు. ఈ మధ్య ఆ మాటకు తోడుగా ‘నీ కవిత చాలా బాగుంది. 22 భాషల్లోకి అనువాదం చేయిస్తున్నాం. అన్ని రేడియో కేంద్రాల నుంచి ప్రసారం చేస్తాం’ అన్న మాట విన్నాను. ఇంకేముంది వాన చినుకుల మధ్య వెన్నెల చెదిరిపోకుండానే సూర్యోదయాన్ని చూస్తున్నట్టు అనిపించింది నాకు.
Indra Dhanussu | అవును! ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవధానుల శ్రీహరి ఫోన్ చేసి ‘మీ కవిత ‘ఇంద్రధనుస్సులు’ను ఈ సంవత్సరం జాతీయ కవి సమ్మేళనానికి తెలుగు కవితగా ఎంపిక చేశా’మన్నారు. మీరు 20వ తేదీ ముంబైకి వెళ్లి అక్కడ బహుభాషా కవి సమ్మేళనంలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. వారు చెప్పిన విధంగా నేను 2024, డిసెంబర్ 20న జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు కవిగా పాల్గొన్నాను. ఆకాశవాణి ముంబై కేంద్రం వాళ్లు ఒక చక్కటి హోటల్లో బస ఏర్పాటు చేసి నవీ ముంబై లోని సాహిత్య మందిర్ సభాగృహలో బహుభాషా కవి సమ్మేళనం జరిపించారు. ఒక రోజు ముందు రిహార్సల్, మరుసటి రోజు కవి సమ్మేళనం, తర్వాతి రోజు తిరుగు ప్రయాణంతో మూడు రోజులు ముంబైలో ఇతర భాషల కవి మిత్రులతో కలిసి తిరిగిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
నా రూమ్మేట్గా ఉన్న సుప్రసిద్ధ నేపాలీ కవి దల్సింగ్ అకేలా వయసులో పెద్దవాడైనా నన్ను ఎంతో స్నేహంగా పలకరించి నా కవిత్వం గురించి, ఇతర రచనల గురించి ఆరా తీశాడు. ఇంకా మణిపురి కవి టాంగ్బ్రం అమర్జిత్, కన్నడ కవి నిజలింగప్ప మట్టెహాల్, సంస్కృత కవి యువరాజ్ భట్టారాయ్ తదితర తెలుగేతర కవి మిత్రులతో ఒక గొప్ప స్నేహ పూర్వకమైన సంభాషణ కొనసాగింది. 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం ప్రారంభమైంది.
అక్కడ వింత ఏమిటంటే చాలా భాషల కవితలు బొంబాయి స్థానిక శ్రోతలకు ఏ మాత్రం అర్థమయ్యే అవకాశం లేదన్న సంగతి మాకు తెలుసు. అయినా మేం గొప్ప ఉద్వేగంతోనే మా కవితలు చదివాం. నాకు బాగా గుర్తుంది… తమిళ కవి భారతన్, మలయాళ కవి మాధవన్ పురుచ్చేరి, అస్సామీ కవి రాజీవ్ బారువతో పాటు నేను చదివిన ‘ఇంద్రధనుస్సులు’ కవిత కూడా అక్కడి ఆడియన్స్కి ఒక్క ముక్క కూడా అర్థమయ్యే అవకాశం లేదు. అయినా అత్యంత ఆసక్తికరంగా చదివాం. ఇద్దరు హిందీ కవులు, ఇతర భాషా కవులు అంతా చదివాక హిందీకి కొద్దిగా సంబంధం ఉండే కవుల కవితలు అర్థం అయీ, కానట్టుగా కొందరికి అర్థమయ్యాయి. ఈ జాబితాలోకి మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, కశ్మీరీ, మైథిలీ, సింధీ, సంతాలీ భాషలు వస్తాయి. హిందీకి అసలే సంబంధంలేనివైన దక్షణాది భాషల కవులు ఒరిజినల్ కవిత చదువుతున్నప్పుడు మధ్యలో ఎలాంటి చప్పట్లు మోగవు కానీ, కవిత పూర్తయిన తర్వాత ఏదో ఒక భావోద్వేగాన్ని అందిపుచ్చుకున్న వాళ్లలాగా ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారు.
ఒక ‘మూల కవిత’ చదివాక వెనువెంటనే హిందీలో దాని అనువాదం చదివినప్పుడు చాలా స్పందన వచ్చింది. మధ్యలో చప్పట్లు మోగాయి. నా తెలుగు కవిత హిందీలో ‘ఇంద్రధనుష్’ పేరు మీద డాక్టర్ అలోక్ రంజన్ పాండే చదివినప్పుడు కూడా మధ్యలో చప్పట్లు మోగాయి. దాదాపు ఈ కవితల సారాంశంలో కేంద్ర బిందువు-మానవ సంబంధాలు, దేశభక్తి, స్త్రీల సాధికారత అని నాకు అర్థమైంది. అప్పుడు నాకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సాహిత్య అకాడమీని ప్రారంభిస్తూ చెప్పిన మాట ‘Indian literature is one though written in many languages and scripts’ గుర్తొచ్చింది. సభా కార్యక్రమంలో భాగంగా సత్కారం, ధ్రువీకరణ పత్రాల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథి ముంబై విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ కరుణాకర్ ఉపాధ్యాయ్ స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇస్తూ… ‘కళలన్నింటిలోనూ కవిత్వ సృజన ప్రధాన కళ’ అని ఆనందవర్ధనుడు అన్న మాటను గుర్తుచేశారు. సభ పూర్తయిన తర్వాత అందరూ భిన్న భిన్న యాసలలో హిందీని, ఇంగ్లీషును మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పంచుకోవడం చూస్తే భారతదేశం ఒక భిన్న భాషలనే పూలమొక్కల తోట అనిపించింది.
హోటల్ నుంచి కవి సమ్మేళన ఆడిటోరియంకు ప్రయాణించే బస్సులో కొందరికి సీట్లు దొరికాయి. కొందరు నిలబడి ప్రయాణించారు. ఈ క్రమంలో నేను రెండవ సీట్లో కూర్చొని నా కవితను ఒక ట్రాన్స్ఫరెంట్ ఫోల్డర్లో పెట్టుకున్నాను. నా సీటుకు పక్కగా నిలుచున్న కొంకణి కవయిత్రి రాజశ్రీ సాయిల్ ట్రాన్స్ఫరెంట్ ఫోల్డర్ నుంచి కనిపిస్తున్న నా తెలుగు కవిత శీర్షికను గమనించి ‘Is it Indra dhanush?’ అని అడిగింది. ‘yes, how did you recognise?’ అన్నాను నేను. దానికి ఆమె ‘నాకు కొంచెం కన్నడం వచ్చు. ఇది కన్నడం లాగే ఉంది కదా!’ అన్నది. అప్పుడు నాకు చాలా ఆనందం వేసి, ‘అవును కన్నడ, తెలుగు లిపి ఏకీకరణ ప్రతిపాదన కూడా ఉన్నద’న్న సంగతి చెప్పాను. ఆమె అది తెలియదన్నట్టు ఆశ్చర్యపోయింది. ‘ఇంద్రధనుస్సులు’ కవిత కాన్సెప్ట్ కూడా అడిగింది. అది స్త్రీకి ఒక సంకేత రూపంగా పెట్టానని చెప్పాను. దానికి ఆమె చాలా సంతోషించింది.
ఆ రోజు సాయంకాలం ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన తెలుగేతర కవి మిత్రులతో ఆయా భాషల సాహిత్య చరిత్రల వివరాల గురించి నేను కొంత ఆరా తీశాను. కొంతమంది చెప్పిన వివరాలను బట్టి చాలా భాషలు తెలుగంత పురాతన చరిత్ర కలిగినవి కావని కూడా నాకు అర్థమైంది. కొంతమంది సాహిత్య చరిత్ర పట్ల అంత స్పష్టత లేనివారు కూడా ఉన్నట్టు అనిపించింది. నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక్క అంశమేమిటంటే తెలుగు పద్యంలో ఉన్నంత వైవిధ్య భరితమైన ఛందస్సేదీ ఇతర భాషల్లో లేదనిపించింది. నేను వారికి కొంత చెప్పడానికి ప్రయత్నం చేశాను. తెలుగులో పలురకాల పద్యాలున్నాయని, ప్రాచీన సాహిత్యం అంతా కూడా ఆ పద్యాల్లోనే రాయబడిందని, దాని ప్రకారం ఎక్కడ పొట్టి అక్షరం, ఎక్కడ పొడుగు అక్షరం రావాలో కచ్చితంగా పాటించవలసి ఉంటుందని చెప్తే వాళ్లు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఒడియా వాళ్లకు అంత కఠినమైన ఛందస్సు ఏదీ లేదని వాళ్లు స్పష్టంగానే చెప్పారు.
జాతీయ కవి సమ్మేళనం స్ఫూర్తితో హైదరాబాద్లో అడుగు పెట్టాక నా కవితలాగే అన్ని భాషల కవితలను తిరిగి తెలుగులోకి అనువాదం చేయించే బాధ్యత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తీసుకున్నది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంలో దేశంలోని ఇతర 22 భాషల్లోని ఎంపిక చేసిన జాతీయ కవితలను తెలుగులోకి అనువదింపజేశారు.
ఆ అనువాదకులతో కలిపి మూలకవిగా నేను కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 2025, జనవరి 17న ఇక్కడి కవి సమ్మేళనంలో పాల్గొన్నాను. ఇక్కడ ఆనందం కలిగించే విషయం ఏమంటే తెలుగులో అత్యంత సుప్రసిద్ధ కవుల చేతనే ఇతర భాషా కవితలను అనువదించారు. ఆ రకంగా కొలకలూరి ఇనాక్ లాంటి అత్యంత సీనియర్ రచయిత నుంచి నా దాకా 24 కవితలతో కవి సమ్మేళనం నిర్వహించబడింది, రికార్డు చేయబడింది. మంచి జ్ఞాపిక కూడా ఇచ్చారు. ఇవే కవితలు 25వ తేదీ సాయంత్రం ప్రసారమయ్యాయి.
ఈ కార్యక్రమంలో నిజమైన ఇంకొకసారి లభించని జ్ఞాపిక ఏమిటంటే… కొలకలూరి ఇనాక్, అమ్మంగి వేణుగోపాల్, నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, దర్భాశయనం శ్రీనివాసాచార్య, శిఖామణి, మహెజబీన్, చిల్లర భవానీదేవి, మామిడి హరికృష్ణ, ఐనంపూడి శ్రీలక్ష్మి, శిలాలోలిత, యాకూబ్, జింబో, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మందలపర్తి కిషోర్, ఆర్.అనంతపద్మనాభరావు, సమ్మెట నాగమల్లేశ్వరరావు, తాడేపల్లి పతంజలి, వై.ముకుంద రామారావు, శరత్ జోత్స్నారాణి, సుమనస్పతి నేనూ ఒకే ఫొటోలో ఒదగడం; నిర్వాహకులు శ్రీహరితో సహా. కాలం గడుస్తున్నకొద్దీ ఇది మరింత విలువైన తీపి జ్ఞాపికగా మారుతుంది.
-ఏనుగు నరసింహారెడ్డి
89788 69183