‘తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజమే, వారు చెప్పింది అక్షర సత్యం. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ రైజింగ్‌ను ఆపలేకపోయింది. అయితే, ఒక్క ప్రభుత్వానికే తెలంగాణ రైజింగ్‌ను ఆపే శక్తి ఉన్నదని సీఎం రేవంత్ నిరూపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు 22 శాతం తగ్గాయి. అన్నిరకాల ఆదాయాలు పడిపోయాయి. హైదరాబాద్ శివారు గ్రామాల్లో ఎన్నికలకు ముందు ఎకరం భూమి ధర రూ.2 కోట్లు పలికినా ఇప్పుడు కోటికైనా కొనేవారు లేరు. అన్ని చోట్లా ఇలా 50 శాతం వరకు ధరలు పడిపోయాయి. మహా నగరంలో అపార్ట్మెంట్లు కట్టి అమ్ముడు పోవడం లేదని బిల్డర్ ఆత్మహత్య చేసుకున్న ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుంది. నిజమే తెలంగాణ రైజింగ్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు. పాలకుడు కాబట్టి ఆ శక్తి ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉన్నది. గత ఏడాదిన్నర నుంచి ఆ శక్తిని చూపిస్తున్నారు కూడా.
ఒక మహిళా జర్నలిస్ట్ ఫోన్ చేసి ‘నా సోదరికి క్యాన్సర్ వ్యాధి సోకింది. చికిత్స కోసం నెలకు కనీసం రూ. లక్ష ఖర్చవుతున్నది. నా సోదరి ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొంది ఏడాది గడుస్తున్నది. కానీ, ప్రభుత్వం ఇంకా బెనిఫిట్స్ ఇవ్వలేదు. సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం కోరుదామా అంటే నా సోదరి ప్రభుత్వ ఉద్యోగిని. కాబట్టి ఆ స్కీం వర్తించదు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి’ అని ఆవేదన చెందుతున్నది. ఇదీ ఒక ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి. ఇలాంటివారు రాష్ట్రంలో వందల మంది ఉన్నారు. రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.10 వేల కోట్లు. రాష్ట్రంలో కోటి మంది సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న రేవంత్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి క్యాన్సర్ చికిత్సకు కూడా వారికి రావలసిన డబ్బులు వారికిచ్చే స్థితిలో లేదు. విదేశీ విద్యా పథకం కింద గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు ఇచ్చేది. మొదటి దశలో రూ.10 లక్షలు, 2వ దశలో మిగిలిన 10 లక్షలు ఇచ్చేది. గత ప్రభుత్వ హయాంలో ఎంపికైన వారికి గతంలోనే 10 లక్షలు ఇచ్చారు.
ఇప్పుడు వారి 2వ సెమిస్టర్ కూడా ముగిసింది. అయినా మిగిలిన 10 లక్షలు ఇవ్వలేదు. కొత్త జాబితా వెల్లడించలేదు. ప్రభుత్వ పోకడ ముందే గ్రహించిన బ్రాహ్మణ పరిషత్తు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విదేశీ విద్య కోసం దరఖాస్తులు తీసుకోవడం నిలిపివేసింది. బీసీ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. రేవంత్ సీఎం కాగానే విదేశీ విద్యా పథకాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచంలో అత్యున్నత యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. బీసీ శాఖ మంత్రేమో ఇప్పుడిస్తున్న 350 మందికి సరిపోదు, దీన్ని కనీసం వెయ్యి మందికి ఇచ్చేట్టు విస్తరిస్తామన్నారు. ‘నిధుల్లేవు, పథకాన్ని ఎత్తివేస్తున్నాం’ అని నేరుగా చెప్పకుండా అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు, మరింత ఎక్కువ మందికి ఇస్తామని చెప్తుంటారు. ఇది రాజకీయ భాష. ఉద్యోగాన్ని ఊడబెరికి ప్రభుత్వరంగ సంస్థను మూసేయడాన్ని గోల్డెన్ షేక్ హ్యాండ్ అని ముద్దుగా పిలిచినట్టు పథకాలను నిర్వీర్యం చేసే రాజకీయ భాష ఇది.
ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్‌లో ఐటీ రంగం భవిష్యత్తు ఏమిటనే సందేహాలు బయల్దేరాయి. అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వైఎస్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోసారి ఇలాంటి సందేహాలే వినిపించాయి. అయితే ఆ పదేండ్ల కాలంలో చంద్రబాబు, వైఎస్ కాలంలో కన్నా ఐటీరంగం ఎక్కువగా అభివృద్ధి చెందింది. రాజకీయాలు ఎలాగైనా ఉండవచ్చు. రాజకీయ ప్రయోజనాలు, అహంకార వైఖరితో తెలంగాణ గుండెకాయను గాయపరిచే పనులు చేపట్టవద్దు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం సుందరయ్య విజ్ణాన కేంద్రం పార్క్‌లో ప్రభుత్వ ఉద్యోగులు వాకింగ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇస్తూ రైతుబంధు, దళితబంధు, పింఛన్లకు నిధులు మళ్లిస్తే మా తడాఖా చూపించామని ముచ్చటించుకోవడం వినిపించింది. అప్పుడు జీతం వారం రోజులు ఆలస్యమైందేమో కానీ, ఇప్పుడు జీతం ఆలస్యమే కాదు, చివరికి క్యాన్సర్ వచ్చినా చికిత్స చేసుకోవడానికి రిటైరైన వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక వైపు దళితబంధు లేదు, సగం సగం రైతుబంధు.
పద్నాలుగేండ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం ఉద్యమించింది కానీ, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకొనే ఒక్క పని కూడా చేయలేదు. ప్రధానంగా ఉద్యమ కాలంలో హైటెక్ సిటీ వైపు వెళ్లలేదు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఐటీ రంగంతో పాటు హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల వ్యాపారాల సంగతి ఏమిటనే ప్రశ్నలు ఉదయించాయి. చివరికి జలదృశ్యంలో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాత్రికి రాత్రి రోడ్డున పడేస్తే మౌనంగా కార్యాలయ ఫర్నిచర్‌ను మరో అద్దె భవనంలోకి మార్చారు కానీ, దౌర్జన్యానికి దిగలేదు. దేశం దృష్టిని, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉధృత ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ అభివృద్ధిని ఏ ఉద్యమ సంస్థ, ఏ ఉద్యమ కారుడు అడ్డుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న కోదండరాం బృందం నాటి పిలు పు మేరకు ట్యాంక్‌బండ్‌పై తెలుగు వారి విగ్రహాల కూల్చివేత జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనలేదని, అక్కడి మీటింగ్‌లోనే కోదండరాం బృందం కేసీఆర్‌పై బహిరంగ విమర్శలు చేశారు. ఈ ఒక్క సంఘటన తప్ప ఉద్యమంలో అభివృద్ధిని అడ్డుకొనే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అలాంటిదిప్పుడు తెలంగాణ అభివృద్ధిని ఎవరో అడ్డుకుంటున్నారన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేర’ని ప్రకటించడమే విడ్డూరం. అనేక మీటింగ్‌లలో యాంకర్లు సీఎం పేరు కూడా మరిచిపోతున్నారు. చివరికి సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సీఎం పేరు గుర్తుకురాక సీఎం కేటీఆర్ అంటూ మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ సహచరులపైనే సీఎం చూపించిన ప్రభావం అది.
హైదరాబాద్ అభివృద్ధి అంటే తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ భూములతో పోటీ పడి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతు అంటే చిరిగిన దుస్తులతో, మాసిన గెడ్డంతో నిరాశగా ఆకాశం వైపు వర్షం కోసం చూసే బడుగుజీవి అనే ముద్ర బలంగా ఉండేది. అలాంటి రైతు కూడా అర ఎకరం అమ్ముకొంటే పిల్ల పెళ్లి అద్భుతంగా చేస్తానని ధీమాగా పలికే పరిస్థితి వచ్చింది. అలాంటిదిప్పుడు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ కూడా పడకేసింది.
ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రాచకొండలో కొత్త నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో రాచకొండలో కొత్త నగర నిర్మాణం గురించి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీపై మాట్లాడుతున్నారు. నగరానికి ఆనుకొని ఉండటం వల్ల హైటెక్ సిటీ వెంటనే అభివృద్ధి చెందింది. అంతే కానీ, నగరం దాటి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫ్యూచర్ సిటీ నగరంగా ఏర్పడటం అంత ఈజీ కాదు. కాంగ్రెస్‌లో ఏడాదిన్నర అంటే సుదీర్ఘ కాలం. కాంగ్రెస్ పరిశీలకులు మారారు. ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే పూర్తికాలం సీఎంగా ఉండగలిగారు. కాంగ్రెస్‌లో ఎవరి ఫ్యూచర్ ఏమిటో ఎవరూ చెప్పలేరు. సీఎం ఫ్యూచర్‌కే గ్యారెంటీ లేనప్పుడు ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు ఏమిటో ఎలా చెప్పగలం? డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రంగులు మార్చి ఇందిరమ్మ ఇండ్లు అని కేటాయించడం తప్ప ఇప్పటివరకు కొత్తగా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదు.
కేసీఆర్ ప్రారంభించారనే అక్కసుతో ఫార్మా సిటీని రద్దుచేశారు. ఫార్మా సిటీపై ప్రత్యేకంగా దృష్టిసారించి ఉంటే ఐటీ ద్వారా లక్షల మందికి ఉపాధి లభించినట్టు భవిష్యత్తులో ఫార్మా రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్‌లో ఐటీ రంగం భవిష్యత్తు ఏమిటనే సందేహాలు బయల్దేరాయి. అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వైఎస్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోసారి ఇలాంటి సందేహాలే వినిపించాయి. అయితే ఆ పదేండ్ల కాలం లో చంద్రబాబు, వైఎస్ కాలంలో కన్నా ఐటీ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందింది.
రాజకీయాలు ఎలాగైనా ఉండవచ్చు. రాజకీయ ప్రయోజనాలు, అహంకార వైఖరితో తెలంగాణ గుండెకాయను గాయపరిచే పనులు చేపట్టవద్దు. హైదరాబాద్ అభివృద్ధికి తద్వారా తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎంగా రేవంత్ కృషిచేయాలి కానీ, అన్నింటిని చెరిపేస్తాను, కూల్చేస్తానంటూ విధ్వంసానికి పాల్పడవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్‌తో పాటు ఏయే రంగాలు దెబ్బతిన్నాయో, ఎందుకు దెబ్బతిన్నాయో సమీక్షించి ఆ రంగాల అభివృద్ధిపై దృష్టిసారించాలి. హైదరాబాద్‌లోనే తెలంగాణ ప్రాణం దాగి ఉన్నది. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపడం లేదు. అధికారం చేతిలో ఉండటం వల్ల తెలంగాణ రైజింగ్‌ను ఆపే శక్తి మీకు ఉండవచ్చు కానీ, ఆ అధికారాన్ని తెలంగాణ అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది.
– బుద్దా మురళి