చరిత్ర పరిశోధన కేవలం పుస్తకాలు లైబ్రరీలలో కాకుండా, క్షేత్ర పరిశోధన ద్వారానే వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. అందుకే, ఆసిఫాబాద్ అడవుల్లో ఆరున్నర కోట్ల ఏండ్ల కిందటి నత్త శిలాజాలను గుర్తించడం, కవ్వాల్ టైగర్ రిజర్వులో కొత్త రాతి యుగపు పనిముట్లు కనుగొనడం వంటి ప్రత్యేకమైన విషయాలు శ్రీనివాసన్ తన సహచర చరిత్ర పరిశోధకులైన పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్(ప్రిహా) సభ్యులతో కలిసి వెలుగులోకి తీసుకువచ్చారు.
మంజీరా తీరంలో శాతవాహన కాలపు చరిత్రను వెలికితీసే ప్రయత్నంలో, మెదక్ జిల్లాలో ఏడుపాయల నది ప్రాంతంలో ఒక టెర్రకోట (మృణ్మయ) వస్తువుపై అశోకుడి కాలపు బ్రాహ్మీ లిపిలో ‘దేవానాం’ అనే అక్షరాలు దొరకడం అపురూపం. ఎందుకంటే ‘దేవానాం ప్రియ’ అనే అశోకుడి బిరుదులో భాగమైన ‘దేవానాం’ అక్షరాలు తెలంగాణలో మౌర్యుల ఆనవాళ్లు సూచిస్తాయి. శ్రీనివాసన్ బృందం ఇదే ప్రాంతంలో ఇంకో రాతిగుట్టలో కనుగొన్న ఒక బౌద్ధ స్థావరం, అక్కడ బ్రాహ్మీ లిపిలోని మూడు ప్రాకృత భాష శాసనాలు, తెలంగాణ ప్రాచీనత్వాన్ని నిరూపిస్తున్నాయి. మొత్తమ్మీద తెలంగాణలో ఎనిమిది బ్రాహ్మీ లిపిలోని ప్రాకృత భాషా శాసనాలు తెలంగాణ శాసన సంపత్తిని పరిపుష్ఠం చేస్తున్నాయి.
శ్రీనివాసన్ పరిశోధనలకు, చరిత్ర రచనలకు ‘నమస్తే తెలంగాణ’ ఒక వేదికను కల్పించింది. 72 వారాల పాటు ప్రతీ సోమవారం ఈ పత్రికలో ‘మన చరిత్ర’ శీర్షికతో సాధారణ పాఠకులకు అర్థమయ్యేలా తెలంగాణ చరిత్రను రాశారు శ్రీనివాసన్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి మొదలైన తెలంగాణ చరిత్రపై విస్తృత పరిశోధనకు ఈ రచనలు కొనసాగింపు అంటారు ఆయన. చరిత్రకారులకు పురాతత్వ శాస్త్రంపై, ఆర్కియాలజిస్టులకు చరిత్రపై పట్టు ఉండాలంటారు శ్రీనివాసన్.
తెలుగు విశ్వవిద్యాలయంలో బోధన, తెలంగాణ నేలపై పరిశోధన, ఈ రెండూ సిద్ధాంతానికీ, ఆచరణకు మధ్య ఉన్న సంబంధం లాంటిది. అందుకే శ్రీనివాసన్ విద్యార్థులు చరిత్ర పాఠాలు వినే మొదటి క్లాస్ నుంచే క్షేత్ర పరిశోధనపై మక్కువ పెంచుకుంటారు. ఇప్పటివరకు శ్రీనివాసన్ విద్యార్థులు పాతిక శాసనాలను వెలుగులోకి తెచ్చారు. చరిత్ర పరిశోధన అనేది ఒక సామూహిక ప్రయత్నం, అం దులో చరిత్రకారులు, విద్యార్థు లు, గ్రామస్థులు అందరూ నిమగ్నులైతేనే ఫలితం ఉంటుందని శ్రీనివాసన్ నమ్ముతారు. శ్రీనివాసన్కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ప్రకటించడం, తెలంగాణ చరిత్ర పరిశోధన, రచనలో ఉన్న అందరినీ గౌరవించడమే అని భావించాలి.
తెలంగాణ చరిత్ర ఎంత ఘనమైనదో అంత లోతైనది, ఎంత లోతైనదో అంత విస్మృతికి గురైంది. అందుకే, చరిత్రపై జరిగే ప్రతీ పరిశోధనా అపరిష్కృతంగా ఉన్న ఒక్కో విస్మృత ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ అస్మితను చాటి చెప్తూనే ఉన్నది. ఇలాంటి పరిశోధనలను గుర్తించే క్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2024 ప్రతిభా పురస్కారాలలో భాగంగా చరిత్ర పరిశోధనకు డాక్టర్ ఎం.ఎ.శ్రీనివాసన్కు పురస్కారం ప్రకటించింది. తెలంగాణలో బౌద్ధంపై ఓయూలో పీహెచ్డీ చేసిన శ్రీనివాసన్ ప్రాచీన చరిత్రపై ప్రత్యేక కృషిచేస్తున్నారు. తెలంగాణ నేలపై జీవం పుట్టుక నుంచి మొదలు చారిత్రక క్రమంలో మహా జనపదాల కాలం నుంచి రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడిన క్రమం ఆధారాలతో పరిశీలించే ప్రయత్నం శ్రీనివాసన్ పరిశోధనల్లో కనిపిస్తుంది.
-తోడిశెట్టి ప్రణయ్ ,80197 09050