రాత్రిపూట వెలుతురిచ్చు రాజెవ్వడూ/చందమామ చందమామ ఇంకెవ్వడూ; హృదయంలో అమృతమున్న సహృదయుడెవ్వడు’ అని లోకానికి ప్రేమామృతాన్ని పంచే చంద్రుని గూర్చి దాశరథి తెలియజెప్పాడు. వైరస్దాడితో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోగులకు భరోసా నింపుతూ సీఎం కేసీఆర్ గాంధీ హాస్పిటల్ పర్యటించారు. దవాఖానాలో కలియ దిరుగుతూ కరోనా కలికాలంలో రోగులకూ, వైద్య సిబ్బందికీ నేనున్నానంటూ కొండంత ధైర్యాన్నిచ్చారు. రెండో దశ కరోనా వ్యాప్తితో జనం అల్లాడిపోతున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కేవలం మాటలు చెప్పకుండా వ్యక్తిగతంగా చికిత్సపొందుతున్న వారి యోగక్షేమాలు అడుగుతూ, ఆప్తుని వలె అక్కున చేర్చుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి చికిత్సపొందుతున్న వారి వద్దకు పోయి కుటుంబ సభ్యునిలా కంటికి రెప్పలా కాపాడుతానని హామీ ఇచ్చిన తీరు రోగులకూ, వైద్య సిబ్బందికీ ఎనలేని ఆశ్వాసాన్నీ, విశ్వాసాన్ని ప్రోదిచేసింది.
వైరస్ ఉధృతితో ప్రజలంతా వణికిపోతున్న దుస్థితి. వైరస్‌తో చనిపోతే ఆప్తులూ, కన్నవారు సైతం కడచూపునకు కూడా సాహసం చేయలేని భయానక పరిస్థితి. శరీరమంతా కప్పి ఉండే పీపీఈ కిట్లతోనే కరోనా రోగుల వద్దకు వెళతారు. ఇలాంటి సమయంలో కూడా సీఎం కేసీఆర్ పీపీఈ కిట్ లేకుండానే కేవలం మాస్కుతో కరోనా రోగుల వద్దకు వెళ్లి మాట్లాడి సాంత్వన చేకూర్చిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ప్రజల యోగక్షేమాలను పట్టించుకునే పాలకుడంటే ఇలా ఉండాలి కదా అని అనుకునే పరిస్థితి వచ్చింది. క్లిష్టసమయాల్లో ప్రజలను ముందుండి నడిపించే సేనానిలా సీఎం కేసీఆర్ ఓ యోధునిలా ప్రవర్తించిన తీరు అందరిలో వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. కరోనాపై పోరులో అందరూ తెగువతో అడుగేయాల్సిన తరుణాన్ని తెలియజెప్పింది.
ప్రజారంజక పాలనకు విస్పష్ట ప్రజా సంక్షేమ, అభివృద్ధి రాజకీయ దృక్పథం ఎంత ప్రధానమో, ఎదుటిమనిషి కష్టాలకు కరిగిపోయే గుండెతడి అంతకన్నా ముఖ్యం. పట్టువదలని ఉక్కు సంకల్పంగల ఉద్యమ నేతగా కేసీఆర్‌కు ఎంత పేరు ఉన్నదో, గుండె తడిగల మానవీయత మూర్తీభవించిన సున్నిత మనస్కుడిగా అంత పేరు ఉన్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాష్ట్రసాధన కోసం త్యాగాలు చేసిన శ్రీకాంతాచారి బలిదానం సందర్భంలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మత్యాగం చేసిన యాదవరెడ్డి ఉదంతంలో కానీ గుండెలోతుల్లోంచి తన్నుకొచ్చే దుఃఖంతో ఆయన కన్నీరు గార్చిన సందర్బాలు ఎందరినో కదిలించాయి, ఉద్యమబాటన నడిపించాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలన్నింటిలో కేసీఆర్ సుతిమెత్తని హృదయం అంతర్లీనంగా దర్శనం ఇస్తుంది. తాజాగా గాంధీ హాస్పిటల్ సందర్శన కూడా దాన్నే నిరూపిస్తున్నది.