తెలంగాణ తొలి ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనా కాలంలో పదేండ్లపాటు కళకళలాడిన రాష్ట్ర మత్స్యరంగం, స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న మత్స్యశాఖ గడిచిన ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కునారిల్లుతున్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడిన నాలుగున్నర లక్షల మంది మత్స్యకారులు, పరోక్షంగా ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు 20 లక్షల మంది తిండికి నోచుకోక విలవిల్లాడుతున్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం సరికొత్త పథకాలను ప్రవేశపెట్టి, తమ బతుకులకు మరింతగా భరోసాను కల్పిస్తుందని మత్స్యకారులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం కాంగ్రెస్ అటకెక్కించింది. దీంతో మత్స్యకారులు ఇప్పుడు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ మత్స్యరంగం పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ సిద్ధించాక బీఆర్ఎస్ సర్కారు వినూత్న పథకాలను ప్రవేశపెట్టి మత్స్యకారుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. అయితే, గత ఏడాదిన్నరగా ఆ ఆశలన్నీ మళ్లీ అడుగంటిపోయాయి. మొత్తంగా మత్స్యరంగమే అగమ్యగోచరంగా తయారైంది. మత్స్యరంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు, నిర్లక్ష్యాన్ని చూస్తుంటే, మత్స్యకార కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టిందా? అనే అనుమానం కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ వాగ్దానాలను చూసి ఆ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యరంగం అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తుందని మత్స్యకారులు నమ్మారు. తమ బతుకులు మరింతగా మెరుగుపడతాయని ఆశపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అమలుపరిచిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతోపాటు మరికొన్ని పథకాలు అందుతాయని భావించారు. కానీ, గతంలో పంపిణీ చేసిన చేపపిల్లల్లో సగం మాత్రమే ఈసారి పంపిణీ చేస్తామని చెప్పిన సర్కారు వారి ఆశలపై నీళ్లు చల్లింది. చేపపిల్లల పంపిణీ పథకం కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్టు అధికారులు నమ్మబలికారు.
గతంలో వలె కాకుండా వినూత్నంగా ఈసారి రెండు దశల్లో 50 శాతం చొప్పున పంపిణీ చేస్తామని, చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కానీ, మత్స్యశాఖ అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 28 కోట్ల చేపపిల్లలను మాత్రమే నీటివనరుల్లో వదిలారు. రిజర్వాయర్లలో రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఏటా 60-86 కోట్ల చేపపిల్లలను రాష్ట్రంలోని చెరువుల్లో వేసింది.
దీంతో గతాన్ని గుర్తుచేసుకొని, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చూసి మత్స్యకారులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. 2023-24 సంవత్సరంలో పంపిణీ చేసిన చేపపిల్లల బిల్లులను పూర్తిగా చెల్లిస్తేనే తాము 2024-25 సంవత్సరానికి చేపపిల్లలను పంపిణీ చేస్తామని కాంట్రాక్టర్లు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో స్వయంగా మత్స్యశాఖ డైరెక్టర్ కాంట్రాక్టర్లకు హా మీ ఇచ్చారు. అయినప్పటికీ, గతేడాది పంపిణీ చేసిన 28 కోట్ల చేపపిల్లలకు సంబంధించిన సుమారు రూ.34 కోట్లు ఇప్పటివరకు చెల్లించలేదు. కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం మత్స్య శాఖ సాకులు చెప్తూ పాటించడం లేదు.
రాష్ట్ర మత్స్యరంగానికి వెన్నెముకలా నిలుస్తున్న మత్స్యసహకార సంఘాల వ్యవస్థ ఏడాదిన్నరలో పూర్తిగా నిర్వీర్యమైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో సుమారు 3,650 మత్స్యసహకార సంఘాల్లో దాదాపు 3 లక్షల మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రెండు దశల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల ఫలితంగా మత్స్యసహకార సంఘాల సంఖ్య 6 వేలకు, సభ్యుల సంఖ్య సుమారు నాలుగున్నర లక్షలకు చేరుకున్నది. మహిళా మత్స్యసహకార సంఘాలతోపాటు మత్స్య మార్కెటింగ్ సొసైటీలను సైతం కొత్తగా ఏర్పాటు చేశారు.
ప్రతీ కుటుంబంలో నుంచి 18-60 ఏండ్ల వయసున్న కనీసం ఒక్కరిని అయినా మత్స్యసహకార సంఘాల వ్యవస్థలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకున్నది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్త మత్స్యసహకార సంఘాలను ఏర్పాటు చేయలేదు. సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా నిలిపివేసినట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం అప్పటి ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 33కు పెంచగా, అందుకు అనుగుణంగా జిల్లా మత్స్యసహకార సంఘాల వ్యవస్థను కూడా పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది.
33 జిల్లాల్లోనూ సహకార సంఘాలను కొత్తగా ఏర్పాటు చేసి, తాత్కాలిక కమిటీలను నియమించింది. సహకార ఎన్నికల చట్టం నిబంధనలకు అనుగుణంగా ఈ సంఘాలకు, రాష్ట్రస్థాయిలో ‘తెలంగాణ రాష్ట్ర మత్స్యసహకార సంఘాల సమాఖ్య’ (ఫిషరీస్ ఫెడరేషన్) పాలక మండలికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కాంగ్రెస్ సర్కారును పలుమార్లు ఆదేశించింది. అయినా మత్స్యశాఖ ఉన్నతాధికారులు కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నదే తప్ప ఎన్నికలు నిర్వహించడం లేదు.
ఉమ్మడి ఏపీలో నిర్లక్ష్యానికి, అణచివేతకు గురైన తెలంగాణ మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు పరిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 2016 నుంచి 2023 వరకు ఎనిమిది దశల్లో రూ.కోట్ల వ్యయంతో 100 శాతం సబ్సిడీతో ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా రాష్ట్రంలోని చెరువులన్నీ ఎల్లవేళలా నిండుకుండల్లా తొణికిసలాడాయి.
ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మత్స్యసహకార సంఘాలను మరింతగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ‘జాతీయ సహకార ఆర్థిక సంస్థ’ (ఎన్సీడీసీ) రుణసాయంతో రూ.వెయ్యి కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలుచేసింది. ‘నీలి విప్లవం’, ‘ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన’ లాంటి కేంద్రప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసింది. గత ప్రభుత్వం అమలుపరిచిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అటకెక్కించాలని కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నది.
అందులో భాగంగానే గతేడాది 50 శాతం చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. ఈ ఏడాది ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో అటకెక్కించాలని చూస్తున్నది. రాష్ట్రంలోని 26,320 నీటివనరుల్లో 85.60 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్యపిల్లలను వదిలేందుకుగానూ రూ.122 కోట్లు కేటాయించాలని మే నెలలోనే ప్రభుత్వానికి మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ, రాష్ట్రప్రభుత్వం దీనిపై ఇప్పటికి స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు చేతులెత్తేసే పరిస్థితి తలెత్తింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్య రంగం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తామని స్వయంగా రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. హామీ ఇచ్చిన రేవంత్ ఇవాళ మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ హామీని అమలు చేయాలనే సోయి ముఖ్యమంత్రికి ఉన్నట్టు ఏ కోశానా కనిపించడం లేదు. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వివిధ వర్గాలకు అడ్డదిడ్డంగా హామీలు గుప్పించి మోసం చేసినట్టుగానే, మత్స్యకార కుటుంబాలను ఆయన మోసం చేశారు.
-మత్స్యసహకార సంఘాల సమాఖ్య పూర్వ అధ్యక్షులు, రాష్ట్ర ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్