‘ఖర్మ ఎవ్వరినీ, ఎన్నటికీ వదిలిపెట్టదు. చేసిన పాపం ఊరికే పోదు. వడ్డీతో సహా కాలమే సమాధానం చెబుతుంది…’ అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ సిద్ధాంతి వచనాలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నది. వాట్సప్ స్టేటస్‌లో నిత్యం ఆ వీడియో కండ్లకు కనిపిస్తూనే ఉన్నది. అది ఎంతకూ ఆగడం లేదు. ఎందుకు ఈ వీడియోను జనాలు వ్యాప్తి చేస్తున్నారు? మనసుకు నచ్చిన వారంతా స్టేటస్ ఎందుకు పెడుతున్నారో? లోతుగా పరిశీలన చేస్తే దానికో అర్థం, పరమార్థం తప్పక కనిపిస్తున్నది.
ఆధునిక సమాజంలో మంచి కంటే చెడుకే ఆకర్షింపబడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తారు. బుద్ధిగా జీవించడమన్నది అంత సులభంగా అలవాటు కాదు. ఎడా పెడా ఇష్టమొచ్చినట్లుగా తింటూ, తాగుతూ బతుకడం అంటే ఎవ్వరికైనా సులువైన పని. అలాంటి మర్మమే కర్మ సిద్ధాంతం వెనుక దాగి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పాలకుల తీరులో, ప్రజల సమూహంలో వివిధ వ్యక్తుల నడవడికలో ఈ తతంగం లోతుగా దాచి పెట్టబడింది. తమ తప్పు బయటి ప్రపంచానికి తెలిస్తే ఎక్కడ దోషులమవుతామేమోనన్న భయం తో తప్పుడు పనులు చేసినోడు ఎన్నటికీ తన తప్పులను సరి చేసుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే కాలం గడుపుతుంటాడు. నిజాన్ని తొక్కిపెట్టి తప్పుకు అధికారాన్ని ఆపాదించి దండిస్తాడు. ఇదీ ఎక్కువకాలం మనుగడలో ఉండదు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. ముడితే కాలుతుంది, అవసరమైతే దహిస్తుంది. ఏనాటికైనా తప్పుడు పనులు చేసినోడు కాలం ముంగిట దోషిగా నిలబడాల్సిందే. తప్పుడు వ్యక్తుల తప్పుడు పనులు బట్టబయలు కావాల్సిందే. అందుకు ఎవ్వరూ అతీతులు కారు. ప్రస్తుతం చేతిలో ఉన్న దండనాధికారాన్ని, పెత్తనాన్ని ఉపయోగించి నోరు లేని జీవాలకు, కష్టజీవులకు, శ్రమకారులకు ఇబ్బందులు సృష్టించొచ్చు గాక… ఎండ్ ఆఫ్ ది డే నిజం నిలబడి గెలుస్తుంది. గెలిచినప్పుడు తప్పుడు వ్యక్తుల తీరు తేటతెల్లమవుతుంది.
ఈ తప్పుడు సిద్ధాంతం ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చిందంటే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న కొన్ని ఘటనలు అందుకు కారణంగా నిలుస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని జనాలు గద్దె దించారు. 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పదేండ్లు ప్రభుత్వాన్ని సగర్వంగా నడిపి, రాష్ర్టాన్ని దేశంలో మేటిగా నిలబెట్టినప్పటికీ ఫలితం మాత్రం వేరే మాదిరిగా వచ్చింది. అదంతా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు. దానిని ఎవ్వరైనా శిరసావహించాల్సిందే. అయితే, గతంలో పరిపాలన కోసం తహతహలాడుతూ నోటికొచ్చిన వాగ్దానాలు చేసినవారు, కల్పిత హామీలతో ప్రజలను మభ్యపెట్టినవారు, అసత్య ప్రచారాలతో జనాలను గందరగోళంలో ముంచినవారంతా ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈసారి బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండానే పాలకులు చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. ఉదాహరణకు 2023లో గ్రూప్-2 పరీక్షల రద్దుకై భారీగా పోరాటాలు జరిగాయి. ఆనాడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్లాన్ వేసినవారికే అలాంటి ఘటనే చుట్టుముట్టి ఊపిరి తీసుకోకుండా చేసింది. చివరికి యువ పోరుకు తలొగ్గాల్సి వచ్చింది. డిసెంబర్ 7న సీఎంగా వచ్చి రుణాలు మాఫీ చేస్తా… టక్కున వెళ్లి రూ.2 లక్షలు పంట రుణాలు తీసుకోవాలంటూ ఏడాది కింద ప్రగల్భాలు పలికినవారంతా రైతులతో పాటే రుణపాశంలో ఇరుక్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకొని నోటికొచ్చింది రాసుకొని ప్రచారం చేసి నాటి పాలకులను ఇబ్బందిపెట్టిన వారికి ప్రస్తుతం అదే గతి పట్టుకున్నది. సోషల్ మీడియాలో ప్రస్తుత పాలకులకు ఎదురవుతున్న ముప్పు అంతా ఇంతా కాదు. కేవలం స్వల్ప కాలంలోనే తెలంగాణ సమాజం తిరగబడి ఎదిరిస్తున్నది. ప్రశ్నలను సంధిస్తున్నది. సమాధానాలు చెప్పలేక ప్రశ్నించిన గొంతుకలను పోలీసు కేసులతో పాలకులు నొక్కేస్తున్నరు. వ్యవసాయ క్షేత్రాలకు ‘ఫార్మ్‌హౌజ్’ అనే ఆంగ్ల పదజాలాన్ని వాడి ఒకరిద్దర్ని ఇబ్బందులకు గురిచేసినవారికి అచ్చంగా ఫార్మ్హౌజ్ల రూపేణా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఫార్మ్హౌజ్లు లేని వారెవరు? అన్న విషయం ఇప్పుడు బయటపడింది. చక్కగా వ్యవసాయం చేసుకునే క్షేత్రానికి, జల్సాలు చేసుకునే ఫార్మ్హౌజ్లకు లింకులు పెట్టి విషాన్ని చిమ్మిన వారికి అబద్ధమే అడ్డం తిరిగి వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తుండటం మనమంతా చూస్తున్నాం. ఇలాంటిదే ఇంకో వాస్తవాన్ని మనం గుర్తించాల్సి ఉన్నది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేరు చెప్తే కొన్ని వర్గాలకు గిట్టదు. కానీ, తెర వెనుక ఒవైసీ విద్యా దానం ఎంతటి గొప్పదో ఎవ్వరికీ తెలియకపోవడమే విచిత్రం. నిజానికి, అబద్ధానికి మధ్య వాస్తవం బతికే ఉంటుంది. ‘హైడ్రా’ పేరుతో కూల్చివేతల పర్వం కొనసాగుతున్న ఈ సమయంలో ఆ విద్యాసంస్థలు వెలుగుచూడటం విశేషం.
చెరువు ఆక్రమణ అన్నది పక్కనపెడితే విద్యావ్యాప్తికై జరుగుతున్న సామాజిక సేవను కూకటివేళ్లతో తీసి పారెయ్యలేని నిజమే. దేవుడున్నాడో లేడో దేవుడికే ఎరుక. కాకపోతే కాలమనేది చాలా పవర్ఫుల్. మనల్ని నిశితంగా గమనించే కాలచట్రంలో తప్పు చేసినోడు ఎన్నటికీ తప్పించుకుపోలేడు. తప్పొప్పులను గుర్తించి సరిచేసే తెలివితేటలు లేకపోతే వ్యవస్థకు తద్వారా సమాజానికి ఇబ్బంది దాపురిస్తుంది. అల్టిమేట్‌గా సామాన్యులు ఇబ్బంది పడతారు. వినకుండా, చూడకుండానే ప్రతీది నిజమని నమ్మేవారు ఉన్నంత కాలం… వినిపించినా, కనిపించినా అబద్ధాలనే నిజాలుగా నమ్మినవారు ఉంటే కలిగే నష్టం మాటల్లో చెప్పలేనిది. దాని మూల్యం వెలకట్టలేనిది. వ్యవస్థ కుప్పకూలేదాకా బయట పడనిది.