‘మిత్రమా నీ మాటలు విశ్వసించి నిప్పు రాజేస్తిమి.. మునుగకుండుట కొరకు ఏమి సేయవలె?’ ‘హితుడా! ఏమంటివి.. ఏమంటివి ఈ మంట మండ దంటివా! ఎంతమాట.. ఎంతమాట! మతం నెపమున మనం పెట్టు చిచ్చు ఉచ్చు కన్నా బలీయమైనది నీవు ఎరుగవా? అయిననూ మనం ఇంతవారం అయినది ఎటులనో మరిచిపోతివా! మన మూక జననమెట్టిది. అట్టి మహా జుగుప్సాకరమైన పదవి పొందిన విధం బెట్టిది. నాతో సెప్పింతు వేమయా! కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకులన్ ఏడ్చు చుండన్.. నేడీ స్థాయికి చేరుకుంటివి. నాతో సెప్పింతువేమయా!
‘అమంగళం ప్రతిహతమగు గాక! నేను వల్లె వేయవలసిన పలుకులు నీవు చెప్పుచుంటివి. నాకు ఎసరుపెట్టు ఆలోచన అమితంగా ఉన్నట్లు తోచుచున్నది. మనం పరుల కొంపలో వేరు కుంపటి పెట్టు విధంగా ప్రలోభపెట్టాలి కానీ, మనలో మనం కలహించుకొనరాదన్న ఒప్పందం మరచినట్టున్నావ్’
‘మన్నించుడు మిత్రమా.. నీ కర్ణ పిశాచ యంత్రం నేను పెట్టుకొంటిని. తత్ ఫలితంగా కించిత్ అనువాద లోపం సంభవించినది. కన్నెర్ర చేసి నన్నునూ కాల్చివేయకు. నా పొట్టలో నీ రహస్యములు ఎన్నో దాగి ఉన్నవని గమనింపుడు. ఎంతైననూ ‘నెంబర్ టూ’ను కదా!’
‘నేను నెంబర్ వన్ అని ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన పనిలేదు. అయిననూ మన మధ్య సాంకేతిక పదజాల భాష ఎందులకు. వైరి పక్షములకు వల వేయునపుడు వీటిని ప్రయోగించవలె! సోదరా నూకరాజు.. తాజా పరిణామములపై నీ అభిప్రాయం తెలుపుడు’
‘అదియే మన తక్షణ కర్తవ్యం..’
‘తక్షణంగా అంటే కష్టమే కానీ,
ఆలోచింపుడు..’
‘కాసులు పునః రద్దు చేసినచో..’
‘మన కూష్మాండాలు బద్దలగును’
‘పోనీ, ఇంధన ధరలు తగ్గించినచో..’
‘వైరి పక్షాల బెదిరింపులకు తలొగ్గ వలెననా నీ అభిప్రాయం’ ‘అట్లయిన, ప్రభుత్వ సంస్థల విక్రయాలు నిలుపుదల చేసి ప్రయత్నించెదము’ ‘మహారాజ పోషకులు అలుగుదురు! అది అసాధ్యము’
‘జనుల ఖాతాల్లో పక్షం లక్షలు వేసినట్లయిన పాప పరిహారం కొంతైనా జరుగవచ్చు’ ‘విదేశాలకేగిన ఎగవేతదారుల రుణాలు తీర్చుటకే బొక్కసం ఖాళీ అయినది. ఇప్పుడు డొక్క చించుకున్ననూ కాణీ అలభ్యము’ ‘విధాన పరమైన నిర్ణయాలు తీసుకొనుట మనకు తెలియదు కదా! మరెట్లు..’ ‘నూకరాజు.. కంఠము వరకూ సన్నాలు మెక్కితివి కదా! ఉచిత సలహా అయిననూ ఇవ్వవచ్చును కదా!’
‘అదియే మన తక్షణ కర్తవ్యం.. అదియే..’ ‘ఏది అనిననూ అదియే అదియే.. అనుచున్నావు. నూకలు ఆరగించితివా ఏమి?’ ‘ఏమిటీ దీర్ఘంగా ఆలోచించుచుంటిరి. నా సేవలకు తరణం ఆసన్నమైనదని వేగిరంగా వచ్చితిని’ ‘శకటా రాయబారీ రమ్ము! మా శకుని మామ లేని లోటు నీవుయే తీర్చగలవు..’ ‘పూర్వాశ్రమ తేనీటి విక్రయ శీలా! నూకరాజు ఊకదంపుడు పదములు నాకు బోధపడినవి. అదియే.. అనగా ఏది అయితే మనం తరచూ చేయుదుమో అదియే అని భావము. మన అనగా మానకూడనిది అని గూడార్థం. కర్తవ్యం అనిన మన ప్రమేయం ఉన్ననూ లేదని బుకాయించు నేర్పరితనం’
‘బాగు శకటా! బాగుగా సెలవిచ్చితివి. అయిననూ మనం తరచూ చేయునదేమి?’ ‘ప్రభూ! మీకు బుద్ధి మాంద్యము వచ్చినదా ఏమి. నిర్మించడం మనకు తెలియనిది.’ ‘నిర్మించుటకు వ్యతిరేకం పడదోయడం’ బాగు బాగు! శకటా నీ మస్తిష్కంలో ఏమున్నదో తెలియదు కానీ, సదా చర్వణం చేసెడి సదరు పదార్థమందేదో విషయం దాగున్నది!!’
‘అయిననూ అదియే మన తక్షణ కర్తవ్యం..’ ‘సదరు నూకరాజును బయటికి తోలుకుపొండ్రు.. వాచాలుడు పదేపదే అదే అదే కూయుచున్నాడు..’ ‘అందులో అతని దోషమేమీ లేదు ప్రథమ మిత్రమా! ఈ శకటుడు చెప్పునది చెవిన వేసుకొనుడు..’ ‘ధర్మ యుద్ధం చేసినచో దక్షిణా పథంలో మన ధ్వజం రెపరెపలాడుట కల్ల! అందులకే కొంకణ దేశంలో, వింధ్యాచలంలో, అరుణగిరిలో వేసిన ఎత్తుగడనే ఇక్కడా వేయవలె’
‘ఎవరక్కడ.. దక్షిణా పథానికి వెళ్లుడు. దండిగా దక్షిణ సమర్పించుడు. భగీరథాంశతో జన రంజకంగా పాలన సాగిస్తున్న అక్కడి పాలకుడి పదవికి ఎసరుపెట్టుడు..’
‘శకటా! నీవు వేగిరముగ పోయి.. ఉప సమరాంగణంలో యథాప్రకారంగా అసత్యములను ప్రచారం చేయుము. ఈ కార్యమును స్వయముగా మేమే చూసుకొనెదము’
‘మనము నేరుగా బేరసారములు ఆడినచో ఇరుకునపడెదము. ఈ పాపము ఒడిగట్టుటకు ఎవరిని ఎంపిక చేసెదవు?’
‘పాపమని నీవే అనుచుంటివి కదా! మన పాపాలను ప్రక్షాళన గావించెడి స్వాములనే రంగంలోకి దించెద! పాపము వారి ఖాతాలో, ప్రతినిధులు మన వాటాలో.. ఎట్లున్నది’
‘అటులనే కానిండు! నిండు అమావాస్య తదుపరి దినమున ముహూర్తము! ఏమందురు?’
‘పాడు కార్యానికి.. పీడ కాలమే సరైన ముహూర్తము’
గ్రహణం పట్టుటకు ముందు..‘జై తుస్..’ ‘నాయనా నేను ద్వితీయాధిపతి పలుకున వారి ప్రతినిధిగా మాట్లాడుచుంటిని. మనవారు క్లుప్తం చేసినదానికి మీరేమందురు’ ‘ఏమందును! సరే-నందును. అయితే, ఈ కొనుగోలు అతి గోప్యముగా జరుగవలె’ ‘సందేహము వలదు. వంగ దేశమందు మా పనితనము గురించి లోకోత్తరంగా చెప్పుకొనుచుంటిరి. మీ చెవిన పడలేదా?’ ‘అవును స్వామీ! మీ లీలలు యావత్భారతానికీ విదితమే’ ‘అస్తు! అస్తు!! నేరుగా మీ మిత్ర మండలిని మా ద్వితీయాధిపతితో కలిపించెద. మీరు కోరినది అవశ్యము సిద్ధింపజేసెద. బెంగ వలదు.. ప్రథమాధిపతి అండ ఉండనే ఉంది!’
‘అటులైన! అంతకు ముందు మనమొకపరి కలిసిన ఉభయ కుశలోపరిగా ఉండునని నా అభిప్రాయము’ ‘తప్పకుండా నాయనా! ఇరువది ఆరో దినమున నేరుగా కలుసు‘కొనెదము”
‘సరి స్వామి! ఇక సెలవు’
గ్రహణం వీడిన మరుసటి రోజు.. హస్తినలో..
‘మిత్రమా! అన్నియునూ అనుకున్నట్లే జరుగుతున్నవి కదా!’ ‘నేను రంగమున దిగిన తదుపరి అనుకున్నట్లే జరుగును కదా! నేనే నేరుగా వాగ్దానం ఇచ్చియుంటిని. కావున, నీవు నిశ్చింతగా ఉండుము’
‘అటులనే, ఓయీ శకటా! ఈ ఎర ప్రక్రియ తేడా కొట్టినచో..’ ‘నలుగురమూ కలిసి టీ కొట్టెదము.. క్షమించుడి తేనీరు కొట్టు పెట్టుకొనెదము. మీ వ్యాపార మెలకువలు మాకునూ నేర్పవలెను సుమీ!’
‘ఇదియే మన తక్షణ కర్తవ్యము.. ఇదియే.. ఇదియే..’
-కణ్వస