ప్రజా తిరుగుబాట్లు
‘అంతా తమ ప్రయోజకత్వం, తామే భువికధినాథులమని, స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాల్, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై’ అని మహాకవి శ్రీశ్రీ రాసిన కవితా పంక్తులు గుర్తొస్తున్నాయి నేటి ప్రపంచ పరిణమాలను గమనిస్తుంటే. సోవియట్ యూనియన్ పతనంతో మొదలైన కమ్యూనిస్టుల వెనుకబాటు, దానిని వెన్నంటే ఎదుగుతూ వచ్చిన అతి జాతీయవాద, ధనికస్వామ్య రాజకీయం ప్రజా తిరుగుబాట్లతో తల్లకిందులవుతున్న సూచనలు మనకు కనిపిస్తున్నాయి
‘అంతా తమ ప్రయోజకత్వం, తామే భువికధినాథులమని, స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాల్, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై’ అని మహాకవి శ్రీశ్రీ రాసిన కవితా పంక్తులు గుర్తొస్తున్నాయి నేటి ప్రపంచ పరిణమాలను గమనిస్తుంటే. సోవియట్ యూనియన్ పతనంతో మొదలైన కమ్యూనిస్టుల వెనుకబాటు, దానిని వెన్నంటే ఎదుగుతూ వచ్చిన అతి జాతీయవాద, ధనికస్వామ్య రాజకీయం ప్రజా తిరుగుబాట్లతో తల్లకిందులవుతున్న సూచనలు మనకు కనిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వెల్లువెత్తుతున్న ప్రజా ఉద్యమాలు అధికార దురహంకారానికి, నిరంకుశ పాలనకు, రాజకీయ పెత్తందారీ వ్యవస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడమే ప్రజాస్వామ్యం కాదని, ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టడం కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని ఈ ఉద్యమాలు చాటిచెప్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో కొత్త మార్పులకు యువత ఉద్యమాలు కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీలను ఓడించడం అసాధ్యమని భావించిన చోట్ల సైతం ప్రజా నిరసనలు రాజకీయ సమీకరణాలను మారుస్తున్నాయి. ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలు, అధికార పక్షాల అహంకారాన్ని తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పులను వెలువరిస్తున్నారు.
బ్రెజిల్లో లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వా రాజకీయ పునరుత్థానం, హంగేరిలో విక్టర్ ఓర్బన్ ఓటమి, సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం నియంతను గద్దె దించడంలో సాధించిన రాజకీయ విజయం ఈ పరిణామాలకు నిలువెత్తు నిదర్శనాలు. ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, ఇటలీ తదితర దేశాల్లోనూ యువత, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినప్పుడు సిద్ధాంత పార్టీలు రంగంలో లేకపోయినా ప్రజలే స్వయంగా దాని పరిరక్షణకు ఉద్యమిస్తారన్న వాస్తవాన్ని ఈ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి.
బ్రెజిల్లో లూలా విజయం ఈ సందర్భంలో ప్రాధాన్యం సంతరించుకున్నది. తీవ్ర రాజకీయ విభజనల మధ్య వివిధ సామాజిక వర్గాలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ శక్తులను ఒక వేదికపైకి తీసుకురావడం ద్వారా ఆయన తన ప్రత్యర్థులను ఎదుర్కోగలిగారు. ఒక నాయకుడి విజయం కేవలం వ్యక్తిగత ప్రజాదరణపై మాత్రమే ఆధారపడదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విస్తృత ఐక్యతను నిర్మించగల సామర్థ్యం మీదనే ఆధారపడుతుందని ఈ పరిణామం సూచిస్తున్నది. సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం మరో ముఖ్యమైన ఉదాహరణ. నోవీ సాద్ నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణంలోని పైకప్పు కూలి ప్రాణనష్టం సంభవించిన ఘటన ప్రభుత్వ వ్యవస్థలోని నిర్లక్ష్యం, అవినీతిపై ప్రజాగ్రహానికి కారణమైంది. విద్యార్థులు ప్రారంభించిన నిరసనలు క్రమంగా విస్తృత ప్రజా ఉద్యమంగా మారాయి. ప్రభుత్వం తీవ్ర అణచివేతను అమలు చేసినప్పటికీ, అంతిమంగా అది ప్రధాని అలెక్సాంద్ వూచిక్ రాజీనామాకు దారితీయడం గమనార్హం.
ఇది కేవలం ఒక దేశానికి పరిమితమైన పరిణామం కాదు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. నిరసనకారులను విదేశీ శక్తుల ఏజెంట్లుగా చిత్రించడం, ఉద్యమాల వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపించడం, పోలీసు బలగాలతో ఆందోళనలను అణచివేయడం అనేక దేశాల్లో పాలకులు అనుసరిస్తున్న వ్యూహాలుగా మారాయి. కానీ సమస్యల మూలాలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణచివేయడం ద్వారా ప్రజల అసంతృప్తిని శాశ్వతంగా తొలగించలేమని ప్రపంచ అనుభవాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యువత రాజకీయ వ్యవస్థల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నది.
పాత రాజకీయ నాయకత్వాలపై విశ్వాసం సన్నగిల్లినచోట ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అన్వేషణ కొనసాగుతున్నది. యువత సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పంచుకుంటూ, వివిధ ప్రాంతాల్లోని ఉద్యమాల అనుభవాల నుంచి నేర్చుకుంటూ, తమ సమస్యలను జాతీయ రాజకీయ చర్చలోకి తీసుకొస్తుండటం ప్రస్తుతం ఒక ధోరణిగా మారింది. మొత్తమ్మీద జాతీయత, మతం వంటి విచ్ఛిన్నకర అంశాలు వెనుక తట్టుపట్టి ప్రజా సమస్యలు ముందుకు రావడం ముదావహం.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

