విద్యుత్, నీరు.. ఈ రెండింటి ప్రాధాన్యం పెరిగిన సందర్భంలో వాటి వినియోగంపై శాస్త్రీయంగా ఆలోచించాల్సిన సమయం ఇది. మనం తాగే, వినియోగించే నీటి చక్రం ప్రతి చర్య గురించి అంటే.. నీటిని ఎత్తిపోయడం, తరలించడం, శుద్ధి చేయడం, తర్వాత వ్యర్థ జలాలను సేకరించడం, శుద్ధి చేయడం కోసం అంతటా విద్యుత్‌ను వినియోగిస్తారు.
మానవ శ్రేయస్సు, పేదరిక నిర్మూలన, స్థిరమైన అభివృద్ధికి నీరు, విద్యుత్, ఆహారం ప్రాథమిక అవసరాలు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, వైవిధ్యభరితమైన ఆహారాలు, వాతావరణ మార్పుల ఒత్తిడిలో రాబోయే దశాబ్దాల్లో మంచినీరు, విద్యుత్, ఆహార డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణుల అంచనాలు. విద్యుత్, నీరు.. ఈ రెండింటి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో వాటిని వినియోగించడంపై శాస్త్రీయంగా ఆలోచించాల్సి ఉంది. నీటిని ఆదా చేయడమంటే విద్యుత్‌ను ఆదా చేయడమే, విద్యుత్‌ను ఆదా చేయడమంటే నీటిని ఆదా చేయడమే. విద్యుత్, నీటిరంగాల వినియోగం పరస్పరం అనులోమానుపాత సంబంధం కలిగి ఉన్నాయి. ప్రపంచ నీటి అవసరాలు 2050 నాటికి 10 శాతం పెరుగుతాయని అంచనా. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, జీవనోపాధి కోసం నీరు, విద్యుత్, వ్యవసాయం, మైనింగ్, రవాణా, ఇతర రంగాల మధ్య వనరుల కోసం పోటీ పెరుగుతున్నది.
నీరు- విద్యుత్ సంబంధాల సవాళ్లు, అవసరాలను పరిష్కరించడానికి మరింత సమగ్రమైన విధా నం అవసరం. తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృ ష్టం ఏమంటే.. ముఖ్యమంత్రిగా, ఉద్యమ, ప్రజాహిత నేత, ప్రజల అభివృద్ధి సంక్షేమాలే సర్వం అని నమ్మే వ్యక్తి మన కేసీఆర్ ఉండటం. నీరు, విద్యుత్ మీద వారికి ఉన్న అవగాహన వల్ల, ఈ రోజు ఇంకో పదితరాల కోసం పనికివచ్చే బహుళార్థ సాధక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమైంది. దీనిద్వారా తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు తీర్చిన అపర భగీరథుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
తెలంగాణలో వ్యవసాయ వినియోగంలో బోర్‌వెల్స్‌ను ఉపయోగించి వాటిని పంపింగ్ చేస్తారు. పంపింగ్ చేయడం ఖరీదైనది. దీనికోసం ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఉచిత విద్యుత్ విలువను పంపిణీ సంస్థలకు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇది సుమారు 6 వేల కోట్లుగా ఉంది. దీన్ని రైతులు అర్థం చేసుకొని నీటి వినియోగాన్ని అవసరం మేరకు ఉపయోగించుకొని నీటిని, విద్యుత్‌ను ఆదా చేయవలసిన అవసరం ఉన్నది.
ఉత్పాదకత కోల్పోకుండా, పంటకు నీటి వినియోగం గణనీయంగా తగ్గించడానికి సహాయపడే టెక్నాలజీ పెరిగింది. తక్కువ ఖర్చుతోనే 30 శాతం నీటిని ఆదా చేయవచ్చు. ఉదాహరణకు, పంజాబ్‌లో రైతులు అంతర్గతంగా ఒక తేమ సెన్సర్ టెక్నాలజీని ఎంచుకున్నారు. ఇది నీటికొరత ఉన్నప్పుడు సూచిస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల భూగర్భ నీటి వనరుల పరిరక్షణ జరుగుతుంది.
రైతుల కోసం ప్రభుత్వాలు సదుద్దేశంతో అందిస్తున్న ఉచిత విద్యుత్, నీటి పథకాల వల్ల నీరు, విద్యుత్ అవగాహన లేకుండా విస్తృతంగా వాడి వృథా చేయడానికి దారితీసింది. నీటిని, విద్యుత్‌ను వృథా చేయకుండా, పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్) రైతుల కోసం స్వచ్ఛంద పథకాన్ని ప్రారంభించింది. ‘నీటిని ఆదా చేయండి- డబ్బు సంపాదించండి’ (పానీ బచావో.. పైసా కమావో) అని పిలుపునిచ్చింది.
విద్యుత్ ఆధారిత బోర్ వాడకంలో ఆదా చేసిన ప్రతి యూనిట్‌కు రైతులకు రూ.4లను ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. అది నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమవుతున్నది. ఉదాహరణకు- ఒక రైతు పంటకు తగ్గ నీరుకు సరఫరా పరిమితి నెలకు వెయ్యి యూనిట్లు ఉంటే- సబ్ మెర్సిబుల్ పంప్ బీహెచ్పీ (బ్రేక్ హార్స్ పవర్) సామర్థ్యం ప్రకారం, వినియోగం 800 యూనిట్లు మాత్రమే వాడితే ఆదా చేసిన 200 యూనిట్స్‌కి గాను రూ.800లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేయబడుతుంది. వినియోగం పరిమితికి మించి ఉంటే, రైతులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిని తెలంగాణ ప్రాంత రైతాంగం అందిపుచ్చుకొని నీటిని, విద్యుత్ వనరులను పొదుపు చేసి భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉన్నది.
పంజాబ్‌లో రైతులకు ఇప్పటికీ పరిమిత గం టల ఉచిత విద్యుత్ లభిస్తున్నప్పటికీ, వారికి ప్రతి పంట కాలానికి నీటి నిర్ణీత పరిమాణాన్ని కేటాయించారు. వారు తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తే, ఆకర్షణీయమైన చెల్లింపును అందుకుంటారు. వారు పరిమితిని మించి వినియోగిస్తే, వారికి జరిమానా విధించబడదు. ఈ పథకానికి ప్రపంచబ్యాంకు కూడా మద్దతు తెలిపింది. రైతులు తమ విద్యుత్ వినియోగాన్ని లెక్కించడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చి అంగీకరించి మీటర్లు బిగించుకున్నారు. పంజాబ్‌లో భూగర్భజలాల క్షీణత జరగకుండా చూడటమే కాకుండా విద్యుత్‌ను ఆదా చేసే బాధ్యతను కూడా రైతులు తీసుకుంటున్నారు.
చైనా, అమెరికా రెండూ కలిసి వినియోగిస్తున్న భూగర్భ జలాలకు మించి మన దేశం 251 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నది. మన దేశ ప్రజలు, రైతులు, ప్రభుత్వాలు అందరూ ఒక్కసారి ఆలోచించాలి. ప్రస్తుతం ప్రపంచంలో నీటి వనరుల కోసం దేశాల, రాష్ర్టాల మధ్యన ఉద్రిక్తత నెలకొంటున్నది. ఇదిలాగే కొనసాగితే.. భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరిగే రోజులొస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలు మన నుంచి ఎక్కువ నీరు వినియోగించే పంటలు దిగుమతి చేసుకుంటున్నాయి.
తన్నీరు శ్రీరంగారావు