గ్రామీణ పేదలకు ఉపశమనంగా ఉన్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీ నరేగా) వికసిత్ భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ)గా మార్చేసి పేదల ఊపిరిని తీయడానికి మోదీ సర్కార్ సిద్ధమైంది. ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో రైతు కూలీ సంఘాలు ఆందోళనలు సాగిస్తున్నాయి. నరేగా చట్టాన్ని మరింతగా నీరుగార్చే కొన్ని సవరణలతో మోదీ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 16న పార్లమెంటు ఉభయసభల్లోనూ నూతన చట్టంతో బిల్లు ప్రవేశపెట్టింది. పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వకుండా, విపక్ష పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే 18వ తేదీ నాటికే చట్టం చేసింది. ఆ విధంగా నూతన చట్టాన్ని ప్రజలపై రుద్దేందుకు కేంద్రం సిద్ధమైంది.
1980 నుంచి ‘పనికి ఆహారం’ పేరుతో సాగిన ఈ పథకాన్ని 2006లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలు చేసి 2009 నాటికి పథకానికి ముందు మహాత్మా గాంధీ పేరు చేర్చింది. ఆ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు కుటుంబంలో ఒకరికి మాత్రమే జాబ్ కార్డులు అందించి, ఏడాదిలో 100 రోజుల పని కల్పించాలి. 15 రోజుల్లో పని కల్పించకుంటే ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పని ప్రదేశాల్లో మహిళలకు అన్ని రకాల వసతులు కల్పించాలి. పని ప్రదేశం ఐదు కిలోమీటర్ల పరిధి దాటితే కూలీలకు ప్రయాణ చార్జీలు చెల్లించాలి. ప్రజల అవసరాలైన చెరువులు, పంట కాలువలు, మురుగు కాలువల నిర్మాణం అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం తదితర నైపుణ్య రహిత పనులు ఈ పథకం కిందికి వస్తాయి. వేతనాల చెల్లింపునకు ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం వంటి నిబంధనల కారణంగా సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.వేల కోట్ల బకాయిలు పెరిగిపోయాయి. ఈ పథకం అమల్లో నిధుల దుర్వినియోగం, నకిలీ జాబ్ కార్డులు, నిధుల దారి మళ్లింపు విధానాల వలన రూ.వేల కోట్లలో అవినీతి పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది.
ఈ పథకం ఆయా ప్రాంతాల్లోని పెత్తందార్లకు ఫలహార పథకంగా మారిపోయింది. ఆచరణలో ఈ చట్టాన్ని అరకొరగా అమలు చేసిన ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి హామీ లభించక కరువు ప్రాంతాల నుంచి వలసలు పెరుగుతూనే ఉన్నాయి.
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఈ పథకాన్ని మరింతగా నీరుగార్చేందుకు బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధిస్తున్నది. ఈ పథకం కొన్ని ప్రాంతాలకే అమలు చేయాలని నిర్ణయిస్తూ, పూర్తిగా మానవశ్రమనే ఉపయోగించడానికి బదులు అనధికారికంగా యంత్రాల వాడకాన్ని పెంచుతూ ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నది. ఇప్పటివరకు ఈ పథకం కింద 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ర్టాలు భరిస్తున్నాయి. అయితే, ప్రస్తుత నూతన చట్టం ప్రకారం 60 శాతం ఖర్చులను మాత్రమే కేంద్రం భరిస్తుండగా, మిగతా 40 శాతం రాష్ర్టాలు భరించాల్సి ఉంటుంది. 2024-2లో పాత చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7,700 కోట్లు చెల్లిస్తే, ఇపుడు కొత్త చట్టం ప్రకారం 2026-27లో రూ.51 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా రాష్ర్టాలపై భారాన్ని పెంచి ఆచరణలో ఈ పథకాన్ని మరింతగా నీరుగార్చింది. వ్యవసాయ సీజన్లో రెండు నెలల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని చట్టంలో పేర్కొనడం ద్వారా ఉపాధి కూలీల కడుపులను మాడ్చే నిరంకుశ చర్యకు పూనుకున్నది. గతంలో ఉన్న 100 రోజుల పని దినాన్ని 125 రోజులకు కొత్త చట్టంలో పెంచుతున్నట్టు చేసిన ప్రకటన వల్ల ఆచరణలో మరిన్ని పని దినాలు కోతకు గురవుతాయి. దీనికి నిదర్శనమే ఈ పథకానికి బడ్జెట్లో కేటాయింపులకు కోతలు పెట్టడమే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే ఈ పథకాన్ని నీరుగార్చే చర్యలకు పాల్పడగా ఇప్పుడు బీజేపీ సర్కార్ కొత్త చట్టం పేరుతో పేదలకు ఉపాధి దొరక్కుండా ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నది.
ఈ కొత్త చట్టం పేరుతో రాష్ర్టాలపై భారం పెంచడంపై బీజేపీ పాలిత రాష్ర్టాలైన బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ర్టాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్న రాష్ర్టాలే ఈ కొత్త పథకాన్ని వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కనీసం నిరసన తెలియజేయకపోవడం అన్యాయం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించడానికి మూలకారణమైన భూమి సమస్యను పరిష్కరించడానికి సమగ్ర భూ సంస్కరణలను సాధించేందుకు పీడిత ప్రజలు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి.
(వ్యాసకర్త: సీపీఐ (ఎంఎల్) నాయకుడు)
– ముప్పాళ్ళ భార్గవశ్రీ
9848120105