తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అత్యంత విప్లవాత్మక కార్యక్రమం హరితహారం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దూరదృష్టి అనన్య సామాన్యం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రకృతి సంపదను కాపాడుకోవడం, పచ్చదనాన్ని పెంపొందించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం కోసం ఈ పథకాన్ని కేసీఆర్ రూపొందించారు.
హరితహారం కేవలం మొక్కలు నాటడమనే చిన్న ప్రయత్నం కాదు, ఇది ప్రజల్లో పర్యావరణ చైతన్యం కలిగించే మహా ఉద్యమం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతీ ఒక్కరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములుగా కేసీఆర్ చేశారు. తద్వారా 235 కోట్ల మొక్కలు నాటారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా తెలంగాణలో పచ్చదనం శాతం గణనీయంగా పెరిగింది.
హరితహారం విజయానికి ప్రధాన కారణం ప్రజల భాగస్వామ్యం. కేసీఆర్ సంకల్పాన్ని చూసి పల్లె నుంచి పట్టణం వరకు ప్రతీ ఒక్కరూ ఇందులో పాలుపంచుకున్నారు. విద్యార్థులు, సంఘాలు జతకలవడంతో ఇదొక ప్రజా ఉద్యమంగా మారింది. చెట్లను నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతనూ ప్రజలే స్వీకరించారు. ఈ విధంగా ప్రజల్లో పర్యావరణంపై ఉన్న అవగాహనను హరితహారం కార్యక్రమం మరింత పెంచింది.
హరితహారం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటీవల రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిపాలన శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కి ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు’ వరించడం ఈ కార్యక్రమం మహత్తును చాటిచెప్పింది. ఈ అవార్డు తెలంగాణలో అమలు చేసిన పర్యావరణ కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గతంలో రాష్ట్రంలో అనేక అద్భుతమైన పర్యావరణహిత కార్యక్రమాలను నిర్వహించారు, పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి, 10 కోట్ల మొక్కలు నాటించారు. దీంతో పాటు 108 లంగ్ స్పేస్‌లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమాలతో పర్యావరణ పాలనలో ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్ నిలిచింది.
హరితహారం గురించి కేసీఆర్ గతంలో ఇలా చెప్పారు. ‘ప్రతీ ఒక్కరూ ఒక మొక్క నాటితే, తెలంగాణ పచ్చగా మారుతుంది’ అని. వాస్తవానికి ఈ ఉద్యమం మూలంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత దశాబ్దంతో పోలిస్తే తెలంగాణలో అడవుల శాతం పెరిగినట్టు పలు నివేదికలూ సూచించాయి. కానీ, ఈ విజయాన్ని మనం మర్చిపోయాం. అడవుల విస్తీర్ణం పెరగడం వల్ల వాతావరణం చల్లబడింది. వర్షాలు స్థిరంగా పడుతున్నాయి. పక్షులు, వన్యప్రాణులకు కొత్త ఆశ్రయం లభించింది. గ్రామాల్లో చిన్న జలాశయాల పునరుద్ధరణ జరిగింది. పల్లెల్లో కొంతమేరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. కేటీఆర్‌కు పురస్కారం వచ్చిన సందర్భంగా ఈ విజయాలను గుర్తుచేసుకోవడం అత్యంత అవసరం.
హరితహారం కారణంగా పర్యావరణానికి ఒనగూడిన లాభాలు అనేకం. గాలి నాణ్యత మెరుగుపడింది. ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభ్యత పెరిగింది. భూగర్భ జలాల స్థాయి పెరిగి, కరవు పరిస్థితులు తగ్గాయి. వ్యవసాయ భూములు సారవంతంగా మారాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో తెలంగాణలో పచ్చదనం పెరగడం వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొనే కవచంగా మారింది. పర్యావరణానికి ఇంతటి మేలు చేసిన ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమం ప్రపంచంలోనే అరుదని చెప్పవచ్చు.
హరితహారం నేటి తరం కోసం మాత్రమే కాదు, రాబోయే తరాలకు ఒక విలువైన బహుమతి. మన పిల్లలు, మన మనవళ్లు జీవించే తెలంగాణ మరింత పచ్చదనంతో నిండిపోవడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం. ఒక చెట్టును నాటడమంటే ఆ చెట్టుకే జీవం ఇవ్వడం కాదు, భవిష్యత్తుకు జీవనాధారాన్ని ఇవ్వడం. మన తర్వాతి తరాలు శ్వాసించే గాలి శుభ్రంగా ఉండాలని, వారికి నీటి కొరత ఉండకూడదని, పర్యావరణం సహజ సిద్ధంగా ఉండాలన్నదే హరితహారం లక్ష్యం. ఈ మేరకు హరితహారం భవిష్యత్తు తరాలకు భరోసా ఇస్తున్నది. ఇదొక ప్రభుత్వ కార్యక్రమం కాదు, తరాల మధ్య ఉన్న బాధ్యతల ప్రతీక.
హరితహారం మొక్కలు నాటే పథకం కాదు, అదొక ప్రజా విప్లవం. కేసీఆర్ దూరదృష్టి, కేటీఆర్ కృషి, ప్రజల భాగస్వామ్యం ఈ ఉద్యమానికి శక్తినిచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఈ పథకం మన తెలంగాణకు గర్వకారణం. మనం మర్చిపోయినా హరితహారం వల్ల
పెరిగిన పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణానికి జరిగిన లాభాలు నిత్యం మనకు ఆ పథకాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి.
‘పచ్చని తెలంగాణ- ఆరోగ్యకరమైన తెలంగాణ’ అనే కలను సాకారం చేసిన హరితహారం పథకం భవిష్యత్తులోనూ ఎన్నో తరాలకు జీవనాధారంగా నిలుస్తుంది. మనం ఒక మొక్కను నాటితే, మన తెలంగాణ భావితరాల భవిష్యత్తును నాటినట్టే. అనేక త్యాగాలతో సాధించుకున్న మన తెలంగాణను అన్ని రంగాల్లో శక్తివంతమైన పర్యావరణహితమైన రాష్ట్రంగా రూపొందించడానికి కేసీఆర్ చేసిన అకుంఠిత కృషికి, మహా సంకల్పానికి తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– కార్తీక్‌రెడ్డి కోరుట్లపేట 98481 76545