తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో 30 ఏండ్లకు పైగా సేవలు అందించి, వృద్ధాప్యంలో విశ్రాంతి కోరుకొనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించడం అత్యంత కీలకమైన రాజ్యాంగ పరిణామం. దశాబ్దాలపాటు ఫైళ్ల సాక్షిగా, క్షేత్రస్థాయి విధుల్లో భాగంగా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్యోగి.. ఉద్యోగ విరమణ తర్వాత సముచిత గౌరవం కోసం, తన సొంత డబ్బు కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన దుస్థితి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక విషాదకర అధ్యాయం.
ఈ నేపథ్యంలోనే, హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు కేవలం ఒక ఆదేశం మాత్రమే కాదు, లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల పాలిట ఒక ఆశల ఆయుధం. ఏప్రిల్ 9వ తేదీని తుది గడువుగా విధిస్తూ, ఆలోగా పెండింగ్‌లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ (గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) చెల్లించాలని స్పష్టం చేయడం ద్వారా న్యాయవ్యవస్థ తన నైతిక బాధ్యతను చాటుకున్నది.
ఈ వివాదం లోతైన పూర్వాపరాలను పరిశీలిస్తే..గత కొన్నేండ్లుగా రాష్ట్ర ఖజానాపై పడుతున్న ఒత్తిడి సాకుతో రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను వాయిదా వేయడం సంప్రదాయంగా మారిపోయింది. ముఖ్యంగా విద్యా శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్యశాఖలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల నుంచి రిటైరైనవారు ఈ జాప్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఏటా సగటున 60 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులు రిటైరవుతున్నారు. వీరిలో సుమారు 40 శాతం మందికి అంటే దాదాపు 30 వేల మందికి పైగా ఉద్యోగులకు ఏడాది గడిచినా పూర్తిస్థాయి బకాయిలు అందడం లేదు. పెండింగ్‌లో ఉన్న మొత్తం విలువ వేల కోట్ల రూపాయలకు చేరడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలోని లోపాలను వేలెత్తి చూపుతున్నది.
సుప్రీంకోర్టు గతంలో ‘దేవకీ నందన్ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్’ వంటి అనేక చరిత్రాత్మక కేసుల్లో పెన్షన్ అనేది ఒక ‘ఆస్తి హక్కు’ (Right to Property) అని, అది రాజ్యాంగంలోని 300ఏ అధికరణం కింద రక్షణ పొందుతుందని స్పష్టం చేసినా, క్షేత్రస్థాయిలో దాని అమలు తీరు దారుణంగా ఉన్నది.
హైకోర్టు తన విచారణలో భాగంగా సంధించిన ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ‘ఒక వ్యక్తి తన యవ్వనమంతా ప్రభుత్వ సేవలో గడిపిన తర్వాత, వృద్ధాప్యంలో తన మందుల కోసం, కుమార్తెల పెండ్లిండ్ల కోసం, మనుమళ్ల చదువుల కోసం దాచుకున్న డబ్బును అడగడానికి బిచ్చగాడిలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలా?’ అనే కోర్టు ఆవేదనలో ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులను సాకులను చూపినప్పటికీ, న్యాయస్థానం దానిని సవాల్ చేసింది. సంక్షేమ పథకాలు, ఇతర ప్రాధాన్యతలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు, రాజ్యాంగబద్ధమైన బాధ్యత కలిగిన ఉద్యోగుల చెల్లింపుల విషయంలో ‘నిధుల లేమి’ అనే సాకు చెల్లదని తేల్చిచెప్పింది. ఏప్రిల్ 9 డెడ్‌లైన్ అనేది కేవలం ఒక తేదీ కాదు, అది ప్రభుత్వ ప్రాధాన్యతలను సరిదిద్దుకోవడానికి విధించిన గడువు. ఈ గడువు లోపల చెల్లింపులు జరుగని పక్షంలో, సంబంధిత శాఖల కార్యదర్శులు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉండటం అధికారుల్లో ఆందోళనను, బాధ్యతను పెంచినట్టయింది.
పరిపాలనా నైతికత కోణంలో చూస్తే, ఉద్యోగ విరమణ పొందిన రోజే ఉద్యోగి చేతికి రిటైర్మెంట్ ఆర్డర్లతోపాటు ఆర్థిక ప్రయోజనాల చెక్కులు కూడా అందాలి. డిజిటల్ ట్రెజరీ వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఫైళ్లు నెలల తరబడి ‘క్లియరెన్స్’ కోసం ఎదురుచూడటం అంటే అది వ్యవస్థీకృత నిర్లక్ష్యమే. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి, పెన్షన్ ప్రాసెసింగ్‌ను మానవీయ కోణంలో చూడాలని తెలిపింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల దృష్ట్యా, సమయానికి అందే గ్రాట్యుటీ వారి ప్రాణాలను కాపాడుతుందని గుర్తుచేసింది. ఇది కేవలం చట్టపరమైన అంశం కాదు, సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కూడా.
ఉద్యోగ సంఘాలు ఈ తీర్పును స్వాగతిస్తూనే, చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యానికిగాను 12 నుంచి 18 శాతం వడ్డీని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే వడ్డీ కూడా పెరుగుతుంది. కనుక జాప్యాన్ని నివారించడమే ప్రభుత్వానికి లాభదాయకం. భవిష్యత్తులో ప్రతి నెలా రిటైరయ్యే ఉద్యోగుల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా ‘ఎన్‌క్యాష్‌మెంట్ హెడ్’ కింద నిధులను ముందుగానే కేటాయించడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చు. హైకోర్టు ఇచ్చిన ఈ రక్షణ కవచం లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ ఎప్పుడూ బలహీనుల పక్షాన నిలుస్తుందని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
రామకిష్టయ్య సంగనభట్ల 94405 95494