పురిటి నొప్పుల కోర్చిన పుడమి యేది
కష్ట నష్టాలు దాచిన కడలియేది
ధైర్యసాహసాల్ గల్గిన ధరణి యేది
యేది తెలగాణ గాకింకనేదియేది!
కరుణజూపు వేళ కన్నతల్లి మనసు
కడుపు నింపు వేళ కల్పతరువు
చేరికోరువేళ స్నేహితుడై నిల్చి
ఘనతగన్నది తెలంగాణ నిజము!
పక్కవారికి నింత పంచిపెట్టుటె గాని
పరుల సొమ్మును గోరు పట్టులేదు
పరుల కొరకు కష్టపడుట తెలియు గాని
శ్రమదోపిడి సేయు సరళి లేదు
పరుల సంస్కృతులపై భక్తి జూపుటె గాని
భేద భావముగనెడి బెట్టులేదు
బంధువర్గంబుగా పరుల దల్చుటెగాని
వైరులన్ భావించు వరుసలేదు!
మంచితనమున్న మనుజులై మసలుకొంటు
యున్నవారలము ధీరులము యున్నతులము
ఘనతగన్న తెలంగాణ కన్నబిడ్డ
లము గదా యింతటౌన్నత్య లక్షణులము!
కావ్యాలు వెలయించి కవులుగా రాణించి
పఠితల మెప్పించు పటిమయుంది
కమ్మని గీతాలు గానంబు సేయుచు
శ్రోతలన్ ఒప్పించు శోభయుంది
జీవమై శోభిల్లు చిత్రాలు చిత్రించి
చూపరులను గట్టు సుగుణముంది
నాటికల్ సినిమాల నటనలో జీవించి
ప్రేక్షకుల్నలరించు ప్రేరణుంది!
లలిత కళలన్ని మానేల వెలుగులీను
కళలు కత్తులై సమరాన కాలుదువ్వు
రెండువైపుల ముద్రణల్ నిండి జగతి
చెల్లుబాటగు నాణెమై యుల్లసిల్లు!
గడ్డి పరకగా తలయొగ్గి గడుపగలము
మించి కత్తిగా తలల ఛేదించగలము
తలచి నంతటన్ సాధించి నిలువగలము
గత చరిత్ర వారసులుగా బ్రతుకగలము
చేవగలిగిన తెలగాణ సేవకులము!!
-అమరవాది రాజశేఖర శర్మ