ఇంకా ఎన్నేండ్లు ఈ పంచాయితీ
రెండు నాల్కల ధోరణితో
మా నాల్కలపై తడిని దూరంజేసి
మీ భూములను తడుపుకొంటిరి
రెండు కండ్ల సిద్ధాంతంతో
మా కంటిని పొడిచి
మీ కాలువలోకి
నీళ్లు తరలించుకుపోతిరి..
తుంగభద్ర తూమునడుగు
తూట్లుబొడిచి నీళ్లను దోచిన
దొంగెవరో చెబుతుంది..
ప్రవహించే కృష్ణా నదినడుగు
కాయలు లెక్కిస్తూ
చెట్టునే అమ్మే
మీ కపటబుద్ధిని ఎరుకజేస్తది..
బానిసత్వానికి మేము
ఇంకా వారసులం కాదు..
నీళ్ల, నిజాల నిగ్గుతేల్చిన
విద్యాసాగర్‌రావు వారసులం..
మా వాటా మాకియ్యకుంటే
మీ పాట పాడనీకీ..
కాళ్లు మొక్కనీకీ మీ తొత్తులం కాదు..
నీళ్ల యుద్ధం మీకు కొత్తదేమో
ఉద్యమ నినాదం మాకు పాతదే..
తుప్పువట్టిన మీ బుర్రలకు జెప్పు
తాగు, సాగునీళ్లకు తూట్లు పొడిస్తే
తూటాలమై ఉద్యమిస్తం.
మాకు ఉద్యమాలు కొత్త కాదు
ఊపిరి తీసుకోవడం కొత్త కాదు..
నీళ్లయినా, నదులైనా కాజేయాలని జూస్తే
కర్రుగాల్చి వాతపెడుతం..
–ఉప్పరి తిరుమలేశ్
96189 61384