e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఎడిట్‌ పేజీ రాజకీయమూ అతడికి వ్యాపారమే

రాజకీయమూ అతడికి వ్యాపారమే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడుగులకు లభించిన చోటల్లా మూడెకరాల భూమి ఇచ్చి చేతులు దులుపుకోలేదు. దాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చి, పంటకు పెట్టుబడులు కూడా ఇచ్చి వారు ‘ఆత్మగౌరవం’తో బతికేలా చేశారు. కేసీఆర్‌ స్ఫూర్తితో మిగిలిన వారు కూడా పనిచేస్తే బడుగులకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ కీలక పదవిని అనుభవిస్తున్న ఈటల వంటి నాయకుడు ఏం చేయాల్సింది, ఏం చేశాడనేదే ఇక్కడ చర్చనీయాంశం.

‘ఎద్దు పుండు కాకికి ముద్దా’ అనేది సామెత. ఎద్దుకు పుండైతే.. కాకి ఆ పుండుకు చికిత్స చేస్తుందా? చేయదు. ఆ పుండు మీద పొడుచుకొని తింటుంది. ఎద్దు బాధ దానికి పట్టదు. ఈటల కూడా అదే చేశాడు. బాధ పడుతున్న పేదలను పొడుచుకుని తినాలనుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పేదలను కోడిపిల్లల మాదిరిగానే వ్యాపారానికి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆత్మాభిమానం అంటున్నాడు. ఈటల చెప్పేది ’ఆస్తభిమానం’ (ఆస్తి+అభిమానం).

రాజకీయమూ అతడికి వ్యాపారమే

తొండలు గుడ్లు పెట్టని బడుగుల భూము ల్లో తన హ్యాచరీలో ‘బడ్స్‌’ ఎలా పుడతాయో ఈటలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. సవారీ కట్రాలు పోని భూములలో పెద్ద బాట వేశానని చెప్పుకొంటున్న ఈటల, ఆయన వ్యాపారాభివృద్ధికి రోడ్డు మార్గం వేశారా? ఊరి ప్రజలు, పేదవర్గాల కోసం నిర్మించారా ఆయనే చెప్పాలి. పేదల మెరుగైన జీవితానికి, జీవన భరోసాకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే అసైన్డ్‌ భూములను ఎవరూ కొనరాదని, అమ్మరాదని ఈటలకు తెలియదంటారా? వీలైతే అది ఏ వేదికైనా బలహీనవర్గాల సముద్ధరణకు కట్టుబడి ఉన్నట్లు ప్రసంగాలు ఇచ్చే ఈటలకు బడుగుల భూములు తీసుకోకూడదన్న లౌకిక జ్ఞానం లేదని ఎవరైనా భావిస్తారా? ఆ వర్గాల భూములను లాక్కోవడం చట్టవ్యతిరేకం కాదా? ఆయన బయటకు చెప్పే బహుజన సిద్ధాంతానికి విరుద్ధమైంది కాదా? కాదు కాదు ఇది ఈటల కొత్తగా సూత్రీకరించిన ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం’ కాబోలు.

ప్రజా జీవితం, వ్యాపార జీవితం వేర్వేరు. నాటి కీలక ఉద్యమనేతగా, ప్రజాప్రతినిధిగా ఉన్నత స్థితిని పొందిన ఈటలకు ఉద్యమ నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇంతటి ఆర్థిక ఉన్నతికి ఎలా ఉపయోగించుకోవచ్చునో చేతలలో రుజువు చేసి చూయించారు. ఈటల తూటాల లాంటి మాటలు సామాజిక న్యాయాన్ని, సమ సమాజాన్ని కోరుకున్నాయని ఇన్నాళ్లుగా అందరూ భావించారు. ప్రజలు క్రమంగా ఆయన నిజ స్వరూపాన్ని గమనించి నేడు ఖంగుతింటున్నారు. ఈటల రాజేందర్‌ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సమర్థనీయమైనదని రోజురోజుకు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆచి తూచి వెలువరించే ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం తప్పేం కాదని ప్రజలు చర్చించుకోవడం శుభపరిణామం. రాజేందర్‌ తమ అసైన్డ్‌ భూములను బెదిరించి ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ కొద్దిరోజుల కిందట కొందరు బడుగు జీవులు ఫిర్యాదులు చేయడంతో, ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరిపింది. ఈ సందర్భంగా ఈటల పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తన వాదన వినిపించారు. తాను చేసిందేమిటో బహిరంగంగా చెప్పారు. ఇతరులు చేసిన ఆరోపణలు కాకుండా, ఆయన మాటల్లోనే ఆయన స్వభావమేమిటో, ఏం చేశాడో తెలుస్తున్నది.

కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పుడు గులాబీ జెండాను రెపరెపలాడించిన వారిలో అగ్రభాగాన ఉన్నవారు కమలాపూర్‌ నియోజకవర్గ ప్రజలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయభేరి మోగించింది. అప్పటికే ఈ నియోజకవర్గంలో ముద్దసాని దామోదర్‌రెడ్డి బలమైన నాయకుడు. టీడీపీ ఇక్కడ బలంగా ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమం విజృంభించగానే, స్థానికులు ముద్దసానిని గ్రామాలకు రాకుండా ఆయన వాహనానికి ఎక్కడికక్కడ అడ్డం పడుతున్నారని నాటి దిన పత్రికల్లో పతాక శీర్షికలు. తెలంగాణ ఉద్యమం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఉన్న ఈటల ఇదే అదనుగా టీఆర్‌ఎస్‌ బలంగా నాటుకున్న ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టాడు. నాటి నుంచి నేటి హుజూరాబాద్‌ వరకు ఆరుసార్లు టీఆర్‌ఎస్‌ తరపున టికెట్‌ పొంది పోటీ చేస్తూ గెలుస్తూనే ఉన్నాడు. సామాజికంగా బీసీ వర్గాలకు చెందిన రాజేందర్‌ను కేసీఆర్‌ ఆదరించి ప్రోత్సహించారు. ఇప్పటివరకు ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్న కాదనలేని చరిత్ర.

ఈటల ఏనాడూ తెలంగాణ ఉద్యమం అభివృద్ధికి పాటుపడలేదు. నిరంతరం బలహీనవర్గాల ప్రజా ప్రతినిధిగా, ఆ వర్గాల సమున్నతికి కృషిచేసే వాడిగా చెప్పుకొనే ఈటలకు మరి ఈ బడుగుల భూములే నయానో భయానో స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈటల స్వభావరీత్యా బలహీనవర్గాల ప్రతినిధే అయితే, ఆ బడుగుల దీనస్థితి చూసి కరిగి పోయేవాడు. వారికి బ్యాంక్‌ రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు, సదుపాయాలు కల్పించి, వారు ఆత్మాభిమానంతో బతికేలా చేయూతను ఇచ్చేవాడు. ఆ భూములలో ప్రభుత్వం ఉచితంగా, సబ్సిడీలతో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా బోర్లు వేయించేవాడు. బిందుసేద్యంతో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేవిధంగా చేయూతనందించేవాడు. ఆ అసైన్డ్‌ భూములు బంగారం పండించే పొలాలుగా మారిపోయేవి. వారి జీవితాలు మారిపోయేవి. వారిలో ఆత్మాభిమానం తొణికిసలాడేది. నిజంగా బలహీనవర్గాల పక్షపాతి అయితే ఈ విధంగా చేయాల్సింది, కానీ అలా చేయలేదు.

అసైన్డ్‌ భూములను చూడగానే కోడిపిల్లలను తన్నుకుపోయే గద్దలా మారిపోయాడన్న ఆ గ్రామాల ప్రజల విమర్శల్లో తప్పు లేదనిపిస్తున్నది. పేదల నుంచి ఆ భూములను వీలైతే చట్టబద్ధంగా లేకపోతే చట్టవిరుద్ధంగా ఎలా సొంతం చేసుకోవాలనేది ఆలోచించాడు. ‘తొండలు గుడ్లు పెట్టని ఆ భూముల’ను లీగల్‌గా సొంతం చేసుకోవాలనుకున్నానని ఆయనే స్వయంగా చెప్పాడు. పేదలు భూమిని అమ్ముకోవాలనుకుంటే ఈటల వారికి వద్దని నచ్చజెప్పాలి.

పేద ప్రజల ఎదుగుదలకు తోడ్పడాలి. ఇతరులు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆ భూములు కాజేయాలని చూస్తే తాను ప్రజా నాయకుడిగా అడ్డుపడాలి. కానీ కంచె చేను మేసినట్టు, తానే పేదల భూములు కాజేశాడు. పేదలకు ఉన్నది గదే అసైన్డ్‌ భూమి. కానీ ఈటలకు అప్పటికే ఎకరాల కొద్ది జాగ ఉన్నది. కోట్ల కొద్ది ఆస్తులున్నాయి. కానీ ఆయ న ఆశకు అంతు లేదు. ఆస్తులు పెంచుకోవాలనే పచ్చి స్వార్థం ఆయనలో ఉన్నది. పేదవాడి గోచీని గుంజేసుకుందామనుకున్నాడు. దాన్ని ఆత్మాభిమా నం అంటున్నాడు. ఈటల వైఖరికి కారణం లెక్కకు మించిన ధనం, ఆస్తులు, అధికారం కల్పించిన అహంకారంగానే భావించాలి.

డాక్టర్‌ వకుళాభరణం
కృష్ణమోహన్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాజకీయమూ అతడికి వ్యాపారమే

ట్రెండింగ్‌

Advertisement