దేశంలో మావోయిజం లేదా నక్సలిజం చివరి దశకు చేరుకున్నదా? సాయుధ పోరాటపంథాకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు 60 మంది క్యాడర్‌తో సహా మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోవడంతో ఆ పార్టీ భవితవ్యంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆపరేషన్ కగార్ కారణంగా తీవ్రస్థాయిలో నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఇంతకుముందే లొంగుబాటును సమర్థిస్తూ రాసిన లేఖపై మావోయిస్టు వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సిద్ధాంతవేత్త కావడం, సాయుధ పోరాటం కొనసాగింపుపై మౌలిక ప్రశ్నలను లేవనెత్తడమే అందుకు కారణమని చెప్పాలి.
కేంద్రం మావోయిస్టు సాయుధ పోరాటంపై రాజీలేని అణచివేతను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. చనిపోవడమో, లొంగిపోవడమో తేల్చుకోవాలని కేంద్ర హోంశాఖ అల్టిమేటం జారీచేసింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా వందలాది మంది మరణించడం పార్టీకి ఇటీవలి కాలంలో తగిలిన అతి పెద్ద దెబ్బ. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు తగ్గినట్టు కేంద్ర హో ంశాఖ తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మావోయిస్టు సాయుధ తిరుగుబాటును 2026 మార్చికల్లా అంతం చేస్తామని, ఏ మాత్రం క్షమించబోమని కేంద్రం అంటున్నది. ఆ లోగా నే లక్ష్యం పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నా యి. సాయుధ బలగాలు అధునాతన సాంకేతికతతో, ఆయుధ సంపత్తితో విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే 140 మంది మరణించడం పెరిగిన అణచివేత ఉధృతిని సూచిస్తున్నది.
ఈ వేట ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో సాయుధ పోరాట విరమణపై పార్టీలో అంతర్గతంగా ఎప్పటినుంచో ఉన్న తర్జనభర్జన మరోమారు ప్రస్ఫుటంగా ముందుకువచ్చింది. ఈ నేపథ్యంలో మల్లోజుల లొంగుబాటు కీలక పరిణామంగా నిలుస్తున్నది. సాయుధ పోరాటం ఇంకా కొనసాగించాలని పట్టుబట్టే పార్టీ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు వెలువరిస్తుండగానే గత రెండు రోజుల్లో మరో 258 మంది లొంగిపోవడం గమనార్హం. ఇంకా మరెందరో లొంగుబాట పట్టినట్టు తెలుస్తున్నది.
నిజానికి దోపిడీని అంతం చేయడం వంటి మావో ఆదర్శాల గురించి ప్రజలకు పెద్దగా అభ్యంతరం ఉండదు. వామపక్ష భావజాలం ప్రబలంగా వ్యాపించిన తెలంగాణలో మావోల పట్ల సానుభూతి ఒకింత ఎక్కువే. కాకపోతే లక్ష్యసాధనకు సాయుధ పోరాటమే శరణ్యమనే వాదనను ఈ రోజుల్లో ఎక్కువ మంది అంగీకరించకపోవచ్చు. ‘తుపాకీ గొట్టంలోంచే రాజ్యాధికారం వస్తుందనే’ మావో సూక్తి ప్రస్తుత పరిస్థితుల్లో కాలం చెల్లినట్టుగా కనిపిస్తుంది. హింస ఒక సాధనమే కానీ, లక్ష్యం ఎన్నటికీ కాదు. రష్యా, చైనా తదితర దేశాల్లో విప్లవాలు పెల్లుబుకిన నేపథ్యం వేరు. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక యుగంలో సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న ఏ రాజకీయ పక్షమూ విజయం సాధించిన దాఖలాలు లేవు.
అది అల్‌కాయిదా అయినా, ఎల్టీటీఈ అయినా చివరికి రాజ్యశక్తి చేతుల్లో దెబ్బతినక తప్పదు. నేపాల్ మావోలు సైతం కొన్నాళ్లు సాయుధమార్గం అనుసరించి ఆపై పార్లమెంటరీ రాజకీయాలతో మళ్లీ అధికారం సాధించడం చరిత్ర. మారిన సాంకేతికత, ప్రజల ఆలోచనా ధోరణి అందుకు కారణం. నేటి తరానికి ఈ ఆదర్శాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. పట్టించుకునే తీరికా వారికి ఉన్నట్టు లేదు. మావో పార్టీకి తగ్గుతూ వస్తున్న ప్రజాదరణ, యువ కార్యకర్తల కొరత అందుకు తార్కాణం. చంపడమో, చావడమో రెండే మార్గాలంటే ప్రజలు ఒప్పుకొనే పరిస్థితుల్లేవు. ప్రజలు బతుకుదెరువు గురించి తప్ప మరో విషయం గురించి ఆలోచించడం లేదు. దీన్ని ప్రస్తుత యుగ లక్షణంగా చెప్పుకోవచ్చు.
ఏదేమైనప్పటికీ మావోలు లేవనెత్తిన పలు అంశాలు, ముఖ్యంగా గిరిజనులను, అటవీ సంపదను కార్పొరేట్ శక్తుల దోపిడీ నుంచి కాపాడటం వంటివి ఇప్పటికీ ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. వాటికి రాజకీయ పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకతా ఉన్నది. అందువల్ల హింసాత్మక రాజకీయాలను ప్రజలు జీర్ణం చేసుకోలేకపోతున్నారనే సత్యాన్ని గ్రహించి సామూహికంగా ఆయుధాలు వదిలేసి ప్రజా జీవితంలోకి రావడం ఇప్పుడు మావోలకు ఎంతైనా అవసరం. ఆయా అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయ పోరాటం జరపొచ్చు. ఆచరణ సాధ్యం కాని పోరులో ప్రాణాలు బలిపెట్టడం కన్నా, ప్రాణాలు కాపాడుకొని ప్రజోద్యమాలు నిర్మించడం సర్వదా అభిలషణీయం.