జార్జ్ వాషింగ్టన్. ఈ పేరు చాలామందికి సుపరిచితమే. ఆయనను అమెరికన్లు ‘ఫాదర్ ఆఫ్ ద నేషన్’ అని పిలుచుకుంటారు. ఇంగ్లండ్‌పై స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి విజయం సాధించినవాడు. అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు (1789-97). ఆయన విగ్రహాన్ని అమెరికా నగరమైన పోర్ట్‌లాండ్‌లో 200 సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత కూల్చివేశారు. కూల్చింది ఎవరు? ఎందువల్ల?
మరొక సుపరిచితమైన పేరు థామస్ జెఫర్సన్. అమెరికాకు మూడవ అధ్యక్షుడు (1801-1809). తనను దేశానికి ‘ఫౌండింగ్ ఫాదర్’ అంటారు. అమెరికన్ ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ప్రకటనను రూపొందించిన వారిలో ఆయన ముఖ్యుడు. ఆయన విగ్రహాన్ని కూడా 200 ఏండ్లకు కూల్చివేశారు. కూల్చింది ఎవరు? ఎందువల్ల? ఈ రెండు కూల్చివేతలు కూడా 2020వ సంవత్సరంలో జరిగాయి. ఆ పనిచేసింది ప్రధానంగా నల్లజాతి నిరసనకారులు. వారికి అమెరిండియన్లతో పాటు, అభ్యుదయవాదులైన శ్వేత జాతి అమెరికన్లు కూడా తోడయ్యారు. వారు ఆ పని ఎందుకు చేసినట్టు? జార్జ్ ఫ్లాయిడ్ అనే పేరు గుర్తున్నదా? ఐదేండ్లు గడిచిన తర్వాత బహుశా అందరూ మరిచిపోయి ఉం టారు. ఆయన అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరానికి చెందిన ఒక సాధారణ నల్లజాతి పౌరు డు. తను చిన్న పొరపాటు ఏదో చేసినందుకు తెల్లజాతి పోలీసులు రోడ్డుపైనే కిందకు పడదోసి గొంతును మోకాలితో నొక్కటం మొదలుపెట్టారు. ఊపిరి ఆడటం లేదని కీచుగొంతుతో అరిచినా వదలలేదు. అట్లా సరిగా 8 నిమిషాల 46 సెకండ్ల పాటు నొక్కిన తర్వాత జార్జ్ ఫ్లాయిడ్‌లో చలనం ఆగిపోయింది. చనిపోయాడు. ఇదంతా ఆ రోడ్డున పోయేవారు సెల్ఫోన్లో చిత్రీకరించారు.
ఆ ఉదంతం వెంటనే అమెరికాతో పాటు ప్రపంచమంతటా ప్రచారమై తెలిసిపోగా, ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ నిరసనల మధ్య జరిగిందే జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్ల విగ్రహాల కూల్చివేతలు. వారికి ఈ ఘటనకు సంబంధం ఏమిటి? ఏమిటంటే, ఆ ఇద్దరు అధ్యక్షులు అమెరికా చరిత్రలో గొప్పవారే. అమెరికన్లకు ఆరాధనీయులే. కానీ తమ కాలంలో నల్లజాతి వారిని కేంద్రంగా చేసుకొని సాగిన ‘బానిస వ్యవస్థ’కు వ్యతిరేకులు కాదు. పైగా, స్వయంగా అధ్యక్ష హోదాలోనూ పెద్ద సంఖ్యలో బానిసలను ఖరీదు చేసి నియమించుకున్నారు. ఆ చరిత్రను వందల ఏండ్ల తర్వాత కూడా నల్లవారు మరవలేదు. ఎప్పటికప్పుడు కొత్త తరాల నల్లవారిని సైతం ఆ జ్ఞాపకాలు దహించి వేస్తూనే ఉన్నాయి. మందుగుండు వలె పేలడానికి అనునిత్యం సిద్ధంగానే ఉన్నాయి. అందుకు ఒక చిన్న నిప్పురవ్వ చాలు. జార్జ్ ఫ్లాయిడ్ ఘాతుకమైన హత్య అటువంటి నిప్పురవ్వగా పనిచేసింది.
అమెరికన్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా తీవ్రమైన నిరసనలు చెలరేగాయి. సుమారు 200 నగరాలలో కర్ఫ్యూ విధించవలసి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. నిరసనకారులు 100కు పైగా విగ్రహాలను పడగొట్టడమో, లేక ఆ ఉధృతికి భయపడి ఆయా సంస్థల నిర్వాహకులే వాటిని మరొక చోటికి తరలించటమో జరిగింది. ఇది అమెరికా పరిస్థితి కాగా, యూరప్‌తో సహా అన్ని ఖండాలలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి.
ఇతర దేశాలను కనుగొంటానంటూ బయల్దేరి న ఇటలీ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ (1451-1506) జాతి దురహంకారి, బానిసలను పట్టినవాడు కాగా, ఆయన విగ్రహాలు సైతం ఇందుకు మినహాయింపు కాలేదు. అమెరికాలో బానిసల వినియోగం విస్తృతంగా ఉండిన దక్షిణాది రాష్ర్టాలను కాన్ఫెడరేట్ స్టేట్స్ అని వ్యవహరిస్తుండగా, ఆ రాష్ర్టాల సైన్యాధిపతులు, ఇతర ముఖ్యుల విగ్రహాలైతే డజన్ల సంఖ్యలో పతనమయ్యాయి. ఆ నిరసనలు కార్చిచ్చు వలె వ్యాపించాయి.
జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం జరిగిన వెంటనే ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే నినాదంతో మొదలైన నిరసనల ఉద్యమపు ఒత్తిడితో అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక దిద్దుబాటు చర్యలు తీసుకోవటంతో పాటు కొన్ని కొత్త చట్టాలు కూడా చేయక తప్పలేదు. దీనంతటిలోని పాఠాలు ఏమిటి? చరిత్ర ఎన్నటికీ సజీవమైనదే. వందల ఏండ్లు గడిచినా, వేల ఏండ్లు గడిచినా, ముఖ్యంగా పీడనకు, వివక్షలకు గురైనవారు ఆ చరిత్రను ఎప్పటికీ మరువలేరు. ఒక తరం నుంచి మరొక తరానికి ఆ జ్ఞాపకాలు సంప్రదాయిక వారసత్వం వలె వ్యాపిస్తూనే ఉంటాయి. ఆ చరిత్రకు బలమైన, మౌలికమైన సవరణలు జరిగితే తప్ప, ఆ జ్ఞాపకాల ఇంధనానికి ఏ చిన్న నిప్పు రవ్వ తగిలినా పేలక తప్పదు.
ఆమెరికాలో జరిగింది అదే. అది తన ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, సమాన అవకాశాల గురించి ఎన్నెన్ని గొప్పలు చెప్పుకొన్నా, ముఖ్యంగా నల్లవారితో పాటు ఇతరులపై కొనసాగే వివక్షలు, అణచివేతలు బహిరంగ రహస్యమే. ఆ స్థితిలో జార్జ్ ఫ్లాయిడ్‌పై జరిగిన దారుణంలో ఒక విధంగా ఆశ్చర్యం లేదు. ఆ దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు వాటి తీవ్రత రీత్యా కొత్తవి గాని, యథాతథంగా ఆశ్చర్యం కలిగించేవి కావు. అయితే ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. చిరకాలంగా ఎండుగడ్డి తయారై ఉన్నప్పుడు, దానికి నిప్పురవ్వ ఒకటి అంటుకుంటే, ఇక దానిని మండకుండా ఆపటం ఎవరితరం కాదు. నిప్పురవ్వ ఎప్పుడు, ఎందుకు, ఏ రూపంలో వచ్చి పడేదీ ఎవరూ చెప్పజాలరు. వివేకం గలవారు చేయవలసింది ఎండుగడ్డి అంటూ, నిప్పురవ్వలంటూ అసలు తయారుకాకుండా, వచ్చి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటమే.
ఇప్పుడు ఇదంతా, ఇంత సుదీర్ఘంగా చెప్పుకోవటానికి ప్రేరణ కలిగిస్తున్నవి రెండున్నాయి. ఒకటి, మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్ విగ్రహాల విషయంలో జరిగింది. రెండు, రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి సంబంధించి. ఈ విగ్రహాల పట్ల తెలంగాణలో గట్టి వ్యతిరేకత ఉంది. వాస్తవం చెప్పుకోవాలంటే ఆ వ్యతిరేకత యథాతథంగా ఆ ప్రముఖుల పట్ల కాదు. సీమాంధ్ర ధనిక వర్గాల ఆర్థిక దోపిడీ, రాజకీయ ఆధిపత్యం, సాంస్కృతిక అణచివేతలు, ఉద్యమ అణచివేతలు దశాబ్దాల పాటు సాగినందువల్ల ఆ వర్గాల పట్ల ఏర్పడిన వ్యతిరేకతలు ఈ ప్రముఖులపైకి బదిలీ అయ్యాయి. ఆ వర్గాల దుర్మార్గాలను ఈ ప్రముఖులు వ్యతిరేకించకపోవటం, ఆ వర్గాల దోపిడీ వల్ల లభించిన ఫలితాలను పెర్కోలేషన్ థియరీ పద్ధతిలో వీరు కూడా కొంత అనుభవిస్తూ మిన్నకుండటం అందుకు తోడయ్యాయి.
అట్లా మిన్నకుండి అనుభవించటం ద్వారా వారు ఆ దోపిడీలో ప్రత్యక్షంగా కాకున్నా పరోక్ష భాగస్వాములయ్యారు. ఇవన్నీ కలవటం వల్లనే ఆ ప్రముఖుల పట్ల కూడా తెలంగాణలో వ్యతిరేకతలు పేరుకున్నాయి.
కనుకనే మిలియన్ మార్చ్ సమయంలో అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి ఆ విగ్రహాలను చూడగానే ఆకస్మికంగా తన్నుకువచ్చిన భావోద్వేగాలు. ఇప్పుడు బాలసుబ్రమణ్యం విషయంలో కనిపిస్తున్నది అందుకు కొనసాగింపు మాత్రమే. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. రెండు సందర్భాలలోనూ ఉద్యమ నాయకత్వాలు అటువంటి పిలుపులేమీ ఇవ్వలేదు. జరిగినదంతా సాధారణ ప్రజలు, యువతరం నుంచి వచ్చిన క్షేత్రస్థాయి స్పందనలు. అప్పుడు, ఇప్పుడు కూడా. తమ ధోరణిలో ఆలోచించనందుకు వారు నాయకత్వాలను విమర్శిస్తున్నారు. దీనిని బట్టి, తెలంగాణ సమాజంలో గల భావనలను అర్థం చేసుకోవాలి.
ఇకముందు జరగవలసిందేమిటన్నది ప్రశ్న. ఇంతకాలపు చేదు జ్ఞాపకాలు ఇదేవిధంగా కొనసాగకూడదని, జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంలో వలె ఏదో ఒకరోజు విస్ఫోటనం కారాదని భావించినట్టయితే కొన్ని చర్యలు అవసరం. ఆ బాధ్యత ప్రధానంగా సీమాంధ్రులపై ఉంటుంది. తెలంగాణ వైపు నుంచి జరగవలసింది కూడా ఉంటుంది. ఆ ప్రకారం జరగవలసిన మొదటి పని, తెలంగాణలో సీమాంధ్రుల విగ్రహ ప్రతిష్ఠాపనలు ఇక పూర్తిగా ఆగిపోవాలి. రెండవది, రవీంద్రభారతి, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ వంటి ప్రధాన కేంద్రాలన్నింటా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటుచేయాలి. తెలంగాణ అంతటా చేయాలి. మూడవది తెలంగాణ ప్రముఖుల జాబితాలు తయారుచేసి ప్రకటించాలి. జాబితాల తయారీలో తెలంగాణ సమాజం సూచనలు తీసుకోవాలి. నాల్గవది, తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు సరిసమాన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలి. అయిదవది, వీటన్నింటికి టైమ్‌లైన్ ఉండాలి. ఆ మేరకు రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగాలి.
ఇట్లా కాకపోతే మరొకవిధంగా. కానీ, తెలంగాణ చారిత్రక, వర్తమాన గాయాల నివారణకు, అవి పెచ్చరిల్లుతూనే పోయి ఏదో ఒక రోజో, లేదా తరచుగానో, జార్జ్ ఫ్లాయిడ్ సందర్భంలో వలె ఆకస్మికంగా అగ్ని పర్వతాల వలె పేలకుండా ఉండాలంటే, ముఖ్యంగా సీమాంధ్రులు ఇప్పటికీ అదే ఆధిపత్య ధోరణిని, విజ్ఞతారాహిత్యాన్ని ప్రదర్శించటం గాక, తెలంగాణ ఉద్యమ విజయం నుంచి మొదలైన కొత్త వాస్తవాలను గుర్తించి వ్యవహరించటం అందరికీ మంచిది.
– టంకశాల అశోక్