పాదయాత్రలకు
ముహూర్తాలు ఖరారయ్యేది
ఎన్నికల కాలం ముంచుకొస్తున్నంత వరకే..!
గుప్పిట మూసి
మాయచేసే కాలం
ఓటరు కండ్లుతెరిచి ప్రశ్నించే వరకే!
పగటి వేషగాళ్ల వాగ్దానాల వర్షంలో
మనం తడిసి ముద్దయ్యేది
పోలింగ్బూతుల నోళ్ళు మూతపడే వరకే..!
ఆకాశాన్ని దాచిన
నీరుగారే మబ్బులు
చెట్లు ఆహ్వానించే వరకే..!
అపోహలు, భ్రమలు
సృష్టించే అల్లకల్లోలాలు
నిజాలు నిగ్గు తేలేవరకే..!
ముసుగేసుకున్న పుకార్లు
తుఫానులై భీభత్సం సృష్టించేది
వివేకం నిద్ర లేచేవరకే..!
విషప్రచార చీకట్లు కమ్ముకున్న వేళ
అలుముకున్న భయాందోళనలన్నీ
చైతన్య దివిటీ వెలిగేవరకే..!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261