అగ్రరాజ్యంలో మరోమారు భారతీయం సగర్వంగా రెపరెపలాడింది. రిపబ్లికన్ ఝంఝామారుతాన్ని తట్టుకొని అమెరికాలో ఉదారవాదం ముందుకువచ్చింది. జాత్యహంకార హుంకరింపులను, వర్ణ వివక్షలను అధిగమించి ఆసియా, ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరులు ప్రతిష్ఠాత్మక స్థానిక ఎన్నికల్లో ఓటర్ల హృదయాలను చూరగొనడం అపూర్వం, అద్వితీయం. న్యూయార్క్, వర్జీనియా, న్యూజెర్సీల్లో భారత సంతతి అభ్యర్థులు వివిధ కీలక పదవులను గెలుచుకొని చరిత్రను సృష్టించారు. న్యూయార్క్ మహానగర మేయర్ పదవికి హోరాహోరీగా జరిగిన పోరులో భారతీయ సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ అద్వితీయ విజయం సాధించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి మన హైదరాబాద్ మహా నగరంలో జన్మించిన గజాలా హష్మీ ఎన్నికయ్యారు. సిన్ సినాటీ మేయర్ పదవికి ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి ఎన్నికై రికార్డు సాధించారు. అందులోనూ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు కోరీ బౌమాన్ను ఆయన చిత్తుగా ఓడించడం మరో విశేషం. వీరందరూ డెమొక్రాట్ అభ్యర్థులు కావడం ఇంకో విశేషం. అమెరికా స్థానిక ఎన్నికల్లో ఈసారి భారత సంతతి పౌరులు పెద్ద సంఖ్యలో పోటీ చేసి తమ ఉనికిని చాటుకున్నారు.
ఈ విజయ పరంపరలో న్యూయార్క్ ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచ మహా నగరాల్లో అగ్రస్థానంలో నిలిచే న్యూయార్క్ మేయర్ పదవిని భారత సంతతికి చెందిన ఓ చిచ్చర పిడుగు చేజిక్కించుకోవడం మరో చరిత్రే. ఆ అద్వితీయ గౌరవాన్ని దక్కించుకున్నది ప్రముఖ భారతీయ చిత్రదర్శకురాలు మీరా నాయర్ కుమారుడైన జోహ్రాన్ మమ్దానీ కావడం మనకు గర్వకారణం. ఆఫ్రికాలో జన్మించిన భారత సంతతి తొలి మేయర్గా మమ్దానీ రికార్డు సొంతం చేసుకున్నారు. దేశాధ్యక్షుడే వ్యతిరేక ప్రచారం చేసినా అతడు ధిక్కరించి నిలిచారు, గెలిచారు. మాజీ గవర్నర్ ఆండ్రూ కూమో, రిపబ్లికన్ కర్టిస్ స్లీవాలను మట్టి కరిపించారు. బహుళజాతులతో కూడిన సుమారు 90 లక్షల జనాభా, 254 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో కూడిన న్యూయార్క్ నగర మేయర్ పదవి అమెరికా రాజకీయాల్లో కీలక స్థానం ఆక్రమిస్తుంది. ఆ నగర మేయర్లు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటా రు. అలాంటి కీలక పదవిని దక్కించుకునేందుకు మమ్దానీ విలక్షణ పోరాటాన్ని వీరోచితంగా నడిపారు. డెమొక్రాటిక్ సోషలిజం తన సిద్ధాతం అని బాహాటంగా చాటుకున్న మమ్దానీ దేశానికి కుబేరులు అవసరం లేదని ఢంకా బజాయించి మరీ చెప్పడం విశేషం. దాంతో సంపన్నులు వందల వేల కోట్ల డబ్బు గుమ్మరించి అతడిని ఓడించాలని చూశారు. కొందరు కార్పొరేట్లు నామమాత్రంగా మద్దతు తెలిపినా ఎన్నికల నిధులు మాత్రం విదల్చకపోవడం గమనార్హం. పేదల కొద్దిపాటి చందాలతో పోటీచేసి పెద్దలకు చుక్కలు చూపించారు మమ్దానీ.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం) వంటి జాతీయవాద నినాదాలతో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లో మమ్దానీని ఓడించేందుకు గట్టిగా కృషిచేశారు. ఈ 33 ఏండ్ల ‘కమ్యూనిస్టు’ను భారత్కు ‘తిప్పి పంపాలని’ హుంకరించారు. ఈ తరహా వివక్షాపూరిత ప్రచారాన్ని మమ్దానీ ప్రజా సంక్షేమ నినాదాలతో ఢీకొట్టారు. అమెరికా గొప్పదేశం కావాలంటే సామాన్యుల సమస్యలు నెరవేరడం తక్షణ అవసరమని సంక్షేమ హామీలతో సవాల్ విసిరారు. అణ్వస్ర్తాల కన్నా ప్రజలకు అన్నవస్ర్తాలు ముఖ్యమని చాటిచెప్పారు. కూడూ, గూడూ, గుడ్డా కావాలని దేశ నాయకత్వానికి గడ్డిపెట్టారు. శుష్క జాతీయవాద నినాదాలను ప్రజావాణితో ఎదుర్కొన్నారు. సంపన్న అమెరికాకు మరోసారి పేదల బాగోగులను గుర్తుచేసి గుణపాఠం చెప్పారు. ట్రంప్ విధానాలకు ఈ విజయ పరంపర చెంపపెట్టు లాంటిది. న్యూయార్క్ మామూలు నగరం కానట్టుగానే మమ్దానీది మామూలు విజయం కాదు. రిపబ్లికన్ ఉడుం పట్టులో బిగుసుకుపోయిన అమెరికాలో మారుతున్న ఆలోచనా ధోరణికి ఈ విజయాలు అద్దం పట్టాయి. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానాలపై నిరసనగా కూడా ఈ విజయాలను చూడాల్సి ఉంటుంది. న్యూయార్క్లో మమ్దానీ మోగించిన విజయఢంకా వాషింగ్టన్ దాకా ప్రతిధ్వనిస్తుందనడంలో సందేహం లేదు. మమ్దానీ తన విజయోత్సవ ప్రసంగంలో భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని ప్రస్తావించడం కొసమెరుపు.