కాలాలు అనేకం.. ఎప్పటికీ ఒకటే కాలం ఉండదు.. కలికాలం. కరువు కాలం. కలవని కాలం. నిలువని కాలం. విభ్రమల కాలం. బేల చూపుల కాలం. భ్రమలు తొలిగిపోయిన కాలం. కదిలే కాలం. కదిలించే కాలం. అధిక్షేపించేకాలం. అన్వేషించే కాలం. పరిష్కారాలను వెతికే కాలం. అగో ఆ కాలమే ఇప్పుడొచ్చింది. చలో వరంగల్లు అంటున్నది. మోసపోయిన తనువుల వ్యథ యేందో మాట్లాడుకుందాం రా బిడ్డా అని పిలుస్తున్నది. వందలు.. వేలై..జనం జాతరై పోదాం. సంయమనంతో, సహృదయతతో బాపు చెప్పే ముచ్చట విని వద్దాం.
కాలమానం ఎట్లున్నా చలనశీలమే దాని ధర్మం. కాల గమనంలో ఆశలు.. ఆకాంక్షలు.. ఆశయాలు. హామీలను తనలో కలుపుకొని సాగిపోతుంది. కాలగతిలో సర్వం అంతర్థానమైపోయినా.. ఇచ్చిన మాట ఒక్కటే కాల గమనంలో బతికే ఉంటుంది. అట్లా కాల గమనంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్న మాటలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన కాలం వచ్చింది. ‘నేను తెలంగాణ ఉద్యమం కోసం వెళ్లటం నాకొక ప్రొవకేషన్. తెలంగాణ సాధించానన్న కీర్తే వెయ్యి జన్మల పుణ్యంగా భావిస్తున్నాను. సంపాదించుకున్న తెలంగాణను చక్కదిద్దుకునే అవకాశం కల్గడమనే భాగ్యం కన్నా నా జీవితానికి మరేం కావాలి. తెలంగాణ అభివృద్ధి జరగాలనే యావ తప్ప మరో ఆలోచన లేదు.’ అని 2014, జూన్ 10న తొలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా తొలి ముఖ్యమంత్రి హోదాలో మాట చెప్పిన కేసీఆర్ రైతు సంక్షేమం,సాంకేతిక అభివృద్ధిని జోడెద్దుల తీరు పరుగులు పెట్టించారు. ఆకుపచ్చ తెలంగాణను రైతు చేతిల పెట్టారు.
16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చి కాళేశ్వరం, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల, నాగార్జునసాగర్, సీతారామసాగర్, రంగనాయకుల సాగర్, కొండపోచమ్మ, గడ్డెన్నవాగు, చలివాగు, జూరాల మొత్తం 12 ప్రాజెక్టులను పండబెట్టింది. 32 రిజర్వాయర్లను ఎండబెట్టింది. సాగును సర్వనాశనం చేసింది. రైతు సాగుబడి మళ్లీ వెనుకటి రోజులకు వెళ్లిపోయింది. కరెంటు బిల్లు కట్టలేదని సూర్యాపేట జిల్లాలో స్టార్టర్లు పీక్కపోయిండ్రు.
డ్వాక్రా రుణం కట్టలేదని బ్యాంకోళ్లు జనగామ జిల్లా మహిళల ఇంటి గేట్లు ఎత్తుకు ఎళ్లిండ్రు. హైడ్రాను తెచ్చి ఇండ్లు కూలగొట్టింది. ఇన్ని దుర్మార్గాలను ఇంతకాలం మౌనంగా గంభీరంగా చూస్తూ భరించిన కేసీఆర్ ఈ సభ తర్వాత ఏం చేయబోతున్నారు? ఇంత పెద్ద సభ ఎందుకు? మూడున్నరేండ్ల దాక ఎన్నికల్లేవు. 10 లక్షల మందితో కేసీఆర్ జైత్రయా త్ర దేనికి సంకేతం? ఛాయ్ కొట్టు దగ్గర ఇద్దరు కలిస్తే వరంగల్ సభ ముచ్చటే. పల్లెలో నలుగురు కూడితే రజతోత్సవ జాతర సంభాషణలే.
హైదరాబాద్ ఐటీ ప్రాంగణంలో దమ్ముకొట్టడానికి జత కూడిన టెక్కీల మధ్య ఓరుగల్లు కబుర్లే. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సెర్చింగ్ పదం వరంగల్లు సభ. ఎందుకింత హైప్ వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెస్పమని చాట్ బాట్ ‘గ్రోక్ ఐ’ని గోకిన. గ్రోక్ చెప్పలేక నోరెళ్ల బెట్టింది. కానీ, మా సొంత జిల్లా (సూర్యాపేట) పెన్పహాడ్ మండలం రత్యా తాండా రైతు భూక్యా నారాయణ నోరు తెరిచిండు. “లేసిన, కూసున్న కేసీఆర్ అని మతిల తల్సుకుంట పంటలు పండించుకున్నం. లోళ్లు.. మిర్యాలగూడెం లోళ్లు పోతే బీట్లే (మార్కెట్లో) మొత్తం సీరియల్. అసుమంటి ఇయ్యాల పొలంల నుంచి ఇంట్లెకు తేవాలంటే బస్త సంచులతోటి మోయటానికి కూడా గతి లేకపోయింది”.తన అనుభవాన్నే ఆకాంక్షగా చెప్పిండు.
సకల జనుల సర్వే చేయించిన సీఎం కేసీఆర్, ఫలితాలు వచ్చిన తరువాత బడుగు, బలహీనవర్గాల రిజర్వేషన్ల మీద ఆలోచన చేశారు. తెలంగాణలో అగ్రకులాల సంఖ్య 15 శాతానికి లోపే ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 85 శాతం వరకు ఉన్నారని నిర్ధారించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం 50 శాతం పరిమితిని దాటి 69 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నదని, ఆ రిజర్వేషన్లను సపోర్టు చేసే యాక్ట్ నంబర్ 45/1994 కాపీ తమిళనాడు నుంచి తెప్పించి అధ్యయనం చేశారు. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన మన రాష్ట్రంలో కమిషన్ నియమించాలని ఆలోచన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలనుకున్నారు. కానీ అప్పటికి తెలంగాణ కేవలం రెండేండ్ల పసిగుడ్డు. ఇక్కడో సందర్భం గుర్తు చేయాలి.
చావు నోట్లె తలపెట్టి కేసీఆర్ తెలంగాణ రాజ్యం తేనైతే తెచ్చిండు గానీ, అది వస్తూ వస్తూనే 5 వేల మెగావాట్ల విద్యుత్తు సంక్షోభాన్ని మూటగట్టి నెత్తి మీద పెట్టుకొని వచ్చింది. ఆగకుండ రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్న ఆపదల రాజ్యంగా వచ్చింది. ఇప్పటి పాలకులు అప్పట్లో పరాయి పాలకుని పంచన చేరి పసిగుడ్డును పురిట్లోనే గొంతు నులిమి చంపేయాలని పన్నాగాలు పన్నుతున్న పాడుకాలం అది. ఎటుచూసినా సమస్యలు పరిక కంప తీరు అల్లుకొనే ఉన్నయి. ముందుగా ఇల్లు పొతం చేసుకోకుండా, నడింట్ల తిష్ట వేసినట్టున్న సమస్యలను పరిష్కరించుకోకుండా రిజర్వేషన్లను ముందేసుకోవడం కాలయాపనే అవుతుందని తాత్కాలికంగా పక్కనపెట్టారు. వ్యాసకర్తగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. 2014-16 శాసనసభ రికార్డులు తిరిగేస్తే ప్రతి అంశం స్పష్టంగా ఉంటుంది. ఇప్పటి పాలకులు తప్పుల తడకగా చేసిన బీసీ కుల గణన, రిజర్వేషన్ల గురించి గొప్పలు చెపుకోవటానికి తప్పితే, బీసీలకు ఇసుమంతైనా ఉపయోగం లేదు.
కేసీఆర్ తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, పారిశ్రామిక దిగ్గజాలను హైదరాబాద్కు పరుగులు పెట్టించింది. 12 ప్రధాన రంగాల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పారిశ్రామిక ఉత్పాదక జీడీపీ అత్యధికంగా 23 శాతం మైలురాయిని అందుకున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పారిశ్రామిక పెట్టుబడులు అంటే దావోస్ చుట్టూ చక్కర్లు కొట్టడం, జపాన్లో పర్యటించటమే తెలుసు.
కేసీఆర్ ముందు చూపుగా చేసిన చెరువుల పునరుద్ధరణ ఉద్యమం తెలంగాణ హరిత విప్లవానికి పునాది అయింది.మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 46 వేల చెరువుల పూడికతీసిండు. కూలిపోయిన మత్తడి గోడ మళ్లీ నిలబెట్టిండు. గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. కృష్ణా మీద నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తిలను ఎత్తిపట్టి చెరువుతో సంధానించిండు. చెరువు చుట్టూ జల పెరిగింది. జలం ఇచ్చిన బలంతో కోటి ఎకరాల మాగాణిలో పచ్చదనం విచ్చుకున్నది. పచ్చబడిన చెట్టు మీద పిట్ట వాలింది. ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ నివేదిక ప్రకారం… తెలంగాణలో 2012-13కు ముందు దిగుబడి వరిధాన్యం విలువ రూ.8,291 కోట్లు కాగా.. 2021-2022కు రూ.22,544 కోట్లకు పెరిగింది.
పదేండ్ల కాలంలో దిగుబడి విలువ 150 శాతం మేర పెరిగింది. 2022 రబీ సీజన్లో 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 2023 నాటికి 3.23 కోట్ల టన్నులకు పెరిగింది. ఇంత ధాన్యం తాము కొనలేమని ఓ దశలో కేంద్రమే చేతులెత్తేసింది. ఇగో ఇట్లా మీసం తిప్పిన రైతన్న ఇవాళ తిండి గింజలకు గతి లేదని భూక్యా నారాయణ దిక్కులు చూడటం రైతు సహజ సంఘర్షణ. సాగుబడి అంటేనే కాలంతో పాటు సాగిపోవటం. కరువు కాలంలో కన్నీళ్లు కార్చడం. ఆయుటి కోసం మళ్లీ ఎదురుచూడటం. తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఆయుటి అదును కోసం ఎదురుచూస్తున్నది. చలో వరంగల్ అంటున్నది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు