నేతలు, పార్టీలు ఇచ్చిన అజెండాలు చేతబట్టి దేశ పౌరులు నడుచుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు జనం అజెండా దేశం అజెండా కావాలి. ఇప్పటివరకు కొనసాగిన పాలన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయినందున ఓ ప్రజానుకూల శక్తి ఒకటి ఉద్భవించాల్సిన చారిత్రక సందర్భం ఆసన్నమైంది. ప్రజల ఆశలు కలబోసిన ప్రజా అజెండాకు రూపకల్పన జరగాలి. ప్రజాకాంక్షలు నెరవేర్చే ప్రజా అజెండా పాలనాపగ్గాలు చేతబట్టినప్పుడే దేశ సార్వభౌమత్వం నిలబడుతుంది.
75 ఏండ్ల పాలన మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయింది. వాటిని నెరవేర్చడానికి పీపుల్స్ అజెండా రూపొందించి ప్రత్యామ్నాయశక్తిగా నిలవాలి. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోతే ప్రత్యామ్నాయం సృష్టించుకుంటారు. సంపద సృష్టి జరగాలి. సంపద అందరికీ పంచాలి. దేశమంటే కోట్లాదిమంది సామూహిక శక్తి కదా! యువతరమూ నవతరమే దేశానికి ఉక్కు కండరాలు, రక ్తప్రసరణలు కదా. సకల సంపదల గుమ్మి అయిన మన దేశం పేదరికపు కంచంగా ఎందుకు మారింది! దేశంలో దుఃఖ నదులు ఎందుకు ఇంకా పొంగుతున్నాయి? మన ప్రజల ఆకాంక్షలు నెరవేరే దారే లేదా? ప్రజలు నేడు రక్షణ కరువై భయం గుప్పిట్లోకి ఎందుకు పోతున్నారు? తెచ్చుకున్న స్వాతంత్య్రం గుప్పెడు మంది సంపన్నుల చేతిలో ఎట్లా బందీ అయింది? మనం వాడే బకెట్, సబ్బు పెట్టె, తిరిగే కార్లు, కూర్చునే కుర్చీలు, రాసే కలమూ అన్నీ బయట దేశపోళ్ల తయారీలేనా? ఇన్ని కోట్ల చేతులున్నాయి. కోట్లమంది యువతరం నైపుణ్య శక్తి ఉన్నది. కావాల్సిన వనరులున్నాయి. కానీ మనం ఎందుకు వెనుకపడిపోతున్నాం!
పెద్దల్లారా.. దేశాన్ని పాలించే ప్రభువుల్లారా.. జనం గోస వినండి. మందిర్, మసీదు, చర్చీల దగ్గర దీనంగా దోసిళ్లు పట్టిన ఎండిన డొక్కల ప్రార్థనలను వినండి. ఇకనైనా మన దేశ అస్తిత్వ ఆలోచనలకు పదునుపెడదాం. పదండి.. తవ్విన మసీదుల కింద శివలింగాలను వెతుక్కోవడం ఇంకెన్నాళ్లు? దేశాన్ని మతాలుగా, కులాలుగా నిట్టనిలువుగా చీల్చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? మనుషులకు మతం స్టాంపులంటించి మనిషికి, మనిషికి మధ్య గోడలు కట్టడాన్ని ఎదిరిద్దాం. గొడవలు సృష్టించడాన్ని అడ్డుకుందాం. శాంతి, సామరస్యాలే మన అభిమతం అని చాటుదాం.
లౌకిక ప్రజాస్వామిక దేశంలో మతం మంటలతో భయంభయంగా బతికే దశ రావటం విషాదం. సుందర స్వప్నం కశ్మీర్ నేల భయానక నిత్య యుద్ధ భూమిగా చేసిందెవరు? ఇదేమిటని? ఇది సరికాదని ఎవరు మాట్లాడినా జైలు గేట్లు ఎందుకు తెరుచుకుంటున్నాయి? ప్రశ్నించటమే నేరమైపోయిందా? నిత్యం జనం ఆకాంక్షలు రాసే సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, ప్రణయ్ రాయ్లు కూడా నిఘా నీడల్లోకి పోతే ఎట్లా? ఎక్కడ సృజనశీల కలాలున్నా, ప్రగతిశీల కంఠాలున్నా అవి నిషేధాలకు గురికావటం దేనికి సంకేతం. నియంతృత్వం అంటే ఇది కాదా?
ఇంకా అందరికీ అందని మంచినీళ్లు. భావిభారత బిడ్డలందరికీ అందని పౌష్టికాహారం. తాగు, సాగునీరు లేదు. స్వాతంత్య్ర ఉద్యమ ఉత్తేజంతో మొదలైన ప్రభుత్వ పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఇది అన్యాయం అన్నవాళ్ల నోళ్లకూ సంకెళ్లు వేస్తున్నారు. విశాఖ ఉక్కు ఇప్పుడు ప్రైవేటు హక్కు. ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదాలు. దేశ సంపదంతా బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతున్న మార్కెట్ మాహా మాయాజాలం. ఇప్పుడు మన దేశం బడా పెట్టుబడిదారుల వెలుగు జిలుగుల అందం.దేశంలో వేల పరిశ్రమలు మూతబడ్డాయి. కోట్లాదిమంది కార్మికుల గుండె కోత. దేశ పాలకులు పాడేది ప్రజల పాట. చేసేది గుప్పెడు మంది పెట్టుబడిదారులకు దోచిపెట్టే ఆట. తెరవెనుక అన్నది లేదు. అన్ని తెరముందే. అంతా బహిరంగ వేలాలే. ఇదంతా మత మాయల లీల. కుల కొండీల కీచులాటలు.
ఓట్ల కోసం ఎన్నెన్ని రక్తచరిత్రలైనా రాయబడతాయి. చూస్తూ ఉందామా? ప్రజల ఆకాంక్షల అజెండాకు రూపకల్పన జరగాలి. యువతరమా ఆలోచించాలి. మన దేశం ఎటు దిక్కుగా నడవాలో నిర్దేశించాలి. అభివృద్ధి పథంలో ఎలా వడివడి అడుగులు వేయాలో ఆలోచించాలి. దేశాన్ని కమ్ముకుంటున్న కులమత కారుమేఘాల చీకట్లను పారదోలాలి. నవయువ శక్తులుగా యువతరం కదలాలి. ప్రజల అభిమతమే మన మతమనే తాత్వికతను ప్రతిష్ఠించాలి. దేశాన్ని రక్షించుకునే ప్రత్యామ్నాయ శక్తుల అజెండా
ఉద్యమంగా ఉప్పొంగాలి.
మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విద్వేషశక్తుల నుంచి దేశాన్ని రక్షించే బాధ్యతను స్వీకరిద్దాం. కుల, మతాలకతీతంగా మన దేశాన్ని మనం శక్తివంతంగా ని ర్మించుకుందాం. యువతరం చైత న్య ప్రదీప్తమై ముందునడువాలి. దేశాన్ని పురోగమన దశకు తీసుకపోవటమే కాదు, ప్రపంచానికే ఆదర్శం గా నిలుపుదాం. అన్యాయాలను, ఆధిపత్యాలను ధిక్కరించే పోరాటాన్ని తెలంగాణ నుంచే ప్రారంభిద్దాం. యువతరమా.., నవతరమా అదను ఇదే కదలిరమ్ము.
-జూలూరు గౌరీశంకర్ 94401 69896