మాతృత్వంలోని మధురిమ సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకునేందుకు వీధికో ఫెర్టిలిటీ సెంటర్ వెలుస్తున్నది. ఆలస్యంగా పెండ్లిళ్లు కావడం, కాలుష్యం, జీవనశైలి ఇబ్బందులు, రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా సహజ పద్ధతిలో గర్భం దాల్చడంలో సమస్యలున్నవారికి ఐవీఎఫ్, ఐయూఐ వంటి ప్రక్రియల ద్వారా మాతృత్వ భాగ్యాన్ని కలిగిస్తారు. కచ్చితమైన లెక్కలు తెలుసుకోవడం సాధ్యం కానప్పటికీ ఈ మార్కెట్ విలువ ఒక అంచనా ప్రకారం రూ.6,000 కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల మధ్యన ఉంటుంది. ఈ ఫెర్టిలిటీ సెంటర్లలో ఇటీవలి కాలంలో సరొగసీ అనే మరో ప్రక్రియ వచ్చిచేరింది. దీనిని తెలుగులో ‘అద్దె గర్భం’ అంటున్నారు.
మాతృత్వాన్ని బూటకంగా మార్చేసేది సరొగసీ అయితే, ఫెర్టిలిటీ సెంటర్లు ధనాశతో ఏకంగా సరొగసీనే బూటకంగా మార్చేస్తున్నాయని ‘సృష్టి’ ఉదంతం తెలియజేస్తున్నది. ఈ వివాదాస్పద ఐవీఎఫ్ సెంటర్ అద్దె గర్భం సేవల పేరిట బోలెడు డబ్బు వసూలు చేసి ఎవరి బిడ్డనో కొనుక్కువచ్చి కట్టబెట్టింది. సొంత సంతానం మీది మోజుతో తల్లిదండ్రులు సరొగసీ సేవలను ఎంచుకోగా, పదే పదే బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో డీఎన్ఏ పరీక్షలు చేయించారు. దీంతో ఆ బిడ్డ తమ సంతానమే కాదని బండారం బయటపడింది. ఈ కేంద్రాలపై నియంత్రణలు, తనిఖీలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ ఉదంతం తెలియజేస్తున్నది.
మాతృత్వానికి మహోన్నతమైన స్థానమిచ్చే మన దేశంలో ‘అద్దె-గర్భం’ అనే రెండు మాటల కలయికే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వీటికోసం అనేకమంది విదేశాల నుంచి భారత్‌కు చాలామంది వస్తుండటంతో కృత్రిమ గర్భధారణ వ్యాపారం మూడు పువ్వు లూ ఆరు కాయలూ అన్నట్టుగా ఎదిగింది. గర్భాశయాన్ని రియల్ ఎస్టేట్ తరహాలో అద్దెకు ఇస్తుండటంతో మాతృత్వం మార్కెట్ సరుకైం ది. అదే సమయంలో అనేక సామాజిక సమస్యలు తలెత్తడంతో విదేశీయులకు సరొగసీ సేవలు అందించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. 2021లో తెచ్చిన చట్టం కేవలం స్వదేశీయులకు దీన్ని పరిమితం చేసింది. అదీ ధనాశ లేకుండా కేవలం సద్భావనతో చేయాలనే ఆదర్శాన్ని అందులో ఘనంగా ప్రకటించింది. అంటే ఖర్చులు మాత్రం ఇస్తారు.
గర్భానికి ఖరీదు కట్టి అద్దె చెల్లించడం ఉండదన్న మాట. సరొగసీ సేవలు ఇచ్చిపుచ్చుకునేవారి వయసు, అందుకు సంధానం చేసే ఫెర్టిలిటీ సెంటర్లలో అనుసరించాల్సిన పద్ధతులపై ఎన్నో నిబంధనలు అందులో ఉన్నాయి. కేం ద్రం చట్టమైతే తెచ్చింది కానీ, దాని అమలుపై అంతగా శ్రద్ధ చూపలేదు. దీని ఫలితమే తాజా గా సంచలనం సృష్టిస్తున్న నకిలీ సరొగసీ కేసు. ఈ నేపథ్యంలో ఫెర్టిలిటీ సెంటర్లలో జరుగుతు న్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఐవీఎఫ్ ప్రక్రియకు అవసరమైన అండాలు, వీర్యకణాలు లేని దంపతులకు వాటిని ఆయా కేంద్రాలు కొంత సొమ్ము తీసుకుని సరఫరా చేస్తాయి. వీటిని అధికారికంగా దాతల నుంచి కాకుండా పేదలు, నిస్సహాయ వర్గాల నుంచి సేకరిస్తున్నారు. ఐవీఎఫ్‌తో ఫలదీకరణం చెందిన పిండాన్ని గర్భంలో ప్రవేశపెట్టే ముందు పీజీటీ జన్యు పరీక్షలు జరుపుతున్నారో, లేదో తెలియదు. అసలు ఆ పరీక్ష ల్లో సిసలైన ఫలితాలు వస్తాయా, రావా అనేది మరో ప్రశ్న.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం మనది. మొన్నటిదాకా చైనా దక్కించుకున్న మొదటి స్థానం ఇటీవలే భారత్ సొం తం చేసుకున్నది. జన సంపదకు కొదవ లేని దేశంలో కృత్రిమ గర్భధారణతో పిల్లల్ని కన డం అవసరమా? అనే వాదనలుండనే ఉన్నా యి. నిజానికి అనాథల సమస్యకూ, వారసుల ఆకాంక్షకూ దత్తత అనే పరిష్కారమార్గం ఉం డనే ఉన్నది. అయితే ఆచరణాత్మకత, సెంటిమెంట్ చాలా సందర్భాల్లో పరస్పర విరుద్ధ దిశల్లో పోతాయనేది తెలిసిందే. రక్తం పంచుకుపుట్టిన బిడ్డనే కావాలంటే సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఈ పరిస్థితుల్లో ప్రామాణికమై న రీతిలో విధివిధానాలను మరింత కఠినంగా రూపొందించడం, వాటిని కచ్చితంగా అమలు చేయడం ఒక్కటే పరిష్కారం. అంతే తప్ప మాతృత్వాన్ని, సంతాన సౌభాగ్యాన్ని లాభసా టి వ్యాపారానికి బలిచేయడం ఎంతమాత్ర మూ సమర్థనీయం కాదు.