‘సమైక్య రాష్ట్రంలోనే మనం బాగున్నం’ అన్నరు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి. అనడమే కాదు, సమైక్య ‘దినాల’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నరు. ఆయనకు మోదీ, చంద్రబాబు, రాధాకృష్ణల సంపూర్ణ సహకారం ఉన్నది. రాహుల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తనకు మూటలు అందినప్పుడు ఆనందంగా, సరిపోనప్పుడు అలుకగా ఉంటున్నరు. మరిన్ని సంచుల కోసం రేవంత్ మీద ఒత్తిడి పెట్టడాన్ని ‘రేవంత్-రాహుల్ మధ్య గ్యాప్’గా చూడకూడదు! సత్యభామ పారిజాత వృక్షం కోసం అలుగుతదే తప్ప కృష్ణుడిపై పగ కాదు కదా!
మోదీ, రాహుల్, చంద్రబాబు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీల ప్రతినిధులు. వారు రాజకీయం చేయడం సహజం. రాధాకృష్ణకు ఏం రోగం? ‘అక్షరంపై ఆంక్షలా?’ అనడానికి ఆయనకున్న విశ్వసనీయత ఏమిటి? పసిబిడ్డ తెలంగాణను, తెలంగాణ శాసనసభ్యులను ఎంత అవమానకరంగా చిత్రించిన్రో మనం మరువగలమా? తెలంగాణ సమాజం ఆగ్రహిస్తే ఏడాదిన్నరకు పైగా బ్యాన్ అయిన విషయం ఆర్కే మరువగలడా?
అసలు తెలంగాణ పుట్టుకే ఇష్టం లేదు కదా రాధాకృష్ణకు! డిసెంబర్ 9 ప్రకటన వెనక్కి వెళ్లిపోయినప్పుడు ఆయన సెలబ్రేట్ చేసుకున్నరు. తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు ఆయన ముఖం కందగడ్డలా ఉన్నదని ఆ ప్రతిక ఎడిటోరియల్ సిబ్బందే చెప్పిన్రు ఈ వ్యాస రచయితకు. ఇప్పుడేమో తన నిబద్ధతను శ్రీకృష్ణ కమిటీ మెచ్చుకుందని అబద్ధాలు రాస్తడు!
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసి రాజకీయ లబ్ధి కూడా పొందాలనుకుంటే కాంగ్రెస్ నాయకులను ముందు పెట్టి, పోరాటం చేయాల్సిందిగా సూచించాల్సింది. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డాక తెలంగాణ ఇచ్చి ఉంటే మీరు తెలివిగా ఆలోచించారని నమ్మేవాళ్లం’ – ఇది జైరాం రమేశ్‌తో తాను మాట్లాడిన విషయం అంటూ నిర్లజ్జగా రాసుకున్నడు రాధాకృష్ణ. నవీన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మొదటి టర్మ్‌లో ఆయనకు అనధికార సలహాదారు రాధాకృష్ణ. ‘ఎన్టీఆర్ పేరు తీసేయండి’, ‘ఆ నా కొడుకులకు జీతాలు పెంచకండి’ అంటూ దర్పం ఒలకబోస్తూ సలహాలు ఇవ్వడం చూడలేదా మనం?
మీడియాకు రాజకీయ పార్టీలతో ఏమి పని? పత్రికా స్వేచ్ఛ అంటే ఏ పార్టీలను ఎట్లా తొక్కాలో సలహాలు ఇవ్వడమా? అమిత్ షా ప్రైవేట్‌గా వచ్చి ఎందుకు కలుస్తడు మిమ్మల్ని? మీరు ఎందుకు రాహుల్ గాంధీని కలుస్తరు? వైరి శిబిరాలు అని చెప్పుకొనే రెండు జాతీయ పార్టీలతో ఏకకాలంలో అంటకాగడం రాజకీయ వ్యభిచారం కదా! మీ అందరి లక్ష్యం తెలంగాణ వినాశనమే, సమైక్య పాలన పునఃస్థాపనయే కదా!
కాబట్టే, మీ అందరి కొత్త బంటు అయిన రేవంత్ రెడ్డిని అన్ని పార్టీలు, మీడియా సంస్థలు ఏకమై జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నయి. అయినా లాభం లేకపోగా, రోజురోజుకూ పాతాళంలోకి కూరుకుపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అభివృద్ధి- సంక్షేమం అటకెక్కి, మోసపోయిన గ్రహింపు వచ్చిన జనం నిరసనలు నిత్యకృత్యమైనయి. గ్రామసభలు పోలీసు పహారా లేకుండా సాగడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సొంత పార్టీ కార్యకర్తనే ఆత్మహత్యకు పురిగొల్పే ‘ప్రజా పాలన’ నడుస్తున్నది. మాజీ నక్సలైట్, మంత్రి సీతక్కకు మావోయిస్టు పార్టీ నుంచే హెచ్చరిక లేఖ అందిందంటే ఈ ప్రభుత్వ సర్వభ్రష్టత అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి కూడా దాచాలన్నా దాగనంత గతకాలపు వెలుగు; ఇప్పటి చీకటి ప్రజల అనుభవంలోకి వచ్చింది. కాబట్టే, జనం తెలంగాణ భవన్‌కు క్యూ కడుతున్నరు.
రేవంత్ రెడ్డి ‘జై తెలంగాణ’ అనకపోవడానికి తాత్విక భూమిక ఉన్నది. ‘తెలంగాణ’ అంటే ‘కేసీఆర్’ గుర్తొస్తరు. అంత అవిభాజ్యం ఆ రెండు పదాలు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలన్న సంకల్పంతో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణను కనుమరుగు చేస్తే కేసీఆర్ కనుమరుగు అవుతరు అనుకుంటున్నరు. కాబట్టే, సమైక్య పాలన మంచిగుంది అన్నరు; తెలంగాణ లోగో, తెలంగాణ తల్లి రూపం మార్చేసిన్రు; అందెశ్రీ గేయాన్ని ఆలపించ వీలులేనంతగా సినీ సంగీత మసిలో ముంచి తేల్చిన్రు; అడవితల్లి గురించి పాటలల్లిన గద్దర్ పేరిట అవార్డును గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే పాత్రకు ఇచ్చిన్రు; ‘ఓకే అంటే ఓయోకు రమ్మన్నాడే’ పాటకు గద్దర్ పురస్కారం ఇచ్చిన్రు. ఇట్లా, ఒక్కొక్కరిని వెతికి వెతికి, వేటాడి వేటాడి ఆనవాలు తుడిచేస్తున్నరు.
తెలంగాణను బొంద పెట్టాలని ఎంతెంత ప్రయత్నాలు చేస్తున్నరో అంతకు రెట్టింపు ఎగిసి పడుతున్నది ప్రజా చైతన్యం. ఆ మేరకు బీఆర్ఎస్ ప్రభ పెరుగుతున్నది. ఇది అవశ్యం! ఎందుకంటే, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీయే. మరో మాట లేదు. ఇదంతా తెలుసు రాధాకృష్ణకు. రెండేండ్ల రేవంత్ పాలన పెట్టిన గోస ఫలితంగా ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరు’గా మరల మారుతున్నది. బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగల్ల ‘జాగీర్దారు’గా తన ప్రజలకు రక్షగా నిలబడింది. ఆ కడుపు మంటే మొన్నటి చెత్త పలుకు!
అధికారంలోకి వచ్చినకాడి నుంచి కాడి కిందపడేసి, పాలన అటకెక్కించి, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని నిందలపాలు చేయడమే పనిగా పెట్టుకున్నరు దుష్ట చతుష్టయం. ‘వారికి సమయం ఇద్దాం’ అంటూ బీఆర్ఎస్ వంద రోజులు ఆగింది గానీ, వారు మాత్రం తెల్లారి నుంచే చీకటి పనులు మొదలు పెట్టిన్రు. కాళేశ్వరంపై ఎంత నిందలు వేసినా, అది అద్భుతం అన్నది సుప్రీం కోర్టు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదు అన్నది ‘హిందూ’ పత్రిక. అయినా ఆగని విషమూక ఒక మహిళా జర్నలిస్టు బలవన్మరణాన్ని కూడా బురద జల్లుడుకు వాడుకున్నది. నికార్సయిన తెలంగాణ స్వరస్వేచ్ఛను మరణానంతరం వ్యక్తిత్వ హననం చేసిన్రు. సోషల్ మీడియా, యాంటీ సోషల్ మీడియా అన్నీ కలిసి ఈ దారుణాలు సాగించిన్రు. ‘పొరపాటున పెట్టిన థంబ్ నెయిల్’గా వర్ణించిన ఆర్కే ఎంతటి కుసంస్కారి అన్నది తేటతెల్లమైంది. ప్రశ్నించే గాంభీర్య పోజు పెట్టిన పిరికి మేకపోతు జడిసింది. తన కార్యాలయాల ముందు బందోబస్తు పెట్టుకుంది.
తెలంగాణ శత్రువులు అంతా ఒకటయిన్రు. మహాన్యూస్‌కు, ఆంధ్రజ్యోతికి క్యూ కట్టిన్రు. కేంద్రమంత్రి బండి సంజయ్ అన్ని విలువలు ఒదిలేసిన్రు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సొంత మట్టి బిడ్డలపై దాడులు చేస్తా అంటున్నడు. మీడియాకు గాని, రాజకీయ నాయకులకు గాని ఇంతటి బలుపు కలుగడానికి కారణం ఏమిటి? నియంత్రించే వ్యవస్థలు నిదురపోతున్నయా? ఎవరి శృంఖలాలను ఛేదించుకుని స్వతంత్య్రం పొందినమో, వారికే ఈ గడ్డను తిరిగి అప్పజెప్పడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోము. అందుకు ప్రయత్నాలు చేసే ఎవరినైనా ఉపేక్షించబోము.
ఆంధ్రా మూక చేస్తున్న దాడి కేసీఆర్‌పైనే అన్నట్టు చూడకండి. అది తెలంగాణపై దాడి. మన అస్తిత్వంపై యుద్ధం. మన సర్వ నాశనమే వారి పంతం. అందరూ ఒక్కటిగా నిలబడి తాకట్టులోని తెలంగాణను విముక్తం చేయాలి. ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అన్నోడు రేపు హైదరాబాద్ తెలంగాణ జాగీరా అంటడు’ అన్న నెటిజన్ శ్రీశైలం యాదవ్ ఆందోళన మనందరికీ వార్నింగ్ బెల్!
చివరగా రాధాకృష్ణకు, ఇంకా అతనిలాంటి నీచులకు ఒక హెచ్చరిక! మొన్న బనకచర్ల గాని, ఇప్పుడు మత్స్య బోర్డు తరలింపు గాని బీఆర్ఎస్ ఉన్నంతవరకు సాగవు. నీళ్లు బాబుకు, నిధులు రాహుల్‌కు, నియామకాలు ఆంధ్రా లాబీకి నడువవు. తెలంగాణ ‘జాగీర్’దార్ పార్టీ కాపాడుకుంటది తెలంగాణను. ఇక్కడి బిడ్డల పట్ల గుండె నిండా తడి ఉన్నది మాకు. దొంగల నుంచి, దోపిడీదారు ల నుంచి రక్ష మేమే. తెలంగాణ మా జాగీర్! మీ భయం కూడా అదే!!
Love everybody but never sell your sword అంటరు బ్రెజిల్ రచయిత పాలో కోయిలో. అందర్నీ ప్రేమిస్తది తెలంగాణ. అట్లని అస్తిత్వంపై దాడి జరిగితే ఊకోదు. కత్తి ఎత్తుతది. తెలుసుకొని మసులుకొండి!
పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉన్నా, తాము గెలవలేమని ఎరుక ధృతరాష్ర్టునికి. అవతల ఏడు అక్షౌహిణులే ఉన్నా, కృష్ణుడు ఉన్నడు, ధర్మం ఉన్నదనీ ఎరుకే. అధర్మానికి భయమెక్కువ. వణుకూ ఎక్కువ. మిడతల దండు లాంటి ఆంధ్రా లాబీ అండదండగా ఉన్నా ఆర్కేకు వణుకు మొదలైంది. దీనికి ఒక లాజికల్ ఎండ్ చూపించాల్సింది మనమే! జై తెలంగాణ!!