మానవ సమాజ పరిణామంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటిగానో, సమాంతరంగానో సాగిన ఉద్యమాలన్నీ ముందడుగులే. కొన్ని ఉన్నత విలువల్ని ప్రతిష్ఠించినవే. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమానికీ, రాష్ర్టావతరణ అనంతర పరిస్థితికీ వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల అద్భుత ఫలితాలు సిద్ధించాయని చెప్పక తప్పదు.
‘నిజం దేవుడెరుగు
నీరు కోస్తానెరుగు
ఓ నీటి పారుదలా
నీ రస్తా కోస్తాకే
పల్లం ఒక నెపం మాత్రమే’.
‘పర్రె కాలువులేవీ చెరువు ఊటేదీ
మింటికి మంటికి ఏకధారగా కురుస్తున్న చీకటి’
‘ఫ్లోరిన్ ధాటికి రోగోలలా
వంకర్లు తిరిగిన నా అయ్య కాళ్ళు’
‘గండిపడ్డ చెరువు, ఒట్టిపోయిన పర్రె
పర్రెవారిన పంట పొలం కాలిన మోటర్
పెరిగిన కరెంటు బిల్లు, పడావుబడ్డ ఎవుసం’
అని ఉద్యమ సమయంలో కవులు నీళ్ల గురించి పరిపరివిధాలా పలువరించిన్రు. నీటి వనరుల మళ్ళింపు గురించి, చెరువుల విధ్వంసం గురించి, ఫ్లోరిన్ గురించి పడావుబడ్డ వ్యవసాయం గురించి వేదనతో రాసిండ్రు.
రాష్ర్టావతరణ తర్వాత ఈ సంక్షోభ నివారణకు ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలొచ్చినవి. మావూరి కుంటలు, ఈ ఏడెనిమిదేండ్లలో ఎన్నడూ ఎండిపోకపోవడం ఒక నిదర్శనం. అంతేకాక వరిపంట ద్విగుణీకృతం కావడం మరొక నిదర్శనం. తెలంగాణ భూములకు విలువపెరగడం కూడా నిదర్శనం అందుకే..
‘భూమి బ్లాంక్ చెక్కు
నీళ్ళు విలువను రాస్తయి
భూములు ఖాళీ తలెలు
పంచభక్ష పరమాన్నమిచ్చేది నీళ్ళు
సాటలో బట్ట శిశువులు భూములు
నొసట రాత రాసే బ్రహ్మ నీళ్లు..
నీళ్లో లేక కాదు/ నీతి లేక
బ్లాంక్ చెక్ నా తెలంగాణ…
బ్లాంక్ చెక్ మీద విలువ రాసే విధాత వచ్చిండు
భూముల నొసటిరాత రాసే బ్రహ్మ నేడొచ్చిండు’
అని తెలంగాణ ఆవిర్భావం సందర్భాన కేసీఆర్ను ఉద్దేశించి కవులు రాసిండ్రు. ఈ ఆకాంక్ష చాలావరకు నెరవేరిందనే చెప్పాలె.
‘సభలు మీవి సన్మానాలు మీవి
కీర్తికిరీటాలు మీవి
సాహిత్య సామ్రాజ్యం మీది’
‘కట్టిన కయితల్ని తరాజులు మింగినయ్
తరాజులు పట్టుకున్న చేతులెవరివి?’
అని తెలంగాణ సాహిత్యానికి జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ కవుల పట్ల చూపిన వివక్షను, విస్మరణను సాహిత్యం మీద కోసాంధ్ర ఆధిపత్యాన్ని ఉద్యమ సమయాన తెలంగాణ కవులు ప్రశ్నించిండ్రు. కే.శ్రీనివాస్, అంబటి సురేంద్రరాజు, నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ , ముదిగంటి సుజాతరెడ్డి, గుడిపాటి, బన్న అయిలయ్య, కాశీం, ఎన్.వేణుగోపాల్, బాల శ్రీనివాసమూర్తి, జగన్రెడ్డి, యాకూబ్ లాంటి ఎంతోమంది విమర్శకులు తెలంగాణ సాహిత్య విశ్వరూపాన్ని ఉద్యమ సమయంలో ప్రదర్శించిండ్రు. ఫలితంగా మత్తడి, పొక్కిలి, ముంగిలి, తెలంగాణ తోవలు, దస్త్రం, షబ్నవీస్, ముద్దెర, ఫాయిదా, ఇతివృత్తం, కిటికీ, ఇగురం, ఆవర్తనం, కొలిమి, ఇరుసు, గనుమ లాంటి ఎన్నో విమర్శనా గ్రంథాలు వెలువడ్డాయి.
ఈ కృషి రాష్ర్టావతరణ తర్వాత ప్రచురణ విషయంలో ద్విగుణీకృతమైంది. తెలంగాణ సాహిత్య అకాడమీ పక్షాన నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వందకు పైగా తెలంంగాణ గ్రంథాలు ప్రచురితమైనవి. బి.నరసింగరావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డిల ఆధ్వర్యంలో ‘తెలంగాణ ప్రచురణలు’ సంస్థ దాదాపు ముప్పయి విలువైన పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ అనేక సాహిత్య సదస్సులను, ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తెలంగాణ సాహిత్య విశిష్టతను ప్రపంచానికి చాటింది. జూలూరు గౌరీశంకర్ కాలంలో ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ను వెలువరించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో అనేక కవి సమ్మేళనాలు నిర్వహించి ‘మట్టిముద్ర’ లాంటి విలువైన సంకలనాలను ప్రచురించింది.
తెలుగు అకాడమీ ఈ కాలంలో కొన్ని మంచి పనులను చేసింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా దేశపతి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, కె.శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, కాలువ మల్లయ్య తదితరుల కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణ విశిష్ట సాహితీవేత్తల వంద మోనోగ్రాఫ్లను ప్రచురించింది. తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రను, తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్రను తెలిపే ‘ముంగిలి’ని, విద్యార్థుల పోటీ పరీక్షలకు ఉపయోగపడే అనేక గ్రంథాలను ప్రచురించింది. సురవరం ప్రతాపరెడ్డి సమగ్ర రచనల ప్రచురణలో భాగంగా కొన్ని గ్రంథాలను ప్రచురించింది. ఈ విషయంలో తెలుగు అకాడమీ చేయాల్సిన కృషి చాలా మిగిలే ఉంది.
‘మాటలకు రంగులద్దిన మాయలోడా
నీ కొంచెపు తనానికి
నా మాట మంచం పట్టింది గదరా’
‘బడిలో మా అమ్మ పలుకు లేదు
నీ భాషనేర్పి
పుట్టినచోటనే పరదేశిని చేశావు
నా మాటనే మాట్లాడితే
నాగరీకుడిని కాను’
‘నా ఏసాన్ని బాసని/ విలన్ల ఈపుల మీన
చిరునామా జేసినోల్లకు/ నా గడ్డ మీన ఏంపని’
‘రేడియోలో వాళ్ళే, పత్రికల్లో వాళ్ళే
మన బాస, మన యాస
ఉర్దు తుర్క ములాని ఎక్కిరించినారు’
అని తెలంగాణ భాషను అవహేళన చేయడాన్ని కవులు ఆగ్రహంతో, వేదనతో తిరస్కరించారు. పత్రికల్లో, పాఠ్య పుస్తకాల్లో, సినిమాల్లో కోస్తాంధ్ర భాషకు పట్టం గట్టి తెలంగాణ భాషను కనుమరుగయ్యే పరిస్థితిని పసిగట్టారు.
హాస్య, విలన్ పాత్రలకు తెలంగాణ భాషను పెట్టి అపహాస్యం చేసే స్థితిని తిరస్కరించారు. కవిత్వంలోనే కాక అనేక వ్యాసాల్లో నలిమెల భాస్కర్, నందిని సిధారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, కాలువ మల్లయ్య, ముదిగంటి సుజాతరెడ్డి, అన్నవరం దేవేందర్, నాలాంటి వాళ్ళు తెలంగాణ భాష విశిష్టతను చాటారు. గోరటి వెంకన్న, గూడ అంజయ్య లాంటి కవి గాయకులు పాటల్లో మన భాషను వాడి దానికి గౌరవ స్థానం ఇచ్చినారు. కేసీఆర్ తెలంగాణ భాషలోనే ఉపన్యాసాలిచ్చి ప్రజలను ఉద్యమోన్ముఖులను చేశారు. ఈ అన్నింటి ఫలితంగా, రాష్ర్టావతరణ ఫలితంగా తెలంగాణ భాషకు అన్నిరంగాల్లో గౌరవస్థానం రావడం జరిగింది. పత్రికల్లో వస్తుంది. కోస్తావాళ్ళు సినిమాల్లో కూడా గౌరవస్థానం ఇస్తున్నరు. ఫలితంగా తెలంగాణ వాళ్ళకు డైరెక్టర్లుగా, హీరోలుగా, రచయితలుగా, కవులుగా, గాయకులుగా, అవకాశాలు లభిస్తున్నవి. మన యువతకు ఉపాధి లభిస్తున్నది.
‘బొడ్రాయి పోశమ్మ, అమ్మ ముత్యాలమ్మ
బోనాల గంపల్ల బర్కతేమాయె’
అంటూ తెలంగాణ ఆచార వ్యవహారాలను, బతుకమ్మ, బోనాలు, దసరా లాంటి పండుగల ను, కట్టుబొట్టును కోస్తాంధ్రులు అవహేళన చేస్తూ వాటిని అంతర్థానం జేసే పరిస్థితిని కవు లు నాడు కనిపెట్టి, వాటి విశిష్టతను చాటుతూ కవితలల్లిండ్రు. ఇవ్వాళ అట్లా వాటిని అగౌరవపరిచే పరిస్థితి పోయి గౌరవించే స్థితి వచ్చింది. ఇవన్నీ తెలంగాణ ఉద్యమం వల్ల, తెలంగాణ అవతరణ వల్ల ఒనగూడిన ఫలితాలు ఎన్నో. ఇప్పుడు నేను తెలంగాణ వాడిని అని సగర్వంగా చెప్పుకొనే స్థితి వచ్చింది. ఇది చిన్న విజయమేమీ కాదు.
తెలంగాణ సాహితీవేత్తలకు దూరదూరంగా ఉన్న ‘రవీంద్రభారతి’ని తెలంగాణ సాహితీవేత్తల పరం జేసింది. సాంస్కృతిక శాఖ తెలంగాణ నాటకాలకు, సినిమాలకు, కళాకారులకు ప్రాచుర్యాన్ని కల్పించింది. ఈ కాలంలో అనేకమంది సూచనల మేరకు ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ‘తెలంగాణ సారస్వత పరిషత్’గా పేరు మార్చుకొని ఎల్లూరి శివారెడ్డి జుర్రు చెన్నయ్య గార్ల సారథ్యంలో ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. తెలంగాణ విశిష్టతను తెలిపే పుస్తకాలను ప్రచురించింది. తెలంగాణ సాహితీవేత్తలకు అవార్డులను ప్రదానం చేసింది.
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి