వీధిలో పూలు పూశాయి.
మిణుకు మిణుకుమంటూ
రోడ్ల మీద పరిగెత్తి
మసకబారిన గడపలపై
పసుపునీళ్ల అభిషేకం చేశాయి.
పూల శరీరాలపై చెమట మందిరాలు
ఒత్తుగా పారే నదులు.
బిగుసుకుపోయిన వీధిని
కదిలించే చందమామలు.
అలసిపోయి!
గొబ్బెమ్మలుగా ముడుచుకున్న పూలు
పసికందులను ముద్దాడాయి,
ప్రేమగా నిమిరి
గుంపులోకి, సమాజంలోకి ఆహ్వానించాయి.
కొత్తగా ఉద్భవించిన
పసిపిల్లల్లాంటి రెండు నక్షత్రాలు
రాత్రిని ఆశ్చర్యపరుస్తాయి,
తమలోకి పుప్పొడిని ఒంపుకొని
కిరణాలుగా ప్రకాశిస్తాయి.
పూలు కావాలి!
మకరందం లేని వీధి
పురాతన స్మశానవాటిక.
పూలరెక్కల కేకలు
నీరవ నిశ్శబ్ద వాకిళ్లకు
దండోరా.
పూలను గుప్పెట్లోనో,
నాలుగు గోడల మధ్యనో బంధించకండి.
వదిలేయండి!
తాజాగా పరిమళిస్తూ ఉంటాయి,
నవయుగానికి కీర్తి పతాకమౌతాయి,
పిడికిళ్లుగా మారి
పోరాటమార్గంలో పయనిస్తాయి.
ఇంట్లో మగ్గుతున్న ఆడబిడ్డలు
వీధుల్లోకి ఎందుకు రారు?
వీధికి మరో కన్ను కూడా కావాలి.