నాగరికత అభివృద్ధికి ఆధునికత తోడ్పడాలి కానీ, వినాశానికి దారి తీయకూడదు. మానవుడు ఆర్థికాభివృద్ధి కోసం ప్రకృతి వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. అడవులను నరికి వేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్ని మరింత పెంచి గ్రీన్ హౌజ్ వాయువులతో భూగోళాన్ని వేడెక్కించడం వంటి చర్యల ద్వారా పుడమి తల్లికి ప్రమాదం తెస్తున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా సాగించాలని సంకల్పించటం హర్షణీయం. ప్రజల భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో తెలంగాణ ‘హరిత నిధి’ని ఏర్పాటు చేశారు. అడవుల పరిరక్షణ కోసం వృక్ష ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నం చేస్తుంటాయి, కానీ ప్రభుత్వమే నడుం కట్టడం ఇదే తొలిసారి.
శతాబ్దాలుగా మనిషి సాగించిన ప్రకృతి వనరుల విధ్వంసం అత్యంత ప్రమాదకరంగా మారింది. భూతాపం పెరుగుదలకు, వాతావరణ మార్పులకు కారణభూతమై ప్రాణాంతక ఉత్పాతాలను సృష్టిస్తున్నది. ఒకవైపు భారీ వర్షాలు, తుఫాన్లు, వరదలు మరోవైపు కరువు కాటకాలు లాంటి పరస్పర విరుద్ధ వాతావరణ మార్పులు భూగోళంపై చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు భూతాపం పెరుగుదల ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. భూతాపం పెరుగుదల వల్ల హిందూ కుష్ హిమాలయ పర్వత ప్రాంతంలోని హిమనీ నదాలు కరిగిపోయే ప్రమాదం ఉన్నది. ఈమధ్య ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నందాదేవి హిమనీ నదాలు కరిగి ధౌలీ గంగ నదికి అకస్మాత్తుగా వరద సంభవించి ప్రాణ ,ఆస్తి నష్టం జరగడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గత ఏడాది దేశం ఎదుర్కొన్న ఎడారి మిడతల దండయాత్ర కూడా వాతావరణ మార్పుల ప్రభావమే. హిందూ మహా సముద్రంలో డై పోల్ ఏర్పడటం కారణంగా అరేబియా, తూర్పు ఆఫ్రికా ఎడారి ప్రాంతాల్లో తేమ పెరిగి మిడతల వృద్ధికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, వ్యవసాయ అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత, కార్చిచ్చు తదితర కారణాల వల్ల అటవీ సంపద క్షీణిస్తున్నది. గతంలో ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చు పర్యావరణానికి పెను ఉపద్రవాన్ని కలిగించింది. అడవులు భూమికి ఊపిరితిత్తులుగా పనిచేస్తాయి. సకల జీవరాశులకు ప్రాణవాయువును అందిస్తాయి. అడవుల తరుగుదల 24 శాతం కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నది. ఫలితంగా భూమి వేడెక్కుతున్నది. పర్యావరణ సమతుల్యానికి ఏ దేశంలో అయినా మూడో వంతు వైశాల్యంలో అడవులు ఉండాలి.
సుస్థిరాభివృది లక్ష్యాలు, వాతావరణ మార్పుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం హరితహారం పేరుతో నిర్దిష్ట లక్ష్యం ఏర్పర్చుకొని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల భాగస్వామ్యంతో నిరుపయోగ భూములు, ప్రభుత్వ స్థలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట భారీ స్థాయిలో చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటి వరకు.. ఏడు విడుతల హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 239 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 28 శాతానికి చేరింది. పర్యావరణ పరిరక్షణలో హరితహారాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్యక్రమంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా సాగించాలని నిర్ణయించటం హర్షణీయం. దీనికి ప్రజల భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్)ను ఏర్పాటు చేయడం ముదావహం. సాధారణంగా అడవుల పరిరక్షణ కోసం వృక్ష ప్రేమికులు, గిరిజన జాతులు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నం చేస్తుంటాయి, కానీ ఒక ప్రభుత్వం నడుం కట్టడం, దానిలో విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేయడం బహుశా ఇదే మొదటిసారి. ప్రజల నుంచి సొమ్ము సేకరణ ద్వారా తెలంగాణ సమాజంలో పచ్చదనం గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నది. పచ్చదనం పెంపులో భాగంగా మండలానికి ఒకటి చొప్పున 526 మండలాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుతో పాటు 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
అర్బన్ ఫారెస్ట్ పెంపులో భాగంగా 109 ఏరియాల్లో 75,740 ఎకరాల్లో అర్బన్ పార్క్‌లను అభివృద్ధిచేశారు. హరితహారం కార్యక్రమానికి బాసటగా సోషల్ మీడియా వేదికగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం ద్వారా హరిత భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాల ద్వారా ఆయా ప్రాంతాల్లో మొక్కల పెంపకం బాధ్యతలను ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. ‘జంగల్ బచావో- జంగల్ బడావో’ నినాదంతో తెలంగాణలో అడవులను 33 శాతానికి పెంచడం, జీవవైవిధ్య రచ్చబండ కార్యక్రమం ద్వారా జీవవైవిధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘ఎకాలజీ ఈజ్ పర్మినెంట్ ఎకానమీ’ అన్న భావనను తెలియజెప్పిన చిప్కో ఉద్యమ నేత సుందర్ లాల్ బహుగుణ స్ఫూర్తితో సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి. ప్రభుత్వం తలపెట్టిన ‘హరిత నిధి’కి ఇతోధికంగా సాయమందించాలి.
(వ్యాసకర్త: ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్,ఆలేరు)
డాక్టర్ చల్లా ప్రభాకర్ రెడ్డి