వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి పోయినోళ్లకు మద్దెల దరువేస్తున్న ఆటగత్తెలు.. తీరొక్క భంగిమలలో నృత్యం చేస్తున్న లాస్య శిల్ప సౌందర్యం దర్శనమిస్తుంది. పేరణీ నాట్య మదనికలత్రిభంగి నర్తన విన్యాసాలు చేస్తాయి. ప్రతి శిల్పమూ ముక్కులు చెక్కిన వలె కనిపిస్తాయి. ఇది శతాబ్దాల నాటి సాంస్కృతిక, అస్తిత్వ విధ్వంసానికి ప్రతిరూపం. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన మాలిక్ కాఫర్ అనే సేనాధిపతి కాకతీయ సాంస్కృతిక బలకరానికి భయపడి శిల్పాల ముక్కు మొఖం చెక్కించాడని చరిత్రకారుల ఉవాచ. పేరిణీ తాండవం పరమశివుని భైరవ రూపం, తిరుగుబాటుకు సంకేతం. సాంస్కృతిక ప్రతిమలే కదా జన సమూహాలకు ఉత్ప్రేరణలు. అందుకే పాలన తన అధీనంలోకి రాగానే మాలిక్ కాఫర్ సాంస్కృతిక విధ్వంసానికి పూనుకున్నడు. రాజ్యం పరాధీనమైన ప్రతిసారి పాలకులు మొదటగా చేసే అకృత్యం స్కాంస్కృతిక విధ్యంసమే.
ఆంధ్ర మనస్తత్వ పాలకుల ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడదే జరుగుతున్నది. కేసీఆర్ ప్రశాసనం నాటి సాంస్కృతిక జ్ఞాపకాల మీద పాలకుల విధ్వంసం జరుగుతున్నది. తొలుత రాజముద్ర మీది కాకతీయ తోరణంపై కన్నుపడింది.. తర్వాత కాళేశ్వరం నీళ్ల తడి తప్పింది.. ఇప్పుడు తెలంగాణ తల్లి రూపమే మారింది. స్వరాష్ట్ర ఆకాంక్ష సిద్ధించిన వేళ సాంస్కృతిక ఔషర్యం, వారసత్వ సారస్వం, మట్టి మనుషుల కర్షణ శౌర్యం మేళవింపుతో రూపం పోసుకున్న అపురూప శిల్పం.. తెలంగా ణ తల్లి విగ్రహం.
ఇప్పుడిక చారిత్రక, సాంస్కృతిక ఆనవాళ్లను తవ్వుకోవాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ అస్తిత్వం ఇప్పటిదేం కాదు. రాతియుగం నుంచే తెలంగాణ ఉనికి ఉన్నది. జన జీవనంలో బతుక మ్మ ఉన్నది. బౌద్ధ గ్రంథాలు త్రిపీటకాలను అనుసరించి షోడశ మహా జనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అస్సక (అస్మక) రాజ్యమే తెలంగాణ. పోధన్ (నేటి బోధన్) దీని రాజధాని. కాలక్రమంలో అస్సక రాజ్యం మగధ లో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు అఖండ భరత ఖండాన్ని పాలించారు. అట్లా భరతమాత శిరస్సు మీద సహజ సిద్ధ కిరీటం పొదిగింది. ఆ వారసత్వ కిరీటమే తెలంగాణ తల్లికి సంక్రమించింది.
కాలగమనంలో దక్షిణాదిలోని మగధ రాజ్యం అంతరించి కళ్యాణి చాళుక్య రాజ్యం అవతరించింది. దీన్ని తైలపుడు అనే రాజు పరిపాలించేవారు. తైలపుడు మరణించాక అతని కొడుకు సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. చోళ దేశపు యువరాజు రాజేంద్ర చోళుడు మన సత్యాస్రాయుని మీద యుద్ధం చేసి గెలిచారు. తన విజయానికి గుర్తుగా వేములవాడ రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి, అక్కడి బృహదమ్మ (పార్వతి) సమేత శివయ్యను వేరు చేస్తూ భారీ శివలింగాన్ని పెకిలించి తన తండ్రికి బహుమతిగా తీసుకువెళ్లా డు. బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు చాళుక్య రాజ్య ప్రజలు పూలను మేరు పర్వతంగా పేర్చి, బృహదమ్మ పక్కనపెట్టి తమ దుఃఖాన్ని, నిరసనను చోళులకు తెలియజేస్తూ బతుకమ్మ ఆడిండ్రు. అట్లా బృహదమ్మ నామ రూపాంతరమే బతుకమ్మ.
అరువై ఏండ్ల పరాయి పాలనలో ఉన్న తెలంగాణ.. తను కోల్పోయిన స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని తిరిగి పొందాలనుకున్నది. తన ప్రత్యేక భాషా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలనుకున్నది. రాజ్యాధికారంతోనే వనరుల దోపిడిని అంతం చేయవచ్చని, సాం స్కృతిక వలసీకరణను నిలువరించవచ్చని, ప్రత్యేక భాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవచ్చని భావించింది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష చిగురించింది. జనకాంక్షకు ఊపిరులూదింది కేసీఆర్. ఆయన కొట్లాటకు తగ్గట్టు ప్రజ్ఞాపరులు తమ సృజనాత్మకతను వెలికితీసి, ఉద్యమం కోసం అద్భుతమైన ప్రతీకలను అందించారు. గోరటి వెంకన్న లాంటి సృజనకారులు పాటకు ప్రాణం పోస్తే.. రసమయి బాలకిషన్ గజ్జెకట్టి ధూంధాం ఆడిండు. వనపట్ల సుబ్బయ్య లాంటి కవులు కవితలకు రూపం ఇస్తే.. జూలూరు గౌరీశంకర్ లాంటి వాళ్లు పుస్తక ప్రదర్శన విప్లవాన్ని సమాజానికి పరిచయం చేశారు. ఇట్లా ఎవరికి వారు గా బుద్ధిజీవులు ఉద్యమంలో కేసీఆర్‌కు తోడు నిలిచిండ్రు. కొట్లాట ఫలించి అరువై ఏండ్ల కల కండ్ల ముందు కదలాడింది.
వజ్ర కిరీటాన్ని, బంగారు నగలను వలుచుకొని ఉత్తి జొన్న కంకి ని చేతుల పెట్టి నిలబెట్టిన మూస ప్రతిమ, భవిష్యత్తు తెలంగాణ దుస్థితికి అద్దం పట్టింది. కాంగ్రెస్ పాలకులు దిగిపోయే నాటికి.. వనరులన్నీ దోచుకోబడిన తెలంగాణ తల్లి తన బిడ్డలకు మొండిచెయ్యి చూపిస్తున్న పేదరాలి నిశానిలా నిలబడ్డట్టున్నది.
పసిగుడ్డు తెలంగాణకు అడుగులు నేర్పటానికి ప్రజలు, పాలకులు ప్రేరణ పొందటానికి అమ్మ ఆదరణ కావాలనుకున్నరు. చిత్రకారులు తమ దివ్య దృష్టితో అమ్మకు విశిష్ట రూపం ఇస్తే.. ఆ తల్లికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన కర్మాచార్యులు కేసీఆరే. నిజానికి ఉద్యమ కాలంలోనే జన సంస్కృతి.. వారసత్వం.. ఆశలు.. ఆకాంక్షలు.. అనుభూతులు.. ఉద్వేగాల ప్రతిబింబంతో అమ్మ రూపం పోసుకున్నది. తెలంగాణ అస్తిత్వమంతా ఆ తల్లి విగ్రహంలోనే ఉన్నది. ధిక్కారం, జలం, జీవం, జన బంధాలకు ప్రతీకగా బతుకమ్మ పట్టుకున్నది. పాలమూరు, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల ప్రాతినిధ్యంతో గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల చేనేతను గుర్తుచేస్తూ జరీ అంచు చీర కట్టుకున్నది.
నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రాశస్తిని గుర్తుచేసుకుంటూ స్వర్ణకారుల జీవితాల్లో మెరుగులు దిద్దే ఆకాంక్షతో బంగారు నగలు, వడ్డాణం, ఖమ్మం జిల్లా నుంచి వెండి మట్టెలు పెట్టుకున్నది. వ్యవ సాయ సాంస్కృతిక చిహ్నాలుగా మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి మెట్ట పంటల ప్రసిద్ధి మక్కజొన్న కంకులు. భరతమాత ముద్దుబిడ్డ వారసత్వంగా కిరీటం, ఆ కిరీటంలో నల్లమల అడవుల్లో దొరికిన కోహినూర్ వజ్రం, నెత్తి మీద నిండైన కేశ సంపద, మోము మీద పది జిల్లాల పారవశ్యపు జీవకళ ఉట్టిపడేలా ప్రాణం పోశారు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ.. ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా తన స్వరూపం మార్చుకుంటూ అమ్మ ముఖంలోని జీవకళ తీరుగా పదేండ్లలో బంగారు తెలంగాణగా అవతరించింది.
తెలంగాణ తల్లికి సృజనకారులు దైవరూపం దిద్దినట్టుగానే తెలంగాణ రూపురేఖలను కేసీఆర్ తీర్చిదిద్దారు. ఒక్కొక్క రంగాన్ని బొమ్మరిల్లు తీరుగా అల్లుకుంటూ వచ్చారు. ముందుగా మిషన్ కాకతీయ పథకం తెచ్చి చెరువులను తోడితే 15.05 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి, పల్లె జనజీవనానికి భరోసా దొరికింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లోకి తీసుకువచ్చి చెరువులకు నీళ్లు వదిలి.. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే.. రైతాం గం ముఖం వెలిగింది. ధాన్యం దిగుబడి 5 రెట్లు పెరిగింది. ఆ భరోసాతో రైతులు అప్పులు కట్టుకున్నరు. ఇక అనుబంధరంగాల మీద దృష్టిపెట్టి గొర్రెల పథకం, చేప పిల్లల పంపిణీ, పాడి బర్రెల పంపిణీ, కులవృత్తుల పునర్నిర్మాణంతో గ్రామీణ ఆర్థిక పరిపుష్టి, పల్లె ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారభద్రతకు దారి చూపించారు. ఇది ప్రపంచబ్యాంకు నిపుణులకు సైతం అందని వ్యూహరచన. దేశంలో మరే ముఖ్యమంత్రి సాధించని ఘనత. 10.15 లక్షల టన్నుల మాంసం, 42.43 లక్షల టన్నుల చేపలు, ఏటా 60.53 లక్షల టన్నుల పాలు, 1,680 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి వచ్చింది.
జనం తినేకాడికి తిన్నరు, మిగిలింది అమ్ముకున్నరు. బలమైన మంచి తిండి అందుబాటులోకి రావటంతో జనం మొఖం మీద ఇంత జీవతెంపు వచ్చింది. రూ.లక్ష ఉన్న తలసరి ఆదాయాన్ని కేసీఆర్ రూ.3.5 లక్షలకు పెంచారు. తెలంగాణ వచ్చిన రోజుల్లో 1,000 యూనిట్లు కూడా లేని తలసరి విద్యుత్తు వినియోగం కొలత పెట్టి కొలిచినట్టు 2,200 యూనిట్లకు పెరిగింది. ఇంకో పది, పదిహేనేండ్లు రైతుబంధు, 24 గంట ల ఉచిత కరెంటు ఇచ్చి ఉంటే ఎక్కడివాళ్లు అక్కడ బాగుపడుదురు. రైతు తన సొంత పెట్టుబడితోని ఎవుసం చేసుకునే రోజులు కండ్లముందు సాక్షాత్కరించేవి. కేసీఆర్ కోరుకున్న బంగారు తెలంగాణ కూడా ఇదే. ఆ తల్లి సాక్షి గా రైతును రాజుగా చేసి చూడాలని కలలుగన్నడు. కానీ, మన దరిద్రం నెత్తిమీద కూసున్నది. యుద్ధం చేసే వీరుని చేతుల కత్తి గుంజి శక్తివైకల్యుల చేతుల పెట్టినం. ఇప్పుడు అనుభవిస్తున్నాం.
అయినా పాలకులు మారినప్పుడల్లా మార్చడానికి తెలంగాణ తల్లి కేవలం బొమ్మ కాదు, మూడున్నర కోట్ల ప్రజల అమ్మ. తరతరాల అస్తిత్వం.. నిలువెత్తు వ్యక్తిత్వం.. పోరుకు ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తుకు దారిదీపం. తెలంగాణ మీద కేసీఆర్ ముద్రలన్నీ చెరిపివేయాలనే విభ్రమలతో నయా పాలకులు సాంస్కృతిక విధ్వంసానికి తెగబడుతున్నరు. వజ్ర కిరీటాన్ని, బంగారు నగలను వలుచుకొని ఉత్తి జొన్న కంకి ని చేతుల పెట్టి నిలబెట్టిన మూస ప్రతిమ, భవిష్యత్తు తెలంగాణ దుస్థితికి అద్దం పట్టింది. కాం గ్రెస్ పాలకులు దిగిపోయే నాటికి.. వనరులన్నీ దోచుకోబడిన తెలంగాణ తల్లి తన బిడ్డలకు మొండిచెయ్యి చూపిస్తున్న పేదరాలి నిశానిలా నిలబడ్డట్టున్నది.
మూడున్నర కోట్ల ప్రజల ఆరాధ్య దైవం బతుకమ్మను తెలంగాణ తల్లి నుం చి ఎడవాపటం అంటేనే ప్రజా ఆకాంక్షకు విరుద్ధమైన పాలన అనే దుష్ట సంకేతం పంపినట్టయింది. చరిత్రలో 1956 నవంబర్ 1కి, 2024 డిసెంబర్ 9కి పెద్ద తేడా లేదు. రెండూ తెలంగాణ విధ్వంసక దినాలే. 1956 నవంబర్ 1తో అప్పటివరకూ తెలంగాణకున్న స్వతంత్ర రాజకీయ అస్తిత్వం అంతమైపోయి, సీమాంధ్ర వలసాధిపత్యం ఆరంభమైంది. 2024 డిసెంబర్ 9తో ప్రజల ఉద్వేగాలను ఎగతాళి చేస్తూ.. సాం స్కృతిక విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. పాలకుల జెండాలు, ఎజెండాలు ఏమైనా ఉండొచ్చు. కానీ, సాంస్కృతిక పాదులను తొలగిస్తమంటే ప్రజా తిరుగుబాటుతో మరో సాంస్కృతిక విప్లవానికి పునాదులు పడక తప్పదు. తస్మాత్ జాగ్రత్త!
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు