‘సోషల్ మీడియాలో ఏడ జూసినా మీ గురించే ముచ్చట సార్.. ఇటు ఫేసుబుక్కుల, అటు వాట్సప్పుల, ఇన్‌స్టాల, వగైరా, వగైరా… రాష్ట్రం మొత్తంల మీ గురించే చర్చ ఉరుకుతున్నది సారిప్పుడు’ అని పీఏ ఇడ్లీ తింటున్న సీఎం సార్‌కు శెప్పిండట. ‘శబ్బాష్ మరేమనుకుంటున్నవ్ మనమంటే! ఇంతకూ.. ఆరు గ్యారెంటీల మీదనే గదనయ్యా జనం మనల్ని మెచ్చుకుంటున్నది?’ అని పీఏను సీఎం సార్ అడగడంతో మీకు అట్లా అర్థమైందా సార్ అని ముక్కు మీద వేలేసుకున్నడట పీఏ. ‘అందుక్కాదు సార్, మొన్న మీరు మూడు సముద్రాల ముచ్చట శెప్పిర్రు గదా, అందుకే సార్ మీరిప్పుడు జనాల నోట్లో నానుతున్నరు’ అని పీఏ శెప్పంగనే మొహమంతా శిన్నగ జేసుకున్నడటా సీఎం సార్!
‘ముందు మురిసినమ్మ పండుగెరుగదు’ అన్నట్టే అయ్యింది ఆంధ్రా మందుబాబుల కథ. ‘బాబొస్తారొస్తారు, డెడ్ చీప్‌కే లిక్కర్ ఇస్తారు’ అని పాటలు వాడుకున్న మందుబాబులు ఇప్పుడు తలికాయ వట్టుకుంటున్నరట బాబు గోరు వెంచిన ధరలను జూసి. ‘బాబొచ్చిండు, మందు తెచ్చిండు.. కానీ, ధరలే మస్తు వెంచిండ’ని పరేషాన్ అయితున్నరట పాపం. ఇంతకుముందు ఒక్క వంద కాయితం ఇస్తే సరిపోయేదని, ఇప్పుడు రెండు వందల కాయితాలు రెండిచ్చినా చిల్లరనే చేతుల వెడ్తున్నరని వాపోతున్నరట. బాబు గోరు ఈ రకంగా సంపదను వెంచి చూపిస్తున్నట్టున్నడు ఏపీ ప్రజలకు. ఒకే సార్ ఆల్ ద బెస్ట్!
‘ఓడెక్కినంత సేపు ఓడ మల్లయ్య.. ఓడ దిగినంక బోడ మల్లయ్య అన్నట్టే ఉన్నది మా కాంగ్రెస్ నాయకుల కథ’ అని ఆ పార్టీ కార్యకర్తలు లోపల్లోపల దిగమింగుకుంటున్నరట వాళ్ల బాధను. గెలిపించినంత సేపు ‘కార్యకర్తలే మా దేవుళ్ల’ని కాళ్లు మొక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ‘కార్యకర్తలే పార్టీకి దెయ్యాలు’ అంటున్నరట పాపం. ఓరుగల్లు జిల్లాల కార్యకర్తలకు లీడర్లు అండగా ఉంటరనుకుంటే, లీడర్లే కార్యకర్తలను కొడుతున్నరట. కార్యకర్తలనే కొట్టుకుంటా, పైగా వాళ్ల మీద కేసులు వెడ్తున్నరట పాపం. వాళ్లు మా బాధను పై కమాండ్‌కు శెప్పుకుందామని గాంధీభవన్‌కు అస్తే సీన్ రివర్సైందట. కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన పీసీసీ అధ్యక్షుడు వాళ్లకే ఉల్టా క్లాస్ దీస్కొని పంపించిండట. మా పరిస్థితి ఇప్పుడు ‘ముందు జూస్తే నుయ్యి, ఎన్క జూస్తే గొయ్యి’ అన్నట్టే ఉన్నదని మస్తు బాధవడ్తున్నరట కాంగ్రెస్ కార్యకర్తలు!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కొడుకు ఓ స్కాంలో ఇరుక్కోబోయి జర్రంతల తప్పించుకున్నడట. కర్ణాటక రాష్ట్రంల ఏ మూల జూసినా ముడా స్కాం గురించే ఇప్పుడు చర్చ నడుస్తున్నది గదా? అటువంటి స్కామే ఇది. ‘మేము మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నం. బెంగళూర్‌లో ఐదెకరాల భూమి ఇవ్వండి’ అని సిద్ధార్థ విహార్ ట్రస్ట్ పేరు మీద ఖర్గే కొడుకు రాహుల్ ఖర్గే దరఖాస్తు వెట్టుకున్నడట. ‘అన్నం బెట్టేటోడు మనోడైతే బంతిల ఏ మూలగ్గూసున్నా…’ అన్నట్టు సిద్ధరామయ్య ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆ ఫైల్ మీన సంతకం జేసిందట. తీరా ముడా స్కాం బయటికి పొక్కడంతో ఖర్గే సార్ జాగ్రత్తలు వడ్డడట. ‘వద్దు బాబోయ్ వద్దు. భూమి వద్దు, మాకేమొద్దు’ అని శెప్పి మరీ దరఖాస్తు వెనక్కు తీసుకున్నడట. సార్‌ను జూసి ‘ప్చ్ పాపం, సార్ నోటి కాడి బుక్క కిందవోయింది’ అని కన్నడిగులు జాలివడ్తున్నరట.