దేశంలో ప్రస్తుతం నదుల అనుసంధానంపై జోరుగా చర్చ జరుగుతున్నది. నిత్యం జలసవ్వడులతో ఉరికే నదిని, నీరు లేక క్షీణించిపోతున్న నదులతో అనుసంధానం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల నీటి కొరతను అధిగమించవచ్చని, సాగును గాడిలో పెట్టవచ్చన్నది దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం. లక్ష్యం ఉన్నతమైనదే అయినా అది ఎంతవరకు ఆచరణీయం అన్నదానితో పాటు ప్రకృతికి విరుద్ధంగా వెళ్లడం ఎంతవరకు సబబన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనివల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని రాజకీయ వర్గాలు విస్మరిస్తున్నాయి.
మన ప్రధాని మోదీ గత డిసెంబర్ 25న కెన్-బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంత నీటి కొరతను తీర్చాలన్న ఉదాత్త లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశ నుంచే ఆందోళన వ్యక్తమైంది. ప్రాజెక్టులో భాగంగా పన్నా టైగర్ రిజర్వు ప్రాంతంలో డ్యామ్ నిర్మించనుండటంతో ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి.
ఇది పూర్తయితే టైగర్ రిజర్వు మునక తప్పదన్నది పర్యావరణవేత్తల ఆందోళన వెనకున్న కారణం. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కెన్ నదిలోని మిగులు నీరు కరువు పీడిత బుందేల్‌ఖండ్‌లోని బెత్వానదిలోకి చేరుతుంది. అయితే, 45 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టు నియమిత సాధికారిక కమిటీ సభ్యులు సహా నిపుణులు వద్దేవద్దని మొత్తుకున్నా కేంద్రం వినిపించుకోకుండా ముందుకెళ్తున్నది. నీటి కొరతకు నివారణకు అంతర్ బేసిన్ నీటి బదిలీ కోసం నదుల అనుసంధానమే పరిష్కారం అనే భావనను రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
నిజానికి నదుల అనుసంధాన ఆలోచన ఇప్పటిది కాదు. కృష్ణా, గోదావరి నదులపై డ్యామ్‌లను డిజైన్ చేసి న సర్ ఆర్థర్ కాటన్ 130 ఏండ్ల క్రితమే ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ను ప్రతిపాదించారు. దేశం గర్వించదగ్గ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ఆలోచనను మరిం త మెరుగుపరిచారు. ఆ తర్వాత కేఎల్ రావు, కెప్టెన్ దిన్షా జే దస్తూర్ వంటి వారు ఈ భావనను మరింత విస్తరించారు. మొదట్లో దీనిని ‘నేషనల్ వాటర్ గ్రిడ్’ అని పిలిచేవారు. అయితే, ఆ తర్వాత జలవనరుల మంత్రిత్వశాఖ దీనిని ‘నదుల అనుసంధాన ప్రాజెక్టు’ (ఐఎల్ఆర్)గా మార్చింది.
నదుల అనుంధానంలో భాగంగా తొలుత గంగ-బ్రహ్మపుత్ర నదుల లింకింగ్‌తో మిగులు జలాలను నీటి కొరతతో అల్లాడుతున్న మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు మళ్లించాలని భావించారు. 1982లో ఏర్పాటైన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఐఎల్ఆర్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మొత్తం 30 లింక్‌లను గుర్తించింది. వీటిని 14 హిమాలయన్, 16 ద్వీపకల్ప నదులుగా విభజించింది. ఇవి వరదలు, కరువు ప్రభావాలను తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయంలో నీటి కష్టాలను పరిష్కరించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నది.
ఇక, నదుల అనుసంధానం కోసం ప్రస్తుతం అంచనా వేసిన రూ. 5.5 లక్షల కోట్లలో సామాజిక, పర్యావరణ, నిర్వహణ ఖర్చులు కలపలేదు. చివరికి ఈ భారమంతా తిరిగి పన్నుల రూపంలో సామాన్యులపైనే పడుతుంది. అలాగే, హైడ్రోగ్రాఫిక్ వ్యవస్థల్లోని అనియంత్రిత మానవ ప్రేరిత అసమతుల్యత పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. వాతావరణ మార్పు, వర్షపాతం, నదీ ప్రవాహాన్ని ప్రభావితం చేసే మార్పులకు కారణమవుతుంది. అదే జరిగితే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు.
నిజం చెప్పాలంటే విధాన నిర్ణేతలు ఏ నదిలోనూ ‘ఉచిత’ మిగులు జలాలు లేవన్న అంశాన్ని విస్మరిస్తున్నారు.
నదుల ద్వారా మనం సముద్రంలోకి కోల్పోయే నీటిని ఎకో-హైడ్రోలాజికల్ సమస్యగా భావించకూడదు. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు మద్దతునిచ్చేవారు, రాజకీయ నాయకులు నదిని డ్రైనేజీ బేసిన్లో భాగమన్న విషయాన్ని అర్థం చేసుకోలేరు. లేదంటే ఉద్దేశపూర్వకంగానే దీనిని విస్మరిస్తారు. వరద నీటిని కూడా మనం మిగులు నీటిగా హేతుబద్ధం చేయకూడదు. వరదనీరు భూగర్భ జలాల పునరుద్ధరణకు, జీవవైవిధ్యానికి, కోట్లమంది అట్టడుగు ప్రజల జీవనోపాధికి సహాయపడుతున్నది. దానిని మనం ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.
సముద్రంలోని ఉప్పునీటిని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడే డెల్టాలు నదినీటిని మళ్లించడం ద్వారా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో సింధునది డెల్టా నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చని ‘ఎంపైర్స్ ఆఫ్ ది ఇండస్: ది స్టోరీ ఆఫ్ ఏ రివర్ (2008) పుస్తకంలో అలైస్ అల్బినియా రాసుకొచ్చారు. ఒకప్పుడు సింధునది వద్ద ఉన్న డెల్టా అప్పట్లో పాకిస్థాన్‌లోనే అత్యంత సంపన్నంగా ఉండేది. అయితే, బ్రిటిషర్లు అక్కడ బరాజ్ నిర్మాణాన్ని ప్రారంభించడం, 1947 తర్వాత పాకిస్థాన్ దానిని కొనసాగించడంతో అనంతరం ఆ ప్రాంతం పేదరికంలోకి జారిపోయినట్టు ఆమె వివరించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ పూర్తయ్యాక నర్మదా నది దిగువనున్న ప్రాంతాల పరిస్థితిని ఆధునిక కాలపు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే, ఇది మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ అనుసంధానాలు విపత్తులుగానే మిగిలిపోయాయి. వరదలను తగ్గించేందుకు 1954లో అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రంలోని కిస్సిమ్మీ నదీ జలాల మళ్లింపు చేపట్టారు. ఆ తర్వాత ఇది అతిపెద్ద పర్యావరణ విపత్తుగా మిగిలిపోయింది ప్రపంచంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటైన అరల్ సముద్రం పరిస్థితి కూడా ఇంతే. సహజ వ్యవస్థలను జియో ఇంజినీరింగ్ ప్రాజెక్టులు ఎలా నాశనం చేస్తాయో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. సోవియట్ యూనియన్ హయాంలో ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి నీటిని మళ్లించడంతో ఆ తర్వాత ఈ సరస్సు ఎడారిలా మారిపోయింది.
మన విషయానికి వస్తే నీటి సంక్షోభానికి స్వయంకృతాపరాధమే కారణమని చెప్పుకోవచ్చు. నీటి నిర్వహణ సరిగా లేకపోవడం, పర్యావరణానికి సరైన పద్ధతులు అనుసరించకపోవడం, చట్టంలోనూ కొంత అస్పష్టత, అవినీతి కారణంగా నీటి సంక్షోభం అదుపుతప్పుతున్నది. వాటర్‌షెడ్ నిర్వహణ సమర్థంగా ఉండాలి. నీటి వినియోగాన్ని నియంత్రించాలి. సాగునీటి వినియోగానికి రైతులు సమర్థవంతమైన వ్యూహాలను రూపొందిస్తే దీని నుంచి కొంత బయటపడొచ్చు. మురుగునీటి నిర్వహణపై ప్రభుత్వానికి పరిమిత నియంత్రణ మాత్రమే ఉంది. పునర్వినియోగ కార్యక్రమాలను రూపొందించడం ద్వారా కొరతను కొంత అధిగమించవచ్చు.
ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ విధానం సాగునీటిలో 25 నుంచి 75 శాతం ఆదా చేస్తున్నట్టు ‘లెట్ దేర్ బీ వాటర్: ఇజ్రాయెల్ సొల్యూషన్ ఫర్ ఏ వాటర్-స్టార్వ్డ్ వరల్డ్’ అనే పుస్తకంలో సేథ్ ఎం.సీగెల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ విజయగాథ ఇరిగేషన్ సాంకేతికతను రైతులు అందిపుచ్చుకునేలా చేసింది. ఈ విధానంలో తక్కువ నీరు, తక్కువ ఎరువులు, తక్కువ పురుగు మందులతోనే పంటలు పుష్కలంగా పండించుకోవచ్చు.
మన ప్రభుత్వం ‘హిందుత్వ’ను నొక్కి చెప్తున్నది. నదీమతల్లిని పూజించమని హిందూ విశ్వాసం చె ప్తుంది. మన ప్రభుత్వం ఈ రెంటినీ ప్రోత్సహిస్తూనే అం దుకు విరుద్ధమైన నదుల అనుసంధానం అనే భావన తో ముందుకు వెళ్తుండటమే ఆశ్చర్యం. ఆనకట్టల ద్వా రా నదీగమనాన్ని తారుమారు చేసి, మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో ధ్వంసం చేసి, మతపర మార్కెటింగ్ కోసం ముడిసరుకుగా మార్చేసిన మన నదులు ఇప్పు డు అస్తిత్వ ప్రమాదంలో ఉన్నాయి. వాటిని రక్షించేదెవరు?
– సీపీ రాజేంద్రన్
(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (బెంగళూరు) ప్రొఫెసర్ )
-‘ది హిందూ’ సౌజన్యంతో…